ఉత్సాహ‘బరి’తం
-
కోటలో ప్రారంభమైన రాష్ట్రస్థాయి కబడ్డీ పోటీలు
-
మూడురోజుల పాటు నిర్వహణ
-
ప్రారంభించిన అఖిల భారత కబడ్డీ అసోసియేషన్ అ««దl్యక్షుడు కేఈ ప్రభాకర్
సామర్లకోట :
కూత మొదలైంది. ఉత్సాహ‘బరి’త వాతావరణంలో కబడ్డీ పోటీలు ప్రారంభమయ్యాయి. పట్టణంలో స్థానిక పల్లంబీడ్‌లో ఏర్పాటు చేసిన రాష్ట్రస్థాయి కబడ్డీ పోటీలను గురువారం అఖిల భారత కబడ్డీ అసోసియేషన్ అ««దl్యక్షుడు కేఈ ప్రభాకర్ ప్రారంభించారు. సాయంత్రం నాలుగు గంటలకు క్రీడలు ప్రారంభం కావాల్సి ఉండగా వర్షం కారణంగా రాత్రి ఎనిమిది గంటలకు ప్రారంభమయ్యాయి. ఫ్లడ్‌లైట్ల వెలుగులో మూడు రోజుల పాటు నిర్వహించే ఈ పోటీల్లో 13 జిల్లాలకు చెందిన మహిళ, పురుష జట్లు పాల్గొంటాయి. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమానికి జిల్లా కబడ్డీ అసోసియేషన్ అధ్యక్షుడు, పోటీల నిర్వాహక కార్యదర్శి బోగిళ్ల ముర ళీకుమార్ అధ్యక్షత వహించగా ప్రభాకర్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ప్రభాకర్ మాట్లాడుతూ సామర్లకోట పట్టణ యువకులు పట్టుదలతో రాష్ట్రస్థాయి కబడ్డీ పోటీలను నిర్వహించడం వల్ల సామర్లకోటకు ప్రాధాన్యమిచ్చామన్నారు. జాతీయ స్థాయి పురుషుల కబడ్డీ పోటీలు రాజస్థాన్‌లోను, మహిళల కబడ్డీ పోటీలు పాట్నాలోను జరుగుతాయని చెప్పారు. ఆ పోటీల్లో పాల్గొనే రాష్ట్ర జట్టు సామర్లకోటలోనే ఎంపిక చేస్తామని తెలిపారు. ఏషియన్ గేమ్స్‌లో కబడ్డీలో బంగారు పతకం సాధించామని ఆయన గుర్తు చేశారు. ఎమ్మెల్సీ బొడ్డు భాస్కరరామారావు మాట్లాడుతూ రాష్ట్ర స్థాయి కబడ్డీ పోటీలు నిర్వహించడం సామాన్యమైన విషయం కాదని, కమిటీ సభ్యులను అభినందించారు. జెడ్పీ చైర్మన్ నామన రాంబాబు మాట్లాడుతూ క్రీడాకారులకు మాత్రమే గెలుపు, ఓటమిలను సులభంగా తీసుకునే అవకాశం ఉంటుందన్నారు. మున్సిపల్ చైర్‌పర్సన్ మన్యం పద్మావతి మాట్లాడుతూ ఆటలను స్నేహపూర్వకంగా ఆడాలన్నారు. రాష్ట్ర కార్మిక సంఘ నాయకుడు దవులూరి సుబ్బారావు మాట్లాడుతూ యువత ఎక్కువగా ఉన్న మన దేశంలో క్రీడలపై మరింత శ్రద్ధచూపాలన్నారు. మున్సిపల్ వైస్ చైర్మన్ యార్లగడ్డ రవిచంద్రప్రసాద్, ఆంధ్ర కబడ్డీ అసోసియేషన్ చైర్మన్ శ్రీధర్ ఆనంద్, కార్యదర్శి వి.వీరలంకయ్య, కోశాధికారి ఎం. రంగారావు, జిల్లా ఒలింపిక్ అసోసియేషన్ అధ్యక్షుడు చుండ్రు గోవిందరాజులు, కార్యదర్శి పద్మనాభం, జిల్లా కబడ్డీ అసోసియేషన్ కార్య దర్శి ఎం.శ్రీనివాస్‌కుమార్, కోశాధికారి ఏవీడీ ప్రసాద్, జాతీయ కబడ్డీ కోచ్ పోతలు సాయి, మాజీ మున్సిపల్ వైస్ చైర్మన్ గోలి వెంకటఅప్పారావు చౌదరి, పసల సత్యానందరావు, పంచా రామ క్షేత్ర ట్రస్టు బోర్డు చైర్మన్ కంటే బాబు, ఆస్పత్రి అభివృద్ధి కమిటీ చైర్మన్ అడబాల కుమార స్వామి, డిప్యూటీ సీఎం తనయుడు నిమ్మకాయల రంగనాగ్, రాష్ట్ర టీడీపీ ప్రచార కార్యదర్శి మన్యం చంద్రరావు, జిల్లా వాణిజ్య విభాగపు కార్యదర్శి గుమెళ్ల రామకృష్ణ తదితరులు పాల్గొన్నారు. స్థానిక మఠం సెంటర్ నుంచి పల్లం బీడ్‌లోని కోర్టు వరకు క్రీడాకారులు ర్యాలీగా తరలి వచ్చారు. ముఖ్య అతిథులు క్రీడా జెండాలను బెలూన్లు ఎగుర వేసి క్రీడలకు స్వాగతం పలికారు. అదే విధంగా కోర్టును వారు ప్రారంభించారు. పురుషుల విభాగంలో తూర్పు– కడప జట్ల మధ్య, మహిళల విభాగం నుంచి కర్నూలు– గుంటూరు జట్లతో పోటీలు ప్రారంభమ అయ్యాయి. రాష్టంలో వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన పీఈటీలు న్యాయ నిర్ణేతలుగా
వ్యవహరించారు.