నేటి నుంచి ‘ఆడుదాం ఆంధ్రా’ అమీతుమీ!  | Arrangements are complete for state level competition in Visakhapatnam | Sakshi
Sakshi News home page

నేటి నుంచి ‘ఆడుదాం ఆంధ్రా’ అమీతుమీ! 

Published Fri, Feb 9 2024 5:10 AM | Last Updated on Fri, Feb 9 2024 5:10 AM

Arrangements are complete for state level competition in Visakhapatnam - Sakshi

ఆడుదాం ఆంధ్ర పోటీల ప్రారంభ వేదిక ఏర్పాట్లలో సూచనలిస్తున్న శాప్‌ వీసీఎండీ ధ్యాన్‌చంద్‌

విశాఖ స్పోర్ట్స్‌: యువతను క్రీడల్లో ప్రోత్సహించేందుకు ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న ‘ఆడుదాం ఆంధ్రా’ తుది పోటీలకు విశాఖ సిద్ధమైంది. 14,997 గ్రామాల నుంచి మెన్, వుమెన్‌ జట్లు ఐదు క్రీడల్లో నిర్వహిస్తున్న పోటీల్లో సత్తా చాటేందుకు సిద్ధమయ్యాయి. 50 రోజుల పాటు సాగనున్న ఈ పోటీల్లో ఇప్పటికే నాలుగు దశలు పూర్తయ్యాయి. 37.5 లక్షల మంది  మెన్, వుమెన్‌ క్రీడాకారులు గ్రామ స్థాయి పోటీల్లో పాల్గొన్నారు. శుక్రవారం నుంచి చివరిదైన ఐదో దశ రాష్ట్ర స్థాయి పోటీల్లో 26 జిల్లాల్లో విజేతలుగా నిలిచిన జట్లు విశాఖలో అమీతుమీ తేల్చుకుంటాయి.

12.21 లక్షల నగదు ప్రోత్సాహాకాల్ని సత్తా చాటిన జట్లు సొంతం చేసుకుంటాయి. ఇప్పటికే నియోజకవర్గ, జిల్లా స్థాయిల్లో విజేతలు నగదు ప్రోత్సాహాకాల్ని అందుకోగా, తుది పోరులో రాష్ట్ర టైటిల్‌తో పాటు ప్రోత్సాహాకాల్ని సీఎం వైఎస్‌ జగన్‌ చేతుల మీదుగా అందుకోనున్నారు. వైఎస్సార్‌ అంతర్జాతీయ క్రికెట్‌ స్టేడియంలో మెన్‌ క్రికెట్‌ టైటిల్‌ పోరును ముఖ్యమంత్రి ప్రత్యక్షంగా వీక్షించనున్నారు. ఆడుదాం ఆంధ్రా రాష్ట్ర స్థాయి పోటీల ప్రారంభ వేడుక రైల్వే స్టేడియంలో జరగనుంది. రాష్ట్ర క్రీడా పర్యాటక శాఖ మంత్రి ఆర్‌కే రోజా పోటీలను ప్రారంభించనుండగా, విశాఖ జిల్లా ఇన్‌చార్జి మంత్రి విడదల రజని గౌరవ అతిథిగా హాజరుకానున్నారు. ప్రారంభ వేడుకల్ని ఘనంగా నిర్వహించేందుకు రాష్ట్ర క్రీడాప్రాధికార సంస్థ వైస్‌ చైర్మన్, మేనేజింగ్‌ డైరెక్టర్‌ ధ్యాన్‌చంద్‌ గురువారం స్టేడియంలో ఏర్పాట్లను ప్రత్యక్షంగా వీక్షించి పలు సూచనలు చేశారు. 

విజేతలకు రూ.5 లక్షల నగదు ప్రోత్సాహకాలు 
వైఎస్సార్‌ స్టేడియంలో 50 రోజుల క్రీడా పండగ ముగింపు కార్యక్రమాన్ని 13న భారీగా నిర్వహించేందుకు సన్నాహాలు చేస్తున్నామని జిల్లా కలెక్టర్‌ మల్లికార్జున తెలిపారు. ఈ టోర్నీ ద్వారా సత్తాచాటిన ఆటగాళ్లకు  మరిన్ని మెలకువలు నేర్పేందుకు చెన్నయ్‌ సూపర్‌ కింగ్స్‌ పరిశీలకులతో పాటు ఆయా క్రీడల్లో నిష్ణాతుల్ని ఈ మ్యాచ్‌లు చూసేందుకు ఆహ్వానించామన్నారు. ఇదిలా ఉండగా, రాష్ట్ర స్థాయిలో క్రికెట్, వాలీబాల్, ఖోఖో, కబడ్డీలో విజేతగా నిలిచిన జట్లు ఐదు లక్షల నగదు ప్రోత్సాహాకాన్ని అందుకోనున్నాయి. రన్నరప్‌ జట్లు మూడు లక్షలు, సెకండ్‌ రన్నరప్‌ జట్లు రెండు లక్షలు అందుకోనున్నారు. బ్యాడ్మింటన్‌ డబుల్స్‌లో విజేతగా నిలిచిన జట్లు రెండు లక్షలు అందుకోనుండగా.. రన్నరప్‌ లక్ష, సెకండ్‌ రన్నరప్‌ జోడి యాభై వేలు అందుకోనుంది.

ఏయే ఆటలు ఎక్కడంటే.. 
రాష్ట్ర స్థాయిలో పోటీపడేందుకు అన్ని జిల్లాల నుంచి 1,482 మంది పురుషులు, 1,482 మంది స్త్రీలు క్రికెట్, వాలీబాల్, బ్యాడ్మింటన్, కబడ్డీ, ఖోఖో జట్లుగా ఆడేందుకు అర్హత సాధించాయి. వారికి స్థానికంగా ఉన్న టిడ్కో గృహాల్లో ఏర్పాట్లు పూర్తయాయి. భద్రతను దృష్టిలో పెట్టుకుని వుమెన్‌ క్రికెట్‌ పోటీలను వైఎస్సార్‌ బి గ్రౌండ్‌లోనే నిర్వహించనుండగా, మెన్‌ క్రికెట్‌ పోటీలను రైల్వే స్టేడియం గ్రౌండ్, ఏఎంసీ గ్రౌండ్, కొమ్మాది కేవీకే స్టేడియం గ్రౌండ్‌లలో నిర్వహించనున్నారు. కబడ్డీ, ఖోఖో కోసం ఏయూ గోల్డెన్‌ జూబ్లీ గ్రౌండ్, వాలీబాల్‌ కోసం ఏయూ సిల్వర్‌ జూబ్లీ గ్రౌండ్‌లను సిద్ధం చేశారు. బ్యాడ్మింటన్‌ కోసం జీవీఎంసీ ఇండోర్‌ స్టేడియంలో ఐదు కోర్టులను వినియోగించనున్నారు.

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement