కబాలి మానియా..
జిల్లా వ్యాప్తంగా థియేటర్లలో సందడి
అభిమానుల్లో పండుగ వాతావరణం
సప్తగిరికాలనీ: సూపర్‌స్టార్ రజనీకాంత్ నటించిన కబాలి సినిమా నేడు జిల్లావ్యాప్తంగా పలు థియేటర్లలో సందడి చేయనుంది. ఇప్పటికే సినిమాపై ప్రపంచవ్యాప్తంగా పెద్దఎత్తున ప్రచారం జరిగింది. ట్రైలర్, టీజర్‌లకు పెద్ద ఎత్తున స్పందన రాగా.. నేడు విడుదలకు సిద్ధమైంది. కొన్ని గంటల్లో సినిమా చూడనున్న అభిమానుల ఆనందోత్సవాలకు హద్దు లేకుండాపోయింది. కబాలి విడుదలకు జిల్లా కేంద్రంలో పెద్దఎత్తున థియేటర్ల యజమానులు ఏర్పాట్లుచేశారు. థియేటర్ల ముందు రజనీకాంత్ భారీ కటౌట్‌లను ఏర్పాటుచేశారు. మొత్తం నగరంలో ప్రతిమ మల్టిప్లెక్స్‌తోపాటు ఐదు థియేటర్లలో సినిమా విడుదలకానుంది. జిల్లాలోని గోదావరిఖని, పెద్దపల్లి, హుజూరాబాద్, సిరిసిల్ల, జగిత్యాల, వేములవాడ, కోరుట్ల, మెట్‌పల్లి, జమ్మికుంట, హుస్నాబాద్, కమలాపూర్, ముల్కనూర్‌లో భారీఎత్తున విడుదలకు సిద్ధమైంది. సినిమా విడుదలకు ముందు రోజు టికెట్ బుకింగ్ సౌకర్యం ఏర్పాటుచేయగా.. హాట్ కేకుల్లా టికెట్లు అమ్ముడయ్యాయని పలువురు యజమానులు తెలిపారు. రెండు, మూడు రోజులు హౌస్‌ఫుల్ అయితే సుమారు కోటికి పైగా వ్యాపారం జరగవచ్చన్న అంచనాలు వేసుకుంటున్నారు. కబాలి సినిమాను చూసేందుకు జిల్లాలోని పలువురు సెలబ్రిటీలకు సైతం తాకింది. సినిమా చూసేందుకు ఇప్పటికే టికెట్‌లను బుక్ చేయించుకున్నారు.