కబ్జా కన్ను...
కబ్జా కన్ను...
Published Tue, Oct 25 2016 11:38 PM | Last Updated on Mon, Sep 4 2017 6:17 PM
– విమానాశ్రయ మిగులు భూముల ఆక్రమణకు యత్నాలు
– చేతులు మార్చి అమ్మకాలకు మళ్లీ ప్రయత్నాలు
తాడేపల్లిగూడెం :
తాడేపల్లిగూడెంలోని విమానాశ్రయ భూములపై అక్రమార్కుల కళ్లు పడ్డాయి. నిన్నమొన్నటి వరకూ చాలామంది బినామీలు, దళారులు, గుర్తింపులేని సంస్థులు విమానాశ్రయ భూములను వ్యాపార వస్తువుగా మార్చుకున్నాయి. నేటికీ వీటి క్రయవిక్రయాలు కొనసాగుతుండగా.. కబ్జాదారుల ఆక్రమణల దాహం తీరలేదు. కొద్దోగొప్పో మిగిలి ఉన్న భూములపై తాజాగా కబ్జాకోరుల కన్ను పడింది. ప్రై వేటు భూములకు ఆనుకుని ఉన్న భూమిని ఆక్రమించుకునే ప్రయత్నాలు మొదలయ్యాయి. అడ్డుకోబోయిన అధికారులకు అవరోధాలు కల్పిస్తున్నారు. ముందుగా నాలుగు రాటలు పాతడం.. ఆనక చిన్నపాక వేయడం.. పక్కా భవనం నిర్మించడం.. చివరగా సమీపంలోని స్థలాన్ని అక్రమించుకుంటూ వెళ్లి విక్రయించడం వంటి కార్యకలాపాలు మళ్లీ ఊపందుకుంటున్నాయి.
కోతిబొమ్మ సెంటర్‌లో..
కోతి బొమ్మ సెంటర్‌లో రెవెన్యూ శాఖ అధీనంలో ఉన్న విమానాశ్రయ భూములపై గద్దల కన్ను పడింది. వీకర్స్ కాలనీకి వెళ్లే మార్గంలోను, గణేష్‌నగర్‌కు వచ్చే మార్గంలోను గల రెండెకరాల భూమిని కబ్జా చేసేందుకు కొందరు వ్యక్తులు ప్రయత్నాలు ప్రారంభించారు. కోట్లాది రూపాయల విలువైన ఈ భూముల్లో నీకింత, నాకింత అన్నట్టుగా పంచుకునేందుకు రంగం సిద్ధం చేశారు. ప్రభుత్వం ఇటీవల విడుదల చేసిన జీవో ప్రకారం విమానాశ్రయ భూముల్లో ఇప్పటికే ఇళ్లు నిర్మించుకున్న వారికి ఆయా ఇళ్లను మార్కెట్ విలువకు అనుగుణంగా రిజిస్ట్రేషన్ చేయించుకోవచ్చు. ఈ క్రమంలో రాత్రికి రాత్రే అక్కడి బూముల్లో పక్కా భవనాలు వెలుస్తున్నాయి. సిపాయి కాలనీ సమీపంలో ఇలాంటి నిర్మాణాలు సాగుతున్నా పట్టించుకోవడం లేదనే విమర్శలున్నాయి.
Advertisement
Advertisement