tpgudem
-
నవ్వుల రేడు.. రేలంగి
13న హాస్యనట కిరీటి జయంత్యుత్సవం ఆ నటన.. హావభావాలు అజరామరం ఆయన లేకున్నా.. పండించిన హాస్యం పదిలం తాడేపల్లిగూడెంలో స్థిరపడిన మహానటుడు పట్టణంతో పెనవేసుకున్న బంధం చూడగానే నవ్వు తెప్పించే ఆహార్యం.. అబ్బుర పరిచే హావభావాలు. పొట్ట చెక్కలయ్యేలా నవ్వించే చమక్కులు.. ఇవన్నీ అలనాటి సినీ హాస్య నటుడు రేలంగి వెంకట్రామయ్య సొంతం. ఆయన తర్వాత ఎందరు హాస్య నటులు వచ్చినా ఆయన ముద్ర చెరిగిపోనిది. ఆయన పంచిన నవ్వు తరగిపోనిది. ఈనెల 13న రేలంగి జయంత్యుత్సవం సందర్భంగా ఆ మహా హాస్య నట కిరీటి ప్రస్థానం గురించి ఓ సారి.. తాడేపల్లిగూడెం ఒకటా.. రెండా.. ఎన్నో పాత్రలు.. హాస్యనటునిగానూ డ్యూయెట్లు.. సోలో సాంగ్స్.. అన్నింటిలోనూ మెప్పించి తనకు తానే సాటి అని నిరూపించుకున్న రేలంగి వెంకట్రామయ్య.. నటనా చాతుర్యం అజరామరం. ఆయన పండించిన హాస్యం ప్రేక్షకుల మదిలో ఇప్పటికీ పదిలం. తొలి పద్మశ్రీ అవార్డు అందుకున్న హాస్యనటుడు ఆయన. ’సరదా..సరదా.. సిగరెట్టు.. ఇది దొరల్ తాగు సిగరెట్టు.. పాటలో ఆయన పలికించిన హాభావాలు ఇప్పటికీ ఎవర్గ్రీన్. పారశీకం ఏంటి.. పరుషకం.. పరుషకం... టోపీ టింగురంగగా ఉందే అంటూ పాతాళభైరవిలో రాణీగారి తమ్ముడి పాత్రలో మెరిసిన రేలంగి నటన అద్భుతం. శర్మా... కరపీడనమే కదా చేయమను అంటూ మాయాబజారులో లక్ష్మణకుమారుని పాత్రకు వన్నె తెచ్చిన మేటి నటుడు రేలంగి. అదే సినిమాలో నాన్నగారు కోతి.. కోతిపిల్ల అంటూ.. భయంతో కూడిన హాస్యం పండించి విమర్శకుల ప్రశంసలందుకున్నారు రేలంగి. ఆయన నటనా కౌసలానికి ఈ చిత్రం నిలువెత్తు నిదర్శనం. 1935 నుంచి 1975 వరకు సుమారు 40 ఏళ్ల సినీ ప్రస్థానంలో రేలంగి నిత్యం హాస్యరస గుళికలను ప్రేక్షకులకు అందించారు. కడుపుబ్బా నవ్వించారు. నటుడిగా, నిర్మాతగా, గాయకుడిగా బహుముఖ ప్రజ్ఞ చూపించి మెప్పించారు. రేలంగి సినీ ప్రస్థానం ఇదీ.. తూర్పుగోదావరిజిల్లా రావులపాలెంలో 1910 ఆగస్టు 13న జన్మించిన ఆయన 1919లో బృహన్నల నాటకంలో స్త్రీపాత్ర ద్వారా నాటకరంగం ప్రవేశం చేశారు. ఎస్.వి.రంగారావు వంటి వారు సభ్యులుగా ఉన్న చెన్నైలోని యంగ్‌మెన్ హ్యాపీ క్లబ్లో చేరారు. 1931లో భక్తప్రహ్లాద సినిమా చూసి.. సినిమాలలో వేషాల కోసం కోల్‌కతా వెళ్లి సినీదర్శకుడు సి.పుల్లయ్యను కలిశారు. ఆయన నిర్మిస్తున్న శ్రీ కృష్ణతులాభారంలో పాత్ర పొందారు. వరవిక్రయం, గొల్లభామ వంటి సినిమాలలో నటించారు. గుణ సుందరి కథ సినిమాతో రేలంగికి మంచిపేరు వచ్చింది. మిస్సమ్మ, మాయాబజార్, దొంగ రాముడు, వెలుగునీడలు, విప్రనారాయణ, నర్తనశాల, అప్పుచేసి పప్పుకూడు వంటి సినిమాలు ఆయనను అగ్రభాగాన నిలబెట్టాయి. ఆయన నటించిన ఆఖరి చిత్రం పూజ (1975). గిరిజ, సూర్యకాంతంలతో డ్యూయెట్లు అప్పట్లో సినిమాలో రేలంగి ఉంటే ఆయన పక్కన నాయికలూ ఉండాల్సిందే. గిరిజ , లేదంటే సూర్యకాంతం ఎక్కువగా ఆయన పక్కన నటించి మెప్పించారు. అప్పుచేసి పప్పుకూడు సినిమాలో కాశీకి పోయానో రామా హరి.. గంగ తీర్థంబు తెచ్చాను రామా హరీ అనే పాటలో గిరిజ, రేలంగి ప్రదర్శించిన హాస్య నటన ప్రేక్షకులకు చిరకాలం గుర్తుండిపోతోంది. చదువుకున్న అమ్మాయిలు సినిమాలో ఏమిటీ ఈ అవతారం.. ఎందుకు ఈ సింగారం.. అంటూ సూర్యకాంతం, రేలంగి చేసిన సందడి ఇప్పుడు చూసినా అబ్బురపరుస్తోంది. కేవలం రేలంగి తెరమీద కనిపిస్తే చాలు ప్రేక్షకుల ముఖంలో నవ్వు వెల్లివిరిసేది. ఆయన నడక, నటన, డైలాగు చెప్పే తీరు మేళవించి ఆయనను మహా హాస్య నటునిగా ప్రేక్షకుల మదిలో నిలబెట్టాయి. గాయకుడిగానూ.. హాస్య నటుడిగా సినీ ప్రపంచాన్ని ఏలుతున్న రోజుల్లోనే ఆయన గాయకునిగానూ ప్రేక్షకులను ఆకట్టుకున్నారు. వినవేబాల నా ప్రేమ గోల అంటూ పాతాళభైరవిలో ఆయన పాడిన పాట ఇప్పటి తరాన్నీ కట్టిపడేస్తోందంటే అతిశయోక్తి కాదు. మిస్సమ్మ సినిమాలో కాణీ ధర్మం చేయి బాబూ.. అనే పాట కూడా ఆయనకు ఎంతో పేరు తెచ్చింది. 1949లో గుణసుందరి కథ, 1951లో పాతాళభైరవి, 1952లో ధర్మదేవత, 1954లో విప్రనారాయణ, పెద్దమనుష్యులు, 1955లో మిస్సమ్మ, 1959లో అప్పుచేసి పప్పుకూడు, 1966లో పరమానందయ్యశిష్యుల కథలో ఆయన పాటలు పాడారు. రాజబాబు ప్రవేశం రేలంగి పుణ్యమే శరీర విన్యాసాల ద్వారా ప్రేక్షకులకు గిలిగింతలు పెట్టే హాస్యనటుడు రాజబాబును సినిమాకు పరిచయం చేసింది రేలంగే. నిర్మాతగా ఆయన నిర్మించిన సామ్రాజ్యం సినిమాలో రాజబాబును రేలంగి పరిచయం చేశారు. స్వయం కృషితో ఎదిగారు తూర్పుగోదావరి జిల్లాలో పుట్టిన ఆయన వివాహ బంధం ద్వారా తాడేపల్లిగూడెం పట్టణంతో అనుబంధాన్ని అల్లుకున్నారు. పట్టణంపై ఆయనకు ఎంతో మక్కువ ఉండేది. దీంతో అప్పట్లోనే నూతన సాంకేతిక పరిజ్ఞానం.. సౌండ్ సిస్టంతో ఇక్కడ రేలంగి చిత్రమందిర్‌ను నిర్మించారు. భేషజాలకు. దర్పాలకు పోకుండా స్వయం కృషితో ఎదిగిన వ్యక్తి రేలంగి. పద్మశ్రీ అవార్డు అందుకున్న తొలి హాస్య నటుడు పద్మశ్రీ అవార్డు అందుకున్న తొలి తెలుగు హాస్య నటుడు రేలంగి వెంకట్రామయ్య కావడం విశేషం. రాష్ట్రపతి వీవీ గిరి చేతుల మీదుగా ఆయన ఈ అవార్డును అందుకున్నారు. ఒకే ఒక్క వారసుడు రేలంగికి ఒకే ఒక్క వారసుడు ఉన్నారు. సత్యనారాయణ బాబు. తండ్రి బాటలో నటనవైపు వెళ్లారు. నగేష్ లాంటి హాస్య నటుడిగా ఎదగాలని ఆకాంక్షించిన బాబు ఏపీ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా పనిచేసిన మోహన్ కందా స్నేహితులు. కలిసి చదువుకున్నారు. కలిసి సినిమాలలోనూ నటించారు. మూడుసార్లు ఉత్తమ నటుడిగా బహుమతులు సాధించారు. బాలానందం సినిమాలో హీరో, విలన్‌గానూ బాబు పాత్రలు పోషించారు. తమిళంలోని ఒక సినిమాను చట్టాలు మారాలి అనే పేరుతో తెలుగులో పునర్నిర్మించారు. ఇటీవలే ఆయన అనారోగ్యంతో మరణించారు. తాత బాటలో మనుమడు హేమంత్ తాత రేలంగి బాటలో సినిమాలలో రాణించాలని రేలంగి కుమారుడు సత్యనారాయణబాబు చిన్న కుమారుడు హేమంత్ సినిమాలలో నటిస్తున్నారు. రేలంగి పేరిట పట్టణానికి చెందిన బాల్ పాయింట్ చిత్రకారుడు ఎస్వీఆర్ చిన్ని తదితరుల ఆధ్వర్యంలో పద్మశ్రీ రేలంగి మెమోరియల్ కల్చరల్ యూనిట్ పేరుతో సంగీత, సాహిత్య సాంస్కృతిక, సేవాసంస్థను 1978లో ఏర్పాటు చేశారు. రేలంగి సినీ రంగ విశేషాలతో 1979లో ఒక సావనీర్‌ను ప్రచురించి విడుదల చేశారు. గూడెంలో రేలంగి జయంత్యుత్సవం రేలంగి గురించి ఇప్పటి తరాలకు తెలియజేయాలనే సంకల్పంతో దేవాదాయశాఖ మంత్రి పైడికొండల మాణిక్యాలరావు ఈనెల 13న ధవళసత్యం కళామిత్ర మండలి, రాష్ట్ర సాంస్కృతిక శాఖ సంయుక్త ఆధ్వర్యంలో జయంత్యుత్సవాలను బీవీఆర్ కళాకేంద్రంలో ఏర్పాటుచేశారు. పాఠశాలల విద్యార్థులకు వ్యాసరచన, వక్తృత్వ పోటీలను నిర్వహించనున్నారు. హాస్య లఘు నాటికలు, రేలంగి సినీ గీతాల పోటీలు ఏర్పాటుచేశారు. రేలంగి గీతాలతో ప్రత్యేక ఆర్కెస్ట్రా నిర్వహించనున్నారు. ఈ కార్యక్రమానికి రేలంగి తనయుడు సత్యనారాయణబాబు కుటుంబ సభ్యులు, ప్రముఖ దర్శకులు ధవళ సత్యం, రేలంగి నరసింహారావు హాజరు కానున్నారు. -
వడివడి అడుగులు
జిల్లాలో జల రవాణా పునరుద్ధరణపై ఏజీన్సీని నియమించిన ప్రభుత్వం జిల్లాలో కాలువపై ఉన్న వంతెనలన్నీ తొలగింపు 200 వందల ఎకరాలకు పైగా భూ సేకరణ తాడేపల్లిగూడెం : జిల్లాలో జల రవాణా మార్గాన్ని పునరుద్ధరించే దిశగా వడివడి అడుగులు పడుతున్నాయి. విజ్జేశ్వరం నుంచి ఏలూరు వరకు గల గోదావరి ప్రధాన కాలువ విస్తరణ, టెర్మినల్స్ పనులకు సంబంధించి సర్వే నిమిత్తం ప్రభుత్వం కాంట్రాక్ట్ ఏజెన్సీని నియమించింది. గోదావరి ప్రధాన కాలువతోపాటు దానికి అనుబంధంగా ఉన్న కాలువల విస్తరణ, ఇతర పనుల కోసం ఎంత భూమిని సేకరించాలి, ఏయే భూములను సేకరించాలనే దానిపై కాంట్రాక్ట్ ఏజెన్సీ ఆధ్వర్యంలో త్వరలోనే సర్వే పనులు ప్రారంభం కానున్నాయి. ఇందుకు సంబంధించి రెవెన్యూ, జల వనరుల శాఖల అధికారులు ఏలూరులో సమావేశమై కీలకాంశాలపై చర్చించారు. ఎక్కడి నుంచి ఎక్కడి వరకు కాలువల్ని విస్తరించాలి, ఎన్ని వంతెనల్ని తొలగించాల్సి ఉంటుంది, ఎంత భూమి అవసరం అవుతుంది, అందులో రైతులు, ఇతరుల నుంచి సేకరించాల్సిన భూమి ఎంత, జల వనరుల శాఖకు చెందిన భూమి ఎంత ఉందనే విషయాలపై సమీక్షించారు. సర్వే.. మార్కింగ్ బాధ్యతలు కాంట్రాక్ట్ ఏజెన్సీకే.. కాలువను ఏ మేరకు వెడల్పు చేయాలి, ఎక్కడ వంతెనలు తొలగించాలి, ఎక్కడెక్కడ భూముల్ని సేకరించాల్సి ఉందనే విషయాలపై సర్వే చేయాల్సిన బాధ్యతన కాంట్రాక్ట్ ఏజెన్సీకి అప్పగించారు. కాలువ వెంబడి మార్కింగ్ ఇచ్చే పనిని కూడా ఆ సంస్థే చేపట్టాల్సి ఉంటుంది. సర్వే నివేదిక అందిన అనంతరం రెవెన్యూ అధికారులు రంగంలోకి దిగుతారు. సరిహద్దుల ఆధారంగా ఏ భూమి ఎంత ఉంది, ఏయే సర్వే నంబర్లలో ఉంది, రైతుల నుంచి ఎంత భూమి సేకరించాలనే దానిపై రెవెన్యూ అధికారులు క్షేత్రస్థాయి పరిశీలన జరిపి ప్రభుత్వానికి నివేదిస్తారు. అనంతరం అసలు పనులు మొదలవుతాయి. ఊరి వెలుపల కాలువ వెడల్పు 110 మీటర్లు జల రవాణా నిమిత్తం కాలువలో గర్భం వెడల్పు 25 మీటర్లు ఉంటే సరిపోతుందని భావించారు. ప్రస్తుతం ఆ కొలతలు మారాయి. కాలువ గర్భంలో వెడల్పు 40 మీటర్లు ఉండాలని, కాలువ పైభాగంలో 60 మీటర్ల వెడల్పు ఉండాలని నిర్దేశించారు. పట్టణాలు, గ్రామాల బయట మాత్రం కాలువ వెడల్పు 110 మీటర్లు ఉండేలా చర్యలు చేపట్టబోతున్నారు. ఏలూరులో కాలువను విస్తరించడానికి అనువైన పరిస్థితులు లేనందువల్ల అక్కడి నుంచి బైపాస్ కెనాల్ తవ్వాలని తొలుత భావించారు. అయితే, తూర్పు లాకులు దాటిన తరువాత ఉన్న కాలువను అవసరమైన మేరకు విస్తరించాలనే యోచనలో అధికారులు ఉన్నారు. బైపాస్ కెనాల్ తవ్వకానికి పెద్ద ఎత్తున భూసేకరణ చేయడం ఆర్థికంగా భారమవుతుందని, న్యాయపరమైన ఇబ్బందులూ తలెత్తే అవకాశం ఉందన్న ఆలోచనకు వచ్చిన అధికారులు ఆ నిర్ణయాన్ని ఉపసంహరించుకున్నట్టు సమాచారం. అన్ని వంతెనల్ని తొలగించాల్సిందే విజ్జేశ్వరం నుంచి ఏలూరు వరకు 74.514 కిలోమీటర్ల మేర విస్తరించి ఉన్న గోదావరి ప్రధాన కాలువపై ఉన్న వంతెనలన్నింటిని తొలగిస్తారు. చిన్నాపెద్దా కలిసి 46 వంతెనలు తొలగించాల్సి ఉంటుందని జల వనరుల శాఖ ప్రాథమికంగా అంచనా వచ్చింది. కాలువ వెడల్పు చేసిన అనంతరం పాత వంతెనల స్థానంలో కొత్త వంతెనలు నిర్మిస్తారు. రవాణాకు ప్రతిబంధకంగా లేకుండా వంతెనలకు అటుఇటు మాత్రమే పిల్లర్లు ఉండేలా నిర్మాణాలు చేపడతారు. జిల్లాలో రెండే టెర్మినల్స్ కార్గో బోట్ల ప్రయాణం, జెట్టీల నిర్మాణం, సరుకులు ఎగుమతి, దిగుమతులు, గోదాముల నిర్మాణాలకు అనువైన స్థలాల విషయమై రైట్స్ (రైల్ ఇండియా టెక్నికల్ అండ్ ఎకనమిక్ సర్వీస్) సంస్థ నివేదిక రూపొందించింది. దీని ప్రకారం తాడేపల్లిగూడెం, నిడదవోలు పట్టణాల్లో మాత్రమే టెర్మినల్స్ ఏర్పాటు చేస్తారని జల వనరుల శాఖ అధికారులు చెబుతున్నారు. ఏలూరులోనూ టెర్మినల్ ఏర్పాటు చేయాల్సి ఉంటుందని గతంలో అనుకున్నారు. ఇందుకు అవసరమైన స్థలం, మౌలిక వసతుల కల్పన కష్టతరంగా ఉండటంతో జిల్లాలో రెండు టెర్మినల్స్ ఏర్పాటు చేస్తారు. మార్కింగ్ తర్వాత రాళ్లు వేస్తాం జల రవాణాకు సంబంధించి జిల్లాలో సర్వే నిమిత్తం ఏజెన్సీని నియమిస్తూ ఉత్తర్వులు వెలువడ్డాయి. ఆ ఏజన్సీ ఆధ్వర్యంలో మార్కింగ్ ఇచ్చాక ఆ ప్రాంతంలో రాళ్లను పాతిస్తాం. ఈ వివరాలను రెవెన్యూ అధికారులకు తెలియచేస్తాం. గోదావరి ఏలూరు కాలువపై ఉన్న అన్ని వంతెనలను తొలగించాలి. తాడేపల్లిగూడెం, నిడదవోలులో మాత్రం టెర్మినల్స్ ఏర్పాటు చేస్తారు. జేబీ నాయక్, జల వనరుల శాఖ , తాడేపల్లిగూడెం సబ్ డివిజన్, డీఈఈ భూముల వివరాలు సేకరిస్తాం జల రవాణా పునరుద్ధరణకు అవసరమైన భూమిని సేకరించేందుకు ప్రభుత్వానికి నివేదిక ఇవ్వాల్సి ఉంటుంది. జల వనరుల శాఖ అధికారులు రాళ్లుపాతి సరిహద్దులు నిర్ణయించిన అనంతరం ఈ పని చేపట్టి ఉన్నతాధికారులకు నివేదిస్తాం. పాశం నాగమణి, తహసీల్దార్. తాడేపల్లిగూడెం -
కబ్జా కన్ను...
– విమానాశ్రయ మిగులు భూముల ఆక్రమణకు యత్నాలు – చేతులు మార్చి అమ్మకాలకు మళ్లీ ప్రయత్నాలు తాడేపల్లిగూడెం : తాడేపల్లిగూడెంలోని విమానాశ్రయ భూములపై అక్రమార్కుల కళ్లు పడ్డాయి. నిన్నమొన్నటి వరకూ చాలామంది బినామీలు, దళారులు, గుర్తింపులేని సంస్థులు విమానాశ్రయ భూములను వ్యాపార వస్తువుగా మార్చుకున్నాయి. నేటికీ వీటి క్రయవిక్రయాలు కొనసాగుతుండగా.. కబ్జాదారుల ఆక్రమణల దాహం తీరలేదు. కొద్దోగొప్పో మిగిలి ఉన్న భూములపై తాజాగా కబ్జాకోరుల కన్ను పడింది. ప్రై వేటు భూములకు ఆనుకుని ఉన్న భూమిని ఆక్రమించుకునే ప్రయత్నాలు మొదలయ్యాయి. అడ్డుకోబోయిన అధికారులకు అవరోధాలు కల్పిస్తున్నారు. ముందుగా నాలుగు రాటలు పాతడం.. ఆనక చిన్నపాక వేయడం.. పక్కా భవనం నిర్మించడం.. చివరగా సమీపంలోని స్థలాన్ని అక్రమించుకుంటూ వెళ్లి విక్రయించడం వంటి కార్యకలాపాలు మళ్లీ ఊపందుకుంటున్నాయి. కోతిబొమ్మ సెంటర్లో.. కోతి బొమ్మ సెంటర్లో రెవెన్యూ శాఖ అధీనంలో ఉన్న విమానాశ్రయ భూములపై గద్దల కన్ను పడింది. వీకర్స్ కాలనీకి వెళ్లే మార్గంలోను, గణేష్‌నగర్‌కు వచ్చే మార్గంలోను గల రెండెకరాల భూమిని కబ్జా చేసేందుకు కొందరు వ్యక్తులు ప్రయత్నాలు ప్రారంభించారు. కోట్లాది రూపాయల విలువైన ఈ భూముల్లో నీకింత, నాకింత అన్నట్టుగా పంచుకునేందుకు రంగం సిద్ధం చేశారు. ప్రభుత్వం ఇటీవల విడుదల చేసిన జీవో ప్రకారం విమానాశ్రయ భూముల్లో ఇప్పటికే ఇళ్లు నిర్మించుకున్న వారికి ఆయా ఇళ్లను మార్కెట్ విలువకు అనుగుణంగా రిజిస్ట్రేషన్ చేయించుకోవచ్చు. ఈ క్రమంలో రాత్రికి రాత్రే అక్కడి బూముల్లో పక్కా భవనాలు వెలుస్తున్నాయి. సిపాయి కాలనీ సమీపంలో ఇలాంటి నిర్మాణాలు సాగుతున్నా పట్టించుకోవడం లేదనే విమర్శలున్నాయి. -
ఆక్వాపుడ్ పార్కు నిర్మాణం తక్షణమే ఆపాలి
రౌండ్‌టేబుల్ సమావేశంలో వక్తలు తాడేపల్లిగూడెం కాలుష్యాన్ని వెదజల్లే ఆక్వాఫుడ్ పార్కు ఏర్పాటు తక్షణమే నిలుపుదల చేయాలని , గ్రామాలపై పోలీసు నిర్భంధాన్ని ఎత్తివేయాలని , అక్రమ కేసులు ఎత్తివేయాలని బుధవారం స్ధానిక సుందరయ్య భవనంలో నిర్వహించిన రౌండ్‌టేబుల్ సమావేశంలో అఖిలపక్ష నాయకులు డిమాండ్ చేశారు. వైఎస్ఆర్సీపి ఎస్సీఎస్టీ సెల్ రాష్ట్ర కార్యదర్శి లంకా మోహన్‌బాబు మాట్లాడుతూ తుందుర్రు పరిసర ప్రాంతాలలో ప్రజలపై చంద్రబాబు ప్రభుత్వం నిర్భంద వైఖరి ప్రదర్శించడం చాలా దారుణమన్నారు. వెంటనే పోలీసు పహరాను తొలగించాలని డిమాండ్ చేశారు. ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా నాయకులు కండెల్లి సోమరాజు మాట్లాడుతూ జీరోశాతం కూడా కాలుష్యం లేకుండా పరిశ్రమను ఏర్పాటుచేస్తున్నామని , యాజమాన్యం చేసిన ప్రకటనలో వాస్తవం లేదన్నారు. గొంతేరు నది పూర్తిగా పాడవుతుందని ప్రొఫెసర్ స్వామి ఇతరులు చెప్పినా కూడా ప్రభుత్వం పెడచెవినపెట్టి . యాజమాన్యానికి కొమ్ముకాస్తుందని ఆరోపించారు. కులనిర్మూలన సమితి రాష్ట్ర నాయకులు మెరిపో జాన్‌రాజు మాట్లాడుతూ సన్న,చిన్నకారు రైతులకు ఈ పాలనలో రక్షణ లేకుండా పోయిందన్నారు. ప్రశ్నించే వారిపై కేసులుపెట్టి ఉద్యమాలను అణచివేయాలని చూడటం అవివేకమన్నారు. గుజరాత్ తిరస్కరించిన ఆక్వాపార్కును ఇక్కడ ఏర్పాటుచేయడం ప్రజల ఆరోగ్యంతో చెలగాటమాడటమే నన్నారు. నిర్భంద గ్రామాల పరిశీలనకు వెళుతున్న అఖిలపక్ష నాయకులపై కేసులు పెట్టడం అన్యాయమని సీపిఐ ఎంఎల్ న్యూ డెమోక్రసీ నాయకులు మామిడి దానవరప్రసాద్ అన్నారు. నాయకులపై దురుసుగా ప్రవర్తిస్తున్న ఎస్ఐ సుధాకరరెడ్డిని విధుల నుంచి సస్పెండ్ చేయాలని డిమాండ్ చేశారు. సీఐటియు నాయకులు చిర్ల పుల్లారెడ్డి, గొన్నాబత్తుల నాగేశ్వరరావు, మడకరాజు, వర్రి సత్యనారాయణ, చింతా పద్మావతి, ఏ.విజయ. పి.సరోజ పందల సన్యాసిరావులు పాల్గొన్నారు. -
డీఆర్ గోయంక కళాశాలను రక్షించాలి
తాడేపల్లిగూడెం (తాలూకా ఆఫీస్ సెంటర్): డీఆర్ గోయంక మహిళా కళాశాలను మహిళల కోసమే శాశ్వతంగా ఉంచేలా చూడాలని మునిసిపల్ మాజీ చైర్పర్సన్ దేవతి పద్మావతి ఆధ్వర్యంలో మంగళవారం స్థానిక తహసీల్దార్ కార్యాలయం వద్ద ధర్నా చేశారు. అనంతరం తహసీల్దార్ పాశం నాగమణికి వినతిపత్రం అందజేశారు. ముందుగా తాలూకాఫీస్ సెంటర్లో మహిళలతో మానవహారం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా దేవతి పద్మావతి మాట్లాడుతూ కళాశాల ఆస్తులను పరిరక్షించాలని, కళాశాల కమి టీ చేస్తున్న అక్రమాలపై సమగ్ర దర్యాప్తు జరిపించాలని డిమాండ్ చేశారు. కళాశాల కమిటీలోకి 50 శాతం మహిళలను తీసుకోవాలన్నారు. కళాశాల ప్రారంభానికి విరాళాలిచ్చిన రైస్ మిల్లర్స్ అసోసియేషన్, స్వచ్ఛంద సంస్థలు కమిటీ అక్రమాలకు అడ్డుకట్ట వేయాలని కోరారు. కళాశాల ఆస్తులను అన్యాక్రాంతం కాకుం డా చూడాలని సూచించారు. -
మార్కెట్‌ను ముంచెత్తిన బీరకాయలు
తాడేపల్లిగూడెం : బీరకాయలు మార్కెట్‌ను ముంచెత్తాయి. దీంతో ధర బాగా తగ్గింది. ఆదివారం తాడేపల్లిగూడెం మార్కెట్లో ధరలు ఇలా ఉన్నాయి. వారం రోజుల క్రితం కిలో రూ.40 పలికిన బీరకాయలు కిలో రూ.20కి పడిపోయింది. నాసిరకం బీరకాయలు కిలో రూ.8కే లభించాయి. బెండకాయలు కిలో రూ. 12 , దొండకాయలు రూ.24కి అమ్మారు. క్యాబేజీ, దోసకాయలు కిలో రూ.12, కంద కిలో రూ.24కి అమ్మారు. టమాటాలు కిలో రూ.12, బీట్రూట్ కిలో రూ.24కు లభించింది. క్యాప్సికం కిలో రూ.120, బీన్స్ కిలో రూ.80కి విక్రయించారు. కీరా కిలో రూ.32, నాటురకం చిక్కుడుకాయలు కిలో రూ.80, ఇతర రకం చిక్కుడుకాయలు కిలో రూ.16కు లభించాయి. గోరు చిక్కుళ్లు రూ.24, క్యారట్ రూ.40కి విక్రయించారు. తెల్ల వంకాయలు రూ.40, నల్ల వంకాయలు రూ.30కి లభ్యమయ్యాయి. ఉల్లిపాయలు నాలుగు కిలోలు రూ.50కే అమ్మారు. కర్నూలు నుంచి కొత్త ఉల్లిపాయలు వచ్చాయి. 40 లారీల సరుకు వచ్చింది. గుత్తగా క్వింటాలు రూ.400 నుంచి రూ.850 చేసి అమ్మకాలు సాగించారు. పాతరకం మహారాష్ట్ర ఉల్లిపాయలు కిలో రూ.16 చేసి విక్రయించారు. గుత్తగా క్వింటాల్ ఈ రకం ఉల్లిపాయలు రూ. 600 నుంచి రూ.1,200 విక్రయించారు. బంగాళాదుంపలు కిలో రూ.24 పలికాయి.