నవ్వుల రేడు.. రేలంగి
నవ్వుల రేడు.. రేలంగి
Published Wed, Aug 9 2017 12:15 AM | Last Updated on Sun, Sep 17 2017 5:19 PM
13న హాస్యనట కిరీటి జయంత్యుత్సవం
ఆ నటన.. హావభావాలు అజరామరం
ఆయన లేకున్నా.. పండించిన హాస్యం పదిలం
తాడేపల్లిగూడెంలో స్థిరపడిన మహానటుడు
పట్టణంతో పెనవేసుకున్న బంధం
చూడగానే నవ్వు తెప్పించే ఆహార్యం.. అబ్బుర పరిచే హావభావాలు. పొట్ట చెక్కలయ్యేలా నవ్వించే చమక్కులు.. ఇవన్నీ అలనాటి సినీ హాస్య నటుడు రేలంగి వెంకట్రామయ్య సొంతం. ఆయన తర్వాత ఎందరు హాస్య నటులు వచ్చినా ఆయన ముద్ర చెరిగిపోనిది. ఆయన పంచిన నవ్వు తరగిపోనిది. ఈనెల 13న రేలంగి జయంత్యుత్సవం సందర్భంగా ఆ మహా హాస్య నట కిరీటి ప్రస్థానం గురించి ఓ సారి..
తాడేపల్లిగూడెం
ఒకటా.. రెండా.. ఎన్నో పాత్రలు.. హాస్యనటునిగానూ డ్యూయెట్లు.. సోలో సాంగ్స్.. అన్నింటిలోనూ మెప్పించి తనకు తానే సాటి అని నిరూపించుకున్న రేలంగి వెంకట్రామయ్య.. నటనా చాతుర్యం అజరామరం. ఆయన పండించిన హాస్యం ప్రేక్షకుల మదిలో ఇప్పటికీ పదిలం. తొలి పద్మశ్రీ అవార్డు అందుకున్న హాస్యనటుడు ఆయన. ’సరదా..సరదా.. సిగరెట్టు.. ఇది దొరల్ తాగు సిగరెట్టు.. పాటలో ఆయన పలికించిన హాభావాలు ఇప్పటికీ ఎవర్‌గ్రీన్. పారశీకం ఏంటి.. పరుషకం.. పరుషకం... టోపీ టింగురంగగా ఉందే అంటూ పాతాళభైరవిలో రాణీగారి తమ్ముడి పాత్రలో మెరిసిన రేలంగి నటన అద్భుతం. శర్మా... కరపీడనమే కదా చేయమను అంటూ మాయాబజారులో లక్ష్మణకుమారుని పాత్రకు వన్నె తెచ్చిన మేటి నటుడు రేలంగి. అదే సినిమాలో నాన్నగారు కోతి.. కోతిపిల్ల అంటూ.. భయంతో కూడిన హాస్యం పండించి విమర్శకుల ప్రశంసలందుకున్నారు రేలంగి. ఆయన నటనా కౌసలానికి ఈ చిత్రం నిలువెత్తు నిదర్శనం. 1935 నుంచి 1975 వరకు సుమారు 40 ఏళ్ల సినీ ప్రస్థానంలో రేలంగి నిత్యం హాస్యరస గుళికలను ప్రేక్షకులకు అందించారు. కడుపుబ్బా నవ్వించారు. నటుడిగా, నిర్మాతగా, గాయకుడిగా బహుముఖ ప్రజ్ఞ చూపించి మెప్పించారు.
రేలంగి సినీ ప్రస్థానం ఇదీ..
తూర్పుగోదావరిజిల్లా రావులపాలెంలో 1910 ఆగస్టు 13న జన్మించిన ఆయన 1919లో బృహన్నల నాటకంలో స్త్రీపాత్ర ద్వారా నాటకరంగం ప్రవేశం చేశారు. ఎస్.వి.రంగారావు వంటి వారు సభ్యులుగా ఉన్న చెన్నైలోని యంగ్‌మెన్ హ్యాపీ క్లబ్‌లో చేరారు. 1931లో భక్తప్రహ్లాద సినిమా చూసి.. సినిమాలలో వేషాల కోసం కోల్‌కతా వెళ్లి సినీదర్శకుడు సి.పుల్లయ్యను కలిశారు. ఆయన నిర్మిస్తున్న శ్రీ కృష్ణతులాభారంలో పాత్ర పొందారు. వరవిక్రయం, గొల్లభామ వంటి సినిమాలలో నటించారు. గుణ సుందరి కథ సినిమాతో రేలంగికి మంచిపేరు వచ్చింది. మిస్సమ్మ, మాయాబజార్, దొంగ రాముడు, వెలుగునీడలు, విప్రనారాయణ, నర్తనశాల, అప్పుచేసి పప్పుకూడు వంటి సినిమాలు ఆయనను అగ్రభాగాన నిలబెట్టాయి. ఆయన నటించిన ఆఖరి చిత్రం పూజ (1975).
గిరిజ, సూర్యకాంతంలతో డ్యూయెట్లు
అప్పట్లో సినిమాలో రేలంగి ఉంటే ఆయన పక్కన నాయికలూ ఉండాల్సిందే. గిరిజ , లేదంటే సూర్యకాంతం ఎక్కువగా ఆయన పక్కన నటించి మెప్పించారు. అప్పుచేసి పప్పుకూడు సినిమాలో కాశీకి పోయానో రామా హరి.. గంగ తీర్థంబు తెచ్చాను రామా హరీ అనే పాటలో గిరిజ, రేలంగి ప్రదర్శించిన హాస్య నటన ప్రేక్షకులకు చిరకాలం గుర్తుండిపోతోంది. చదువుకున్న అమ్మాయిలు సినిమాలో ఏమిటీ ఈ అవతారం.. ఎందుకు ఈ సింగారం.. అంటూ సూర్యకాంతం, రేలంగి చేసిన సందడి ఇప్పుడు చూసినా అబ్బురపరుస్తోంది. కేవలం రేలంగి తెరమీద కనిపిస్తే చాలు ప్రేక్షకుల ముఖంలో నవ్వు వెల్లివిరిసేది. ఆయన నడక, నటన, డైలాగు చెప్పే తీరు మేళవించి ఆయనను మహా హాస్య నటునిగా ప్రేక్షకుల మదిలో నిలబెట్టాయి.
గాయకుడిగానూ..
హాస్య నటుడిగా సినీ ప్రపంచాన్ని ఏలుతున్న రోజుల్లోనే ఆయన గాయకునిగానూ ప్రేక్షకులను ఆకట్టుకున్నారు. వినవేబాల నా ప్రేమ గోల అంటూ పాతాళభైరవిలో ఆయన పాడిన పాట ఇప్పటి తరాన్నీ కట్టిపడేస్తోందంటే అతిశయోక్తి కాదు. మిస్సమ్మ సినిమాలో కాణీ ధర్మం చేయి బాబూ.. అనే పాట కూడా ఆయనకు ఎంతో పేరు తెచ్చింది. 1949లో గుణసుందరి కథ, 1951లో పాతాళభైరవి, 1952లో ధర్మదేవత, 1954లో విప్రనారాయణ, పెద్దమనుష్యులు, 1955లో మిస్సమ్మ, 1959లో అప్పుచేసి పప్పుకూడు, 1966లో పరమానందయ్యశిష్యుల కథలో ఆయన పాటలు పాడారు.
రాజబాబు ప్రవేశం రేలంగి పుణ్యమే
శరీర విన్యాసాల ద్వారా ప్రేక్షకులకు గిలిగింతలు పెట్టే హాస్యనటుడు రాజబాబును సినిమాకు పరిచయం చేసింది రేలంగే. నిర్మాతగా ఆయన నిర్మించిన సామ్రాజ్యం సినిమాలో రాజబాబును రేలంగి పరిచయం చేశారు.
స్వయం కృషితో ఎదిగారు
తూర్పుగోదావరి జిల్లాలో పుట్టిన ఆయన వివాహ బంధం ద్వారా తాడేపల్లిగూడెం పట్టణంతో అనుబంధాన్ని అల్లుకున్నారు. పట్టణంపై ఆయనకు ఎంతో మక్కువ ఉండేది. దీంతో అప్పట్లోనే నూతన సాంకేతిక పరిజ్ఞానం.. సౌండ్ సిస్టంతో ఇక్కడ రేలంగి చిత్రమందిర్‌ను నిర్మించారు. భేషజాలకు. దర్పాలకు పోకుండా స్వయం కృషితో ఎదిగిన వ్యక్తి రేలంగి.
పద్మశ్రీ అవార్డు అందుకున్న తొలి హాస్య నటుడు
పద్మశ్రీ అవార్డు అందుకున్న తొలి తెలుగు హాస్య నటుడు రేలంగి వెంకట్రామయ్య కావడం విశేషం. రాష్ట్రపతి వీవీ గిరి చేతుల మీదుగా ఆయన ఈ అవార్డును అందుకున్నారు.
ఒకే ఒక్క వారసుడు
రేలంగికి ఒకే ఒక్క వారసుడు ఉన్నారు. సత్యనారాయణ బాబు. తండ్రి బాటలో నటనవైపు వెళ్లారు. నగేష్ లాంటి హాస్య నటుడిగా ఎదగాలని ఆకాంక్షించిన బాబు ఏపీ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా పనిచేసిన మోహన్ కందా స్నేహితులు. కలిసి చదువుకున్నారు. కలిసి సినిమాలలోనూ నటించారు. మూడుసార్లు ఉత్తమ నటుడిగా బహుమతులు సాధించారు. బాలానందం సినిమాలో హీరో, విలన్‌గానూ బాబు పాత్రలు పోషించారు. తమిళంలోని ఒక సినిమాను చట్టాలు మారాలి అనే పేరుతో తెలుగులో పునర్నిర్మించారు. ఇటీవలే ఆయన అనారోగ్యంతో మరణించారు.
తాత బాటలో మనుమడు హేమంత్
తాత రేలంగి బాటలో సినిమాలలో రాణించాలని రేలంగి కుమారుడు సత్యనారాయణబాబు చిన్న కుమారుడు హేమంత్ సినిమాలలో నటిస్తున్నారు. రేలంగి పేరిట పట్టణానికి చెందిన బాల్ పాయింట్ చిత్రకారుడు ఎస్‌వీఆర్ చిన్ని తదితరుల ఆధ్వర్యంలో పద్మశ్రీ రేలంగి మెమోరియల్ కల్చరల్ యూనిట్ పేరుతో సంగీత, సాహిత్య సాంస్కృతిక, సేవాసంస్థను 1978లో ఏర్పాటు చేశారు. రేలంగి సినీ రంగ విశేషాలతో 1979లో ఒక సావనీర్‌ను ప్రచురించి విడుదల చేశారు.
గూడెంలో రేలంగి జయంత్యుత్సవం
రేలంగి గురించి ఇప్పటి తరాలకు తెలియజేయాలనే సంకల్పంతో దేవాదాయశాఖ మంత్రి పైడికొండల మాణిక్యాలరావు ఈనెల 13న ధవళసత్యం కళామిత్ర మండలి, రాష్ట్ర సాంస్కృతిక శాఖ సంయుక్త ఆధ్వర్యంలో జయంత్యుత్సవాలను బీవీఆర్ కళాకేంద్రంలో ఏర్పాటుచేశారు. పాఠశాలల విద్యార్థులకు వ్యాసరచన, వక్తృత్వ పోటీలను నిర్వహించనున్నారు. హాస్య లఘు నాటికలు, రేలంగి సినీ గీతాల పోటీలు ఏర్పాటుచేశారు. రేలంగి గీతాలతో ప్రత్యేక ఆర్కెస్ట్రా నిర్వహించనున్నారు. ఈ కార్యక్రమానికి రేలంగి తనయుడు సత్యనారాయణబాబు కుటుంబ సభ్యులు, ప్రముఖ దర్శకులు ధవళ సత్యం, రేలంగి నరసింహారావు హాజరు కానున్నారు.
Advertisement