comidian
-
విషాదం.. ప్రముఖ హాస్య నటుడు మృతి
తమిళ ఇండస్ట్రీలో విషాదం నెలకొంది. ప్రముఖ హాస్య నటుడు శేషు(60) మృతి చెందారు. కొన్నాళ్ల క్రితం ఆయనకు గుండెపోటు రావడంతో చెన్నై ఆస్పత్రికి తరలించారు. అప్పటి నుంచి చికిత్స తీసుకుంటున్న శేషు.. నేడు(మంగళవారం) తుదిశ్వాస విడిచారు. శేషు పూర్తి పేరు లక్ష్మీ నారాయణన్ శేషు.2002లో ధనుష్ చిత్రం తుళ్లువదో ఇలామైలో వెండితెర అరంగేట్రం చేశారు. విజయ్ టీవీ కామెడీ షో ‘లొల్లు సభ’తో మంచి గుర్తింపు సంపాదించుకున్నాడు. తమిళ్ లో 30కి పైగా చిత్రాల్లో నటించాడు. ముఖ్యంగా నటుడు సంతానంతో గొప్ప స్నేహం ఉంది. అందుకే ఆయన నటించిన ప్రతి సినిమాలో శేషు ఉంటాడు. ఇక ఈ మధ్య సంతానం హీరోగా నటించిన వడక్కుపట్టి రామసామి లో కూడా శేషు నటించి మెప్పించాడు. అదే ఆయన చివరి చిత్రం. శేషుకు ముగ్గురు కొడుకులు. బుధవారం చెన్నైలో ఆయన అంత్యక్రియలు జరగనున్నాయి. శేషు మరణ వార్త విన్న ప్రముఖులు ఆయనకు సంతాపం తెలుపుతున్నారు. -
పేదరికంలో అలనాటి ప్రముఖ నటుడి కుటుంబం..
కోలీవుడ్‌లో నటుడిగా, గాయకుడిగా సినీ కళామతల్లికి విశేష సేవలు అందించిన దివంగత నటుడు ఎన్ఎస్.కృష్ణన్. నాటక రంగం నుంచి సినీ రంగప్రవేశం చేసిన ఈయన ప్రఖ్యాత హాలీవుడ్ నటుడు చార్లీ చాప్లిన్ తరహాలో ప్రేక్షకులకు వినోదంతో పాటు సందేశాన్ని అందించి ఆనందపరిచారు. ఈ సేవలకుగాను ఎన్ఎస్.కృష్ణన్ కలైవానర్‌గా వాసికెక్కారు. ఈయన ఇల్లు తమిళనాడులోని నాగర్‌కోవిల్‌లోని చినిగినచేరి అనే ప్రాంతంలో ఉంది. అక్కడ ఆయన కుటుంబసభ్యులు నివసిస్తున్నారు. (ఇదీ చదవండి: అందానికి, అశ్లీలతకు చాలా తేడా ఉంది: హీరోయిన్) అయితే ఆ కుటుంబం కడు పేదరికంలో ఉన్న విషయాన్ని ఆ నగర మేయర్ మహేష్ తెలిపారు. ఆయన ఆ ప్రాంతానికి వెళ్లి పరిశీలించారు. అప్పుడు ఎన్ఎస్ కృష్ణన్ ఇల్లు శిథిలావస్థలో ఉన్న విషయాన్ని గుర్తించారు. గోడలపై చెట్లు కూడా పెరిగాయి. దీంతో మేయర్ మహేష్ ఎన్ఎస్ కృష్ణన్ కుటుంబసభ్యులను కలిసి వారి పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. ఇప్పుడు వారు చాలా పేదరికం అనుభవిస్తున్నట్లు దీంతో మేయర్ మహేష్ తాను వ్యక్తిగతంగా ఆ కుటుంబానికి సాయం చేస్తానని ఇంటి గోడలపై పెరిగిన చెట్లను తొలగిస్తానని హామీ ఇచ్చినట్లు అనంతరం మీడియాకు వెల్లడించారు. అదేవిధంగా కలైంజర్ కరుణానిధికి సన్నిహితుడైన ఎన్ఎస్ కృష్ణన్ కుటుంబ సభ్యుల పరిస్థితిని ముఖ్యమంత్రి స్టాలిన్ దృష్టికి తీసుకెళ్లి ఆర్థిక సాయం చేసే విధంగా చర్యలు తీసుకుంటానని చెప్పారు. -
ప్రకాష్ రాజ్ కు భయపడ్డాను.. |
-
ఎర్రచందనం స్మగ్లింగ్ కేసులో జబర్దస్త్ కమెడియన్
బుల్లితెరలో ప్రసారమవుతున్న జబర్దస్త్ కామెడీ షో గురించి అందరికీ తెలిసిందే. ఈ షో ద్వారా ఎంతోమంది కమెడియన్స్ వెండితెరపై కూడా పలు అవకాశాలు దక్కించుకున్నారు. తాజాగా జమర్దస్త్ కమెడియన్ హరిపై ఎర్రచందనం స్మగ్లింగ్ కేసు నమోదు అయింది. అతని ముఠాకు చెందిన కిషోర్ అనే వ్యక్తిని చిత్తూరు పోలీసులు అరెస్ట్ చేశారు. వారి నుంచి రూ. 60 లక్షలు విలువైన ఎర్రచందనం దుంగలను వారు స్వాధీనం చేసుకున్నారు. (ఇదీ చదవండి: గోపీచంద్ కొత్త సినిమా ఇదే.. 13 ఏళ్ల తర్వాత పూరిని గుర్తుకు తెచ్చాడు) కానీ కమెడియన్ హరి పరారీలో ఉన్నాడని పోలీసులు తెలిపారు. అతని కోసం గాలిస్తున్నట్లు వారు చెప్పారు. ఇప్పటికే అతనిపై ఎర్రచందనం అక్రమ రవాణా విషయంలో పలు కేసులు ఉన్నాయని పోలీసులు తెలుపుతున్నారు. చిత్తూరు జిల్లా పోలీసులు గతంలోనే హరిపై స్మగ్లింగ్ కేసులతో పాటు, పలు కేసులు నమోదు చేశారు. ఎర్రచందనం స్మగ్లింగ్ ద్వారా పెద్ద మొత్తంలో డబ్బు సంపాదించాడనే ఆరోపణలు ఉన్నాయి. జబర్దస్త్ షో ద్వారా లేడీ గెటప్‌లో చాలా రోజుల నుంచి హరి మెప్పిస్తున్న విషయం తెలిసిందే (ఇదీ చదవండి: తెలుగు ఇండస్ట్రీపై హీరోయిన్ సంచలన వ్యాఖ్యలు) -
ఇండస్ట్రీలో మరో విషాదం.. ప్రముఖ కమెడియన్ కన్నుమూత
చిత్రపరిశ్రమలో మరో విషాదం చోటు చేసుకుంది. ప్రముఖ నటుడు తారకరత్న మరణ వార్తను మరవకముందే మరో నటుడు ఈ లోకాన్ని విడిచి వెళ్లిపోయాడు. కోలీవుడ్‌కు చెందిన ప్రముఖ కమెడియన్ మైల్స్వామి(57) కన్నుమూశారు. గత కొన్ని రోజులుగా ఆరోగ్యపరమైన సమస్యలతో బాధపడుతున్న ఆయన ఆదివారం తెల్లవారు జామున తుదిశ్వాస విడిచారు. ఇంట్లోనే చికిత్స తీసుకుంటున్న మైల్ స్వామి ఆరోగ్య పరిస్థితి విషమించడంతో ఆదివారం తెల్లవారు చెన్నైలోని ప్రైవేట్ హాస్పిటల్‌కు తరలించారు. పరిశీలించిన వైద్యులు అప్పటికే ఆయన చనిపోయారని చెప్పారు. మైల్ స్వామి మరణంతో తమిళ ఇండస్ట్రీలో విషాద చాయలు అలుముకున్నాయి. ఆయన మరణం పట్ల సినీ, రాజకీయ ప్రముఖులు సంతాపం ప్రకటిస్తున్నారు. తెలంగాణ గవర్నర్ తమిళసై సౌందరరాజన్ కూడా మలై స్వామి మరణంపై ట్విటర్ వేదికగా సంతాపం వ్యక్తం చేశారు. మిమిక్రీ ఆర్టిస్ట్‌గా పని చేస్తున్న మైల్ స్వామి 1984లో నటుడిగా కోలీవుడ్లోకి ఎంట్రీ ఇచ్చాడు. మొదట్లో నటుడిగా గుర్తింపు తెచ్చుకోవడం కోసం చాలా కష్టపడ్డాడు. 2000 నుంచి కమెడియన్‌గా అతనికి మంచి గుర్తింపు వచ్చింది. చాలా సినిమాల్లో తనదైన కామెడీతో ప్రేక్షకులను నవ్వించాడు. ఆయన తమిళంలో నటించిన పలు చిత్రాలు తెలుగులోనూ అనువాదమై విజయవంతమయ్యాయి. #JUSTIN | கட்சி எல்லைகள் கடந்து நட்பு பாராட்டியவர் - ஆளுநர் தமிழிசை#Mayilsamy | #RipMayilsamy | #TamilisaiSoundararajan | @DrTamilisaiGuv pic.twitter.com/3prtaenxef — PuthiyathalaimuraiTV (@PTTVOnlineNews) February 19, 2023 -
ఆయన నవ్వులకు నాన్ స్టాప్
-
రాజకీయాల్లోకి వస్తా : ప్రముఖ హాస్యనటుడు
సాక్షి, చెన్నై : నేనూ రాజకీయాల్లోకి వస్తానని నటుడు వివేక్ అన్నారు. హాస్యనటుడిగా పేరుగాంచిన ఈయన సోమవారం కోడైకెనాల్‌లోని ఒక ప్రైవేట్ కళాశాలలో మొక్కలు నాటే కార్యక్రమంలో అమెరికాకు చెందిన మిత్రుడితో కలిసి పాల్గొన్నారు. ఈ సందర్భంగా వివేక్ మీడియాతో మాట్లాడుతూ తమిళనాడు మంచి నీళ్లు లేని రాష్ట్రంగా మారుతోందనే భయాన్ని వ్యక్తం చేశారు. కాలువలు, చెరువులను శుద్ధి చేసే కార్యక్రమాలను యువత చేపట్టాలని పిలుపునిచ్చారు. వర్షాన్ని కురిపించే శక్తి చెట్లకు ఉందన్నారు. కాబట్టి విద్యార్థులు మొక్కలు నాటే ప్రయత్నం చేయాలన్నారు. ఇంటర్ నుంచి డిగ్రీకి వెళ్లే విద్యార్థులు ప్రతి ఏడాది ఒక మొక్క చోప్పున నాటినా పర్యావరణాన్ని కాపాడగలుతారన్నారు. తాను అబ్దుల్‌కలాం సూచన మేరకు రాష్ట్రంలో కోటి మొక్కలను నాటే పథకాన్ని చేపట్టానని తెలిపారు. అందులో ఇప్పటికి 30 లక్షల 23 వేల మొక్కలను నాటానని చెప్పారు. అదే విధంగా రానున్న వర్షాకాలంలో పర్యాటకులు పర్యావరణాన్ని కాపాడుకోవాలని హితవు పలికారు. కాగా నటుడు, మక్కళ్‌నీది మయ్యం పార్టీ అధ్యక్షుడు ఇటీవల చేసిన వ్యాఖ్యల గురించి అడుగుతున్నారని, అది ఆయన వ్యక్తిగతం అని అన్నారు. అదే విధంగా నటుడు రజనీకాంత్ కచ్చితంగా రాజకీయాల్లోకి వస్తారని అన్నారు. తనకు రాజకీయాల గురించి తెలియదని, ప్రస్తుతానికి తనకలాంటి ఆలోచన లేదనిచెప్పారు. అయితే త్వరలో తాను రాజకీయాల్లోకి వచ్చినా ఆశ్చర్యం పడాల్సిన అవసరం లేదని నటుడు వివేక్ పేర్కొన్నారు. -
ట్రాక్ మార్చాడు
టాలీవుడ్, కోలీవుడ్, బాలీవుడ్...ఇలా ఏ ఇండస్ట్రీ అయినా టాప్ కమెడియన్స్ హీరోలుగా నటించిన సందర్భాలు ఉన్నాయి. ఇప్పుడు ఈ ట్రాక్‌లోకి రావడానికి తమిళ హాస్యనటుడు యోగిబాబు రంగం సిద్ధం చేసుకున్నారు. ఆయన హీరోగా సామ్ అంటోన్ దర్శకత్వంలో ఓ సినిమా రూపొందనుంది. ‘‘యోగిబాబును దృష్టిలో ఉంచుకుని ఓ కథను రెడీ చేశా. ఆ స్క్రిప్ట్‌ను ఆయనకు వినిపించాను. హీరోగా నటించడానికి ఒప్పుకున్నారు.ఇందులో ఆయన సెక్యూరిటీ గార్డ్ పాత్ర చేస్తారు. ఓ కుక్క కూడా ఓ కీలక పాత్ర చేస్తుంది. పూర్తి వివరాలు త్వరలో వెల్లడిస్తా’’ అని సామ్ అంటోని పేర్కొన్నారు. దాదాపు ఐదేళ్ల క్రితం మారుతి దర్శకత్వంలో వచ్చిన ‘ప్రేమకథా చిత్రమ్’ సినిమాను తమిళంలో ‘డార్లింగ్’ పేరుతో రీమేక్ చేశారు ఆంటోని. అలాగే తమిళంలో అజిత్ హీరోగా నటిస్తున్న ‘విశ్వాసం’ సినిమా యోగిబాబు కెరీర్లో 100వ చిత్రం కావడం విశేషం. -
నవ్వుల రేడు.. రేలంగి
13న హాస్యనట కిరీటి జయంత్యుత్సవం ఆ నటన.. హావభావాలు అజరామరం ఆయన లేకున్నా.. పండించిన హాస్యం పదిలం తాడేపల్లిగూడెంలో స్థిరపడిన మహానటుడు పట్టణంతో పెనవేసుకున్న బంధం చూడగానే నవ్వు తెప్పించే ఆహార్యం.. అబ్బుర పరిచే హావభావాలు. పొట్ట చెక్కలయ్యేలా నవ్వించే చమక్కులు.. ఇవన్నీ అలనాటి సినీ హాస్య నటుడు రేలంగి వెంకట్రామయ్య సొంతం. ఆయన తర్వాత ఎందరు హాస్య నటులు వచ్చినా ఆయన ముద్ర చెరిగిపోనిది. ఆయన పంచిన నవ్వు తరగిపోనిది. ఈనెల 13న రేలంగి జయంత్యుత్సవం సందర్భంగా ఆ మహా హాస్య నట కిరీటి ప్రస్థానం గురించి ఓ సారి.. తాడేపల్లిగూడెం ఒకటా.. రెండా.. ఎన్నో పాత్రలు.. హాస్యనటునిగానూ డ్యూయెట్లు.. సోలో సాంగ్స్.. అన్నింటిలోనూ మెప్పించి తనకు తానే సాటి అని నిరూపించుకున్న రేలంగి వెంకట్రామయ్య.. నటనా చాతుర్యం అజరామరం. ఆయన పండించిన హాస్యం ప్రేక్షకుల మదిలో ఇప్పటికీ పదిలం. తొలి పద్మశ్రీ అవార్డు అందుకున్న హాస్యనటుడు ఆయన. ’సరదా..సరదా.. సిగరెట్టు.. ఇది దొరల్ తాగు సిగరెట్టు.. పాటలో ఆయన పలికించిన హాభావాలు ఇప్పటికీ ఎవర్గ్రీన్. పారశీకం ఏంటి.. పరుషకం.. పరుషకం... టోపీ టింగురంగగా ఉందే అంటూ పాతాళభైరవిలో రాణీగారి తమ్ముడి పాత్రలో మెరిసిన రేలంగి నటన అద్భుతం. శర్మా... కరపీడనమే కదా చేయమను అంటూ మాయాబజారులో లక్ష్మణకుమారుని పాత్రకు వన్నె తెచ్చిన మేటి నటుడు రేలంగి. అదే సినిమాలో నాన్నగారు కోతి.. కోతిపిల్ల అంటూ.. భయంతో కూడిన హాస్యం పండించి విమర్శకుల ప్రశంసలందుకున్నారు రేలంగి. ఆయన నటనా కౌసలానికి ఈ చిత్రం నిలువెత్తు నిదర్శనం. 1935 నుంచి 1975 వరకు సుమారు 40 ఏళ్ల సినీ ప్రస్థానంలో రేలంగి నిత్యం హాస్యరస గుళికలను ప్రేక్షకులకు అందించారు. కడుపుబ్బా నవ్వించారు. నటుడిగా, నిర్మాతగా, గాయకుడిగా బహుముఖ ప్రజ్ఞ చూపించి మెప్పించారు. రేలంగి సినీ ప్రస్థానం ఇదీ.. తూర్పుగోదావరిజిల్లా రావులపాలెంలో 1910 ఆగస్టు 13న జన్మించిన ఆయన 1919లో బృహన్నల నాటకంలో స్త్రీపాత్ర ద్వారా నాటకరంగం ప్రవేశం చేశారు. ఎస్.వి.రంగారావు వంటి వారు సభ్యులుగా ఉన్న చెన్నైలోని యంగ్‌మెన్ హ్యాపీ క్లబ్లో చేరారు. 1931లో భక్తప్రహ్లాద సినిమా చూసి.. సినిమాలలో వేషాల కోసం కోల్‌కతా వెళ్లి సినీదర్శకుడు సి.పుల్లయ్యను కలిశారు. ఆయన నిర్మిస్తున్న శ్రీ కృష్ణతులాభారంలో పాత్ర పొందారు. వరవిక్రయం, గొల్లభామ వంటి సినిమాలలో నటించారు. గుణ సుందరి కథ సినిమాతో రేలంగికి మంచిపేరు వచ్చింది. మిస్సమ్మ, మాయాబజార్, దొంగ రాముడు, వెలుగునీడలు, విప్రనారాయణ, నర్తనశాల, అప్పుచేసి పప్పుకూడు వంటి సినిమాలు ఆయనను అగ్రభాగాన నిలబెట్టాయి. ఆయన నటించిన ఆఖరి చిత్రం పూజ (1975). గిరిజ, సూర్యకాంతంలతో డ్యూయెట్లు అప్పట్లో సినిమాలో రేలంగి ఉంటే ఆయన పక్కన నాయికలూ ఉండాల్సిందే. గిరిజ , లేదంటే సూర్యకాంతం ఎక్కువగా ఆయన పక్కన నటించి మెప్పించారు. అప్పుచేసి పప్పుకూడు సినిమాలో కాశీకి పోయానో రామా హరి.. గంగ తీర్థంబు తెచ్చాను రామా హరీ అనే పాటలో గిరిజ, రేలంగి ప్రదర్శించిన హాస్య నటన ప్రేక్షకులకు చిరకాలం గుర్తుండిపోతోంది. చదువుకున్న అమ్మాయిలు సినిమాలో ఏమిటీ ఈ అవతారం.. ఎందుకు ఈ సింగారం.. అంటూ సూర్యకాంతం, రేలంగి చేసిన సందడి ఇప్పుడు చూసినా అబ్బురపరుస్తోంది. కేవలం రేలంగి తెరమీద కనిపిస్తే చాలు ప్రేక్షకుల ముఖంలో నవ్వు వెల్లివిరిసేది. ఆయన నడక, నటన, డైలాగు చెప్పే తీరు మేళవించి ఆయనను మహా హాస్య నటునిగా ప్రేక్షకుల మదిలో నిలబెట్టాయి. గాయకుడిగానూ.. హాస్య నటుడిగా సినీ ప్రపంచాన్ని ఏలుతున్న రోజుల్లోనే ఆయన గాయకునిగానూ ప్రేక్షకులను ఆకట్టుకున్నారు. వినవేబాల నా ప్రేమ గోల అంటూ పాతాళభైరవిలో ఆయన పాడిన పాట ఇప్పటి తరాన్నీ కట్టిపడేస్తోందంటే అతిశయోక్తి కాదు. మిస్సమ్మ సినిమాలో కాణీ ధర్మం చేయి బాబూ.. అనే పాట కూడా ఆయనకు ఎంతో పేరు తెచ్చింది. 1949లో గుణసుందరి కథ, 1951లో పాతాళభైరవి, 1952లో ధర్మదేవత, 1954లో విప్రనారాయణ, పెద్దమనుష్యులు, 1955లో మిస్సమ్మ, 1959లో అప్పుచేసి పప్పుకూడు, 1966లో పరమానందయ్యశిష్యుల కథలో ఆయన పాటలు పాడారు. రాజబాబు ప్రవేశం రేలంగి పుణ్యమే శరీర విన్యాసాల ద్వారా ప్రేక్షకులకు గిలిగింతలు పెట్టే హాస్యనటుడు రాజబాబును సినిమాకు పరిచయం చేసింది రేలంగే. నిర్మాతగా ఆయన నిర్మించిన సామ్రాజ్యం సినిమాలో రాజబాబును రేలంగి పరిచయం చేశారు. స్వయం కృషితో ఎదిగారు తూర్పుగోదావరి జిల్లాలో పుట్టిన ఆయన వివాహ బంధం ద్వారా తాడేపల్లిగూడెం పట్టణంతో అనుబంధాన్ని అల్లుకున్నారు. పట్టణంపై ఆయనకు ఎంతో మక్కువ ఉండేది. దీంతో అప్పట్లోనే నూతన సాంకేతిక పరిజ్ఞానం.. సౌండ్ సిస్టంతో ఇక్కడ రేలంగి చిత్రమందిర్‌ను నిర్మించారు. భేషజాలకు. దర్పాలకు పోకుండా స్వయం కృషితో ఎదిగిన వ్యక్తి రేలంగి. పద్మశ్రీ అవార్డు అందుకున్న తొలి హాస్య నటుడు పద్మశ్రీ అవార్డు అందుకున్న తొలి తెలుగు హాస్య నటుడు రేలంగి వెంకట్రామయ్య కావడం విశేషం. రాష్ట్రపతి వీవీ గిరి చేతుల మీదుగా ఆయన ఈ అవార్డును అందుకున్నారు. ఒకే ఒక్క వారసుడు రేలంగికి ఒకే ఒక్క వారసుడు ఉన్నారు. సత్యనారాయణ బాబు. తండ్రి బాటలో నటనవైపు వెళ్లారు. నగేష్ లాంటి హాస్య నటుడిగా ఎదగాలని ఆకాంక్షించిన బాబు ఏపీ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా పనిచేసిన మోహన్ కందా స్నేహితులు. కలిసి చదువుకున్నారు. కలిసి సినిమాలలోనూ నటించారు. మూడుసార్లు ఉత్తమ నటుడిగా బహుమతులు సాధించారు. బాలానందం సినిమాలో హీరో, విలన్‌గానూ బాబు పాత్రలు పోషించారు. తమిళంలోని ఒక సినిమాను చట్టాలు మారాలి అనే పేరుతో తెలుగులో పునర్నిర్మించారు. ఇటీవలే ఆయన అనారోగ్యంతో మరణించారు. తాత బాటలో మనుమడు హేమంత్ తాత రేలంగి బాటలో సినిమాలలో రాణించాలని రేలంగి కుమారుడు సత్యనారాయణబాబు చిన్న కుమారుడు హేమంత్ సినిమాలలో నటిస్తున్నారు. రేలంగి పేరిట పట్టణానికి చెందిన బాల్ పాయింట్ చిత్రకారుడు ఎస్వీఆర్ చిన్ని తదితరుల ఆధ్వర్యంలో పద్మశ్రీ రేలంగి మెమోరియల్ కల్చరల్ యూనిట్ పేరుతో సంగీత, సాహిత్య సాంస్కృతిక, సేవాసంస్థను 1978లో ఏర్పాటు చేశారు. రేలంగి సినీ రంగ విశేషాలతో 1979లో ఒక సావనీర్‌ను ప్రచురించి విడుదల చేశారు. గూడెంలో రేలంగి జయంత్యుత్సవం రేలంగి గురించి ఇప్పటి తరాలకు తెలియజేయాలనే సంకల్పంతో దేవాదాయశాఖ మంత్రి పైడికొండల మాణిక్యాలరావు ఈనెల 13న ధవళసత్యం కళామిత్ర మండలి, రాష్ట్ర సాంస్కృతిక శాఖ సంయుక్త ఆధ్వర్యంలో జయంత్యుత్సవాలను బీవీఆర్ కళాకేంద్రంలో ఏర్పాటుచేశారు. పాఠశాలల విద్యార్థులకు వ్యాసరచన, వక్తృత్వ పోటీలను నిర్వహించనున్నారు. హాస్య లఘు నాటికలు, రేలంగి సినీ గీతాల పోటీలు ఏర్పాటుచేశారు. రేలంగి గీతాలతో ప్రత్యేక ఆర్కెస్ట్రా నిర్వహించనున్నారు. ఈ కార్యక్రమానికి రేలంగి తనయుడు సత్యనారాయణబాబు కుటుంబ సభ్యులు, ప్రముఖ దర్శకులు ధవళ సత్యం, రేలంగి నరసింహారావు హాజరు కానున్నారు.