వడివడి అడుగులు | new technology | Sakshi
Sakshi News home page

వడివడి అడుగులు

Published Wed, Dec 28 2016 10:46 PM | Last Updated on Wed, Apr 3 2019 9:27 PM

వడివడి అడుగులు - Sakshi

వడివడి అడుగులు

జిల్లాలో జల రవాణా పునరుద్ధరణపై
ఏజీన్సీని నియమించిన ప్రభుత్వం 
జిల్లాలో కాలువపై ఉన్న వంతెనలన్నీ తొలగింపు 
200 వందల ఎకరాలకు పైగా భూ సేకరణ
 
 
తాడేపల్లిగూడెం :
జిల్లాలో జల రవాణా మార్గాన్ని పునరుద్ధరించే దిశగా వడివడి అడుగులు పడుతున్నాయి. విజ్జేశ్వరం నుంచి ఏలూరు వరకు గల గోదావరి ప్రధాన కాలువ విస్తరణ, టెర్మినల్స్‌ పనులకు సంబంధించి సర్వే నిమిత్తం ప్రభుత్వం కాంట్రాక్ట్‌ ఏజెన్సీని నియమించింది. గోదావరి ప్రధాన కాలువతోపాటు దానికి అనుబంధంగా ఉన్న కాలువల విస్తరణ, ఇతర పనుల కోసం ఎంత భూమిని సేకరించాలి, ఏయే భూములను సేకరించాలనే దానిపై కాంట్రాక్ట్‌ ఏజెన్సీ ఆధ్వర్యంలో త్వరలోనే సర్వే పనులు ప్రారంభం కానున్నాయి. ఇందుకు సంబంధించి రెవెన్యూ, జల వనరుల శాఖల అధికారులు ఏలూరులో సమావేశమై కీలకాంశాలపై చర్చించారు. ఎక్కడి నుంచి ఎక్కడి వరకు కాలువల్ని విస్తరించాలి, ఎన్ని వంతెనల్ని తొలగించాల్సి ఉంటుంది, ఎంత భూమి అవసరం అవుతుంది, అందులో రైతులు, ఇతరుల నుంచి సేకరించాల్సిన భూమి ఎంత, జల వనరుల శాఖకు చెందిన భూమి ఎంత ఉందనే విషయాలపై సమీక్షించారు. 
సర్వే.. మార్కింగ్‌ బాధ్యతలు కాంట్రాక్ట్‌ ఏజెన్సీకే..
కాలువను ఏ మేరకు వెడల్పు చేయాలి, ఎక్కడ వంతెనలు తొలగించాలి, ఎక్కడెక్కడ భూముల్ని సేకరించాల్సి ఉందనే విషయాలపై సర్వే చేయాల్సిన బాధ్యతన కాంట్రాక్ట్‌ ఏజెన్సీకి అప్పగించారు. కాలువ వెంబడి మార్కింగ్‌ ఇచ్చే పనిని కూడా ఆ సంస్థే చేపట్టాల్సి ఉంటుంది. సర్వే నివేదిక అందిన అనంతరం రెవెన్యూ అధికారులు రంగంలోకి దిగుతారు. సరిహద్దుల ఆధారంగా ఏ భూమి ఎంత ఉంది, ఏయే సర్వే నంబర్లలో ఉంది, రైతుల నుంచి ఎంత భూమి సేకరించాలనే దానిపై రెవెన్యూ అధికారులు క్షేత్రస్థాయి పరిశీలన జరిపి ప్రభుత్వానికి నివేదిస్తారు. అనంతరం అసలు పనులు మొదలవుతాయి. 
 
ఊరి వెలుపల కాలువ వెడల్పు 110 మీటర్లు 
జల రవాణా నిమిత్తం కాలువలో గర్భం వెడల్పు 25 మీటర్లు ఉంటే సరిపోతుందని భావించారు. ప్రస్తుతం ఆ కొలతలు మారాయి. కాలువ గర్భంలో వెడల్పు 40 మీటర్లు ఉండాలని, కాలువ పైభాగంలో 60 మీటర్ల వెడల్పు ఉండాలని నిర్దేశించారు. పట్టణాలు, గ్రామాల బయట మాత్రం కాలువ వెడల్పు 110 మీటర్లు ఉండేలా చర్యలు చేపట్టబోతున్నారు. ఏలూరులో కాలువను విస్తరించడానికి అనువైన పరిస్థితులు లేనందువల్ల అక్కడి నుంచి బైపాస్‌ కెనాల్‌ తవ్వాలని తొలుత భావించారు. అయితే, తూర్పు లాకులు దాటిన తరువాత ఉన్న కాలువను అవసరమైన మేరకు విస్తరించాలనే యోచనలో అధికారులు ఉన్నారు. బైపాస్‌ కెనాల్‌ తవ్వకానికి పెద్ద ఎత్తున భూసేకరణ చేయడం ఆర్థికంగా భారమవుతుందని, న్యాయపరమైన ఇబ్బందులూ తలెత్తే అవకాశం ఉందన్న ఆలోచనకు వచ్చిన అధికారులు ఆ నిర్ణయాన్ని ఉపసంహరించుకున్నట్టు సమాచారం.
 
అన్ని వంతెనల్ని తొలగించాల్సిందే
విజ్జేశ్వరం నుంచి  ఏలూరు వరకు 74.514 కిలోమీటర్ల మేర విస్తరించి ఉన్న గోదావరి ప్రధాన కాలువపై ఉన్న వంతెనలన్నింటిని తొలగిస్తారు. చిన్నాపెద్దా కలిసి 46 వంతెనలు తొలగించాల్సి ఉంటుందని జల వనరుల శాఖ ప్రాథమికంగా అంచనా వచ్చింది. కాలువ వెడల్పు చేసిన అనంతరం పాత వంతెనల స్థానంలో కొత్త వంతెనలు నిర్మిస్తారు.  రవాణాకు ప్రతిబంధకంగా లేకుండా వంతెనలకు అటుఇటు మాత్రమే పిల్లర్లు ఉండేలా నిర్మాణాలు చేపడతారు.
 
జిల్లాలో రెండే టెర్మినల్స్‌ 
కార్గో బోట్ల ప్రయాణం, జెట్టీల నిర్మాణం, సరుకులు ఎగుమతి, దిగుమతులు, గోదాముల నిర్మాణాలకు అనువైన స్థలాల విషయమై రైట్స్‌ (రైల్‌ ఇండియా టెక్నికల్‌ అండ్‌ ఎకనమిక్‌ సర్వీస్‌) సంస్థ నివేదిక రూపొందించింది. దీని ప్రకారం తాడేపల్లిగూడెం, నిడదవోలు పట్టణాల్లో మాత్రమే టెర్మినల్స్‌ ఏర్పాటు చేస్తారని జల వనరుల శాఖ అధికారులు చెబుతున్నారు. ఏలూరులోనూ టెర్మినల్‌ ఏర్పాటు చేయాల్సి ఉంటుందని గతంలో అనుకున్నారు. ఇందుకు అవసరమైన స్థలం, మౌలిక వసతుల కల్పన కష్టతరంగా ఉండటంతో జిల్లాలో రెండు టెర్మినల్స్‌ ఏర్పాటు చేస్తారు. 
 
మార్కింగ్‌ తర్వాత రాళ్లు వేస్తాం
జల రవాణాకు సంబంధించి జిల్లాలో సర్వే నిమిత్తం ఏజెన్సీని నియమిస్తూ ఉత్తర్వులు వెలువడ్డాయి. ఆ ఏజన్సీ ఆధ్వర్యంలో మార్కింగ్‌ ఇచ్చాక ఆ ప్రాంతంలో రాళ్లను పాతిస్తాం. ఈ వివరాలను రెవెన్యూ అధికారులకు తెలియచేస్తాం. గోదావరి ఏలూరు కాలువపై ఉన్న అన్ని  వంతెనలను తొలగించాలి. తాడేపల్లిగూడెం, నిడదవోలులో మాత్రం టెర్మినల్స్‌ ఏర్పాటు చేస్తారు.
  జేబీ నాయక్, జల వనరుల శాఖ , తాడేపల్లిగూడెం సబ్‌ డివిజన్, డీఈఈ
 
భూముల వివరాలు సేకరిస్తాం
జల రవాణా పునరుద్ధరణకు అవసరమైన భూమిని సేకరించేందుకు ప్రభుత్వానికి నివేదిక ఇవ్వాల్సి ఉంటుంది. జల వనరుల శాఖ అధికారులు రాళ్లుపాతి సరిహద్దులు నిర్ణయించిన అనంతరం ఈ పని చేపట్టి ఉన్నతాధికారులకు నివేదిస్తాం.
 పాశం నాగమణి, తహసీల్దార్‌. తాడేపల్లిగూడెం
 
 
 
 
 

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement