ఆక్వాపుడ్ పార్కు నిర్మాణం తక్షణమే ఆపాలి
Published Wed, Oct 12 2016 9:16 PM | Last Updated on Thu, Oct 4 2018 5:10 PM
రౌండ్‌టేబుల్ సమావేశంలో వక్తలు
తాడేపల్లిగూడెం
కాలుష్యాన్ని వెదజల్లే ఆక్వాఫుడ్ పార్కు ఏర్పాటు తక్షణమే నిలుపుదల చేయాలని , గ్రామాలపై పోలీసు నిర్భంధాన్ని ఎత్తివేయాలని , అక్రమ కేసులు ఎత్తివేయాలని బుధవారం స్ధానిక సుందరయ్య భవనంలో నిర్వహించిన రౌండ్‌టేబుల్ సమావేశంలో అఖిలపక్ష నాయకులు డిమాండ్ చేశారు. వైఎస్‌ఆర్‌సీపి ఎస్‌సీఎస్‌టీ సెల్ రాష్ట్ర కార్యదర్శి లంకా మోహన్‌బాబు మాట్లాడుతూ తుందుర్రు పరిసర ప్రాంతాలలో ప్రజలపై చంద్రబాబు ప్రభుత్వం నిర్భంద వైఖరి ప్రదర్శించడం చాలా దారుణమన్నారు. వెంటనే పోలీసు పహరాను తొలగించాలని డిమాండ్ చేశారు. ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా నాయకులు కండెల్లి సోమరాజు మాట్లాడుతూ జీరోశాతం కూడా కాలుష్యం లేకుండా పరిశ్రమను ఏర్పాటుచేస్తున్నామని , యాజమాన్యం చేసిన ప్రకటనలో వాస్తవం లేదన్నారు. గొంతేరు నది పూర్తిగా పాడవుతుందని ప్రొఫెసర్ స్వామి ఇతరులు చెప్పినా కూడా ప్రభుత్వం పెడచెవినపెట్టి . యాజమాన్యానికి కొమ్ముకాస్తుందని ఆరోపించారు. కులనిర్మూలన సమితి రాష్ట్ర నాయకులు మెరిపో జాన్‌రాజు మాట్లాడుతూ సన్న,చిన్నకారు రైతులకు ఈ పాలనలో రక్షణ లేకుండా పోయిందన్నారు. ప్రశ్నించే వారిపై కేసులుపెట్టి ఉద్యమాలను అణచివేయాలని చూడటం అవివేకమన్నారు. గుజరాత్ తిరస్కరించిన ఆక్వాపార్కును ఇక్కడ ఏర్పాటుచేయడం ప్రజల ఆరోగ్యంతో చెలగాటమాడటమే నన్నారు. నిర్భంద గ్రామాల పరిశీలనకు వెళుతున్న అఖిలపక్ష నాయకులపై కేసులు పెట్టడం అన్యాయమని సీపిఐ ఎంఎల్ న్యూ డెమోక్రసీ నాయకులు మామిడి దానవరప్రసాద్ అన్నారు. నాయకులపై దురుసుగా ప్రవర్తిస్తున్న ఎస్‌ఐ సుధాకరరెడ్డిని విధుల నుంచి సస్పెండ్ చేయాలని డిమాండ్ చేశారు. సీఐటియు నాయకులు చిర్ల పుల్లారెడ్డి, గొన్నాబత్తుల నాగేశ్వరరావు, మడకరాజు, వర్రి సత్యనారాయణ, చింతా పద్మావతి, ఏ.విజయ. పి.సరోజ పందల సన్యాసిరావులు పాల్గొన్నారు.
Advertisement