ఆర్‌ఐడీసీలోకి కడప–బెంగళూరు రైలుమార్గం
► జాయింట్ వెంచర్‌లో రైలుమార్గానికి కదలిక
► కేంద్ర, రాష్ట ప్రభుత్వాల మ«ధ్య కుదిరిన ఒప్పందం
► నాలుగు దశల్లో రైలుమార్గం నిర్మాణం
ఎన్నో ఏళ్లుగా జిల్లా వాసుల కలగా మిగిలిన కడప– వయా మదనపల్లె – బెంగళూరు రైలుమార్గంలో మలిదశ పనులు మొదలయ్యాయి. ఆర్‌ఐడీసీలోకి ఆ మార్గాన్ని తీసుకోవడంతో కాస్తంత ఊరట లభించినట్లైంది. త్వరగా ఆ మార్గాన్ని అందుబాటులోకి తీసుకొచ్చేందుకు రైల్వేశాఖ, రాష్ట్రప్రభుత్వం సంయుక్తంగా అడుగులు వేస్తున్నాయి.
మదనపల్లె సిటీ : కడప– బెంగళూరు మధ్య రైలు మార్గం నిర్మాణానికి 2010 సెప్టెంబర్‌లోఅప్పటి రైల్వేశాఖ మంత్రి మునియప్ప శంకుస్థాపన చేశారు. ఇది దివంగత సీఎం వైఎస్సార్ మానసపుత్రిక, ఈ రైలుమార్గానికి 2008–09 బడ్జెట్‌లో ఆమోదం లభించింది. రూ.1,000 కోట్ల అంచనా వ్యయంతో రైలుమార్గం నిర్మాణ పనులు మొదలయ్యాయి. 258 కిలోమీటర్ల మేర రైలుమార్గం నిర్మాణానికి 1,531 ఎకరాల భూమిని సేకరించాల్సి ఉంది. మొత్తం ఐదేళ్లలో ప్రాజెక్టును పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నారు.
అయితే ఆ లక్ష్యం 15 ఏళ్లు దాటిపోయేటట్లు కనిపిస్తోంది. భూసేకరణకు రూ.199.2 కోట్లు కేటాయించా రు. కాగా రైల్వేలైన్ నిర్మాణానికి 2016–17లో రూ.58 కోట్లు, 2017–18లో రూ.240 కోట్లను కేటాయించా రు. మొదటి దశలో భాగంగా ఇప్పటికే పెండ్లిమర్రి వరకు లైను సిద్ధం చేసి డెమో రైలును నడిపిస్తున్నారు. మొత్తం నాలుగు దశల్లో కడప–బెంగళూరు రైలుమార్గం చేపట్టాలని రైల్వేశాఖ నిర్ణయించుకుంది.
రూ.100 కోట్ల వ్యయంతో ఆర్‌ఐడీసీ..
రైల్ నెట్‌వర్క్ విస్తరణలో భాగంగా రైల్వేశాఖ, రాష్ట్ర ప్రభుత్వం భాగస్వామ్యంతో రైల్వే ప్రాజెక్టులను త్వరగా పూర్తి చేసేందుకు రైల్వే మంత్రిత్వ శాఖ, రాష్ట్ర ప్రభుత్వం ప్రణాళికలు, సమగ్ర నివేదికలు రూపొందిస్తున్నాయి. ఇందులో భాగంగా నూతనంగా రూ.వందకోట్ల వ్యయంతో రైల్ ఇన్‌ఫ్రా స్ట్రక్చర్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ ఏర్పాటైంది. ఈ మేరకు కేంద్ర, రాష్ట ప్రభుత్వాల మధ్య ఒప్పందం కుదిరింది.
నిర్మాణ దశలు ఇలా...
మొదటి దశలో రూ.153 కోట్లు కేటాయింపులు జరిగాయి. భూసేకరణకు సంబంధించి రూ.89 కోట్లలో రూ.20 కోట్లను రైల్వేశాఖ వ్యయం చేసింది. ఈ దశలో 21.8 కిలోమీటర్ల వరకు లైన్ నిర్మాణం చేపట్టారు. కడప నుంచి గంగనపల్లె, పెండ్లిమర్రి వరకు పట్టాలు వేశారు. 311.84 ఎరరాల భూమిని సేకరించారు. 54 చిన్నబ్రిడ్జిలు, ఆరుపెద్ద బ్రిడ్జిల నిర్మాణం చేపట్టారు. రూ.199.2 కోట్లు నిర్మాణం కోసం వ్యయం చేశారు. రెండవదశలో పెండ్లిమర్రి–రాయచోటి, రాయచోటి – వాల్మీకిపురం లైన్ చేపట్టనున్నారు. మూడవ దశలో మదనపల్లెరోడ్డు – మదగట్ట(ఆంధ్రప్రదేశ్ సరిహద్దు), మదగట్ట– ముళబాగల్ (కర్ణాటక రాష్ట్ర సరిహద్దు) లైను పూర్తి చేయాలనుకుంటున్నారు. నాలుగవ దశలో ముళబాగల్– కోలార్ మధ్య నిర్మాణం చేపట్టేలా కడప–బెంగళూరు రైల్వేలైన్ రూపకల్పన జరిగింది.