
కురుబలు అన్ని రంగాల్లో రాణించాలి
- కనకదాసు జయంతి ఉత్సవంలో శంకరనారాయణ
పెనుకొండ (పరిగి) : కురుబలు అన్ని రంగాల్లో రాణించాలని వైఎస్సార్‌సీపీ జిల్లా అధ్యక్షుడు మాలగుండ్ల శంకరనారాయణ అన్నారు. పరిగి మండలం కొడిగెనహళ్లిలో ఆదివారం కురుబ కులస్థులు పెద్దఎత్తున కనకదాసు జయంతి ఉత్సవం నిర్వహించారు. ముఖ్య అతిథిగా హాజరైన శంకరనారాయణ మాట్లాడుతూ కురుబలు విద్య, సామాజిక, రాజకీయ, ఆర్థిక పరంగా చైతన్యవంతం కావాలన్నారు. ఐక్యతతో ముందుకు సాగినప్పుడే లక్ష్యాలను చేరుకోగలమన్నారు.
అనంతరం ఆయన కనకదాసు చిత్రపటం వద్ద ప్రత్యేక పూజలు నిర్వహించారు. మహిళలు, గ్రామస్తులు పెద్ద ఎత్తున జ్యోతులతో ర్యాలీ నిర్వహించగా ఆయన వారితో కలిసి నడిచారు. కార్యక్రమంలో వైఎస్సార్ సీపీ నాయకులు ప్రభాకర్, చిరంజీవి, ఎల్లప్ప తదితరులు పాల్గొన్నారు.