- ఐదుతరాల ‘కంచర్ల’ అనుబంధం
- ఒకేచోట కలసిన 250 మంది కుటుంబ సభ్యులు
కొలువుదీరిన వంశవృక్షం
Published Fri, Jan 13 2017 11:04 PM | Last Updated on Tue, Sep 5 2017 1:11 AM
కడలి(రాజోలు) :
ఐదు తరాల వంశవృక్షం ఒకేచోట కలిసింది. వారి ఆనందానికి అవధులు లేవు. శుక్రవారం కడలి గ్రామంలో కంచర్ల సోమరాజు, సత్యవతి వంశానికి చెందిన ఐదు తరాలకు చెందిన 250 మంది కలుసుకున్నారు. కంచర్ల సోమరాజు, సత్యవతిలకు నలుగురు కుమారులు వెంకన్న, సుబ్బయ్య, పూర్ణచంద్రరావు, కాశీ, ఆరుగురు కుమార్తెలు ఉన్నారు. వారి సంతానం సుమారు 250 మంది కడలి గ్రామం వచ్చారు. సంక్రాతి పండుగ సందర్భంగా దేశ, విదేశాల్లో ఉన్న కంచర్ల కుటుంబీకులు ఈ ఏడాది కలుసుకోవాలని నిర్ణయించుకున్నారు. గత ఏడాది నుంచి కంచర్ల సోమశేఖర్‌గుప్త కుటుంబీకులను ఒకచోట చేర్చేందుకు చేపట్టిన కృషికి కుటుంబ సభ్యులంతా సహకరించారు. దీంతో అమెరికా, దుబాయి, సింగపూర్, బెంగళూరు, చెన్నై, హైదరాబాద్, విశాఖపట్టణం తదితర ప్రాంతాలకు చెందిన అన్నదమ్ములు, అక్కచెల్లెళ్లు, పెదనాన్నలు, చిన్నాన్నలు అంతా కడలి గ్రామం చేరుకున్నారు. దీంతో కడలిలో పండగ వాతావరణం నెలకొంది. దీనికోసం ప్రత్యేక వేదిక ఏర్పాటు చేసి కంచర్ల కుటుంబీకులు ఆటలు, పాటలతో ఆనందాన్ని పంచుకున్నారు. పెళ్లిళ్లకు, పండగలకు కొద్దిమంది కలిసేవాళ్లమని, ఒకేసారి కుటుంబ సభ్యులంతా ఇలా కలవడం చాలా ఆనందంగా ఉందని శేఖర్ సంతోషాన్ని వ్యక్తం చేశారు.
Advertisement
Advertisement