
సదస్సులో మాట్లాడుతున్న గోవర్ధన్
ఎన్నికలకు ముందు టీఆర్‌ఎస్ తరఫున ఇచ్చిన హామీలను కేసీఆర్ పూర్తిగా విస్మరించారని న్యూడెమోక్రసీ రాష్ట్ర నాయకుడు ఆర్.గోవర్ధన్ విమర్శించారు.
- న్యూడెమోక్రసీ రాష్ట్ర నాయకుడు గోవర్ధన్
ఇల్లెందు : ఎన్నికలకు ముందు టీఆర్‌ఎస్ తరఫున ఇచ్చిన హామీలను కేసీఆర్ పూర్తిగా విస్మరించారని న్యూడెమోక్రసీ రాష్ట్ర నాయకుడు ఆర్.గోవర్ధన్ విమర్శించారు. ఈ నెల 9న ఆదివాసీ దినోత్సవం సందర్భంగా ‘ఆదివాసీ హక్కులకు మరణ శాసనం–రాజ్యాంగ ఉల్లంఘనలు’ అంశంపై శుక్రవారం మార్కెట్ యార్డులో ఏర్పాటైన సదస్సులో ఆయన ప్రసంగించారు. ఆదివాసీ హక్కులకు రక్షణ లేదని, చట్టాలు అమలవడం లేదని; దేశ జనాభాలో 12 శాతంగా ఉన్న వీరికి (ఆదివాసీలకు) రిజర్వేషన్ ఫలాలు అందడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. అడవిపై ఆధారపడి జీవిస్తున్న ఆదివాసీలకు వంట చెరుకు కొట్టుకునే స్వేచ్ఛ లేకుండా అధికారులు హరిస్తున్నారని విమర్శించారు. హరితహారం, వనం–మనం పేరుతో అడవుల నుంచి ఆదివాసీలను బయటకు పంపే కుట్ర సాగుతోందని ఆందోళన వ్యక్తం చేశారు. ఆదివాసీలకు విద్య, వైద్యం, ఆరోగ్యం, కనీస సదుపాయాలు కల్పించడంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు తీవ్ర నిర్లక్ష్యం ప్రదర్శిస్తున్నాయని ధ్వజమెత్తారు. ‘‘గిరిజనులు, గిరిజనేతర పేదల్లో అనేకమందికి పోడు సాగే జీవనాధారం. వారి నుంచి ఆ భూములను ప్రభుత్వం బలవంతంగా లాక్కుంటోంది. ఈ నేపథ్యంలో, స్థానిక ఎమ్మెల్యే కోరం కనకయ్య, మంత్రులు జోగు రామన్న, చందూలాల్.. ఎవరి పక్షాన ఉంటారు? సీఎం కేసీఆర్ పక్షమా..., గిరిజనుల పక్షమా...?’’ అని ప్రశ్నించారు. జీవించే హక్కు రక్షణకు, చట్టాల అమలుకు, మెరుగైన జీవనానికి ఆదివాసీలు ప్రతినబూనాలని కోరారు. ఈ సదస్సులో న్యూడెమోక్రసీ నాయకులు యదళ్లపల్లి సత్యం, ఎట్టి ప్రసాద్, భూక్యా లక్ష్మణ్, ఊక్లా, సనప పొమ్మయ్య, కొమురం సత్యనారాయణ, మదార్, తుడుందెబ్బ రాష్ట్ర నాయకులు రమణాల లక్ష్మయ్య, రాసుద్దీన్, మోకాళ్ల రమేష్, సాంబ, ప్రేమ్‌కుమార్ తదితరులు పాల్గొన్నారు.