కేసీఆర్ సర్కార్‌పై అసంతృప్తి పెరుగుతోంది
♦ ఈ అసంతృప్తి నుంచి లెఫ్ట్ బలపడేలా చేయడమే మా లక్ష్యం
♦ 2016 కల్లా వామపక్ష, సామాజిక శక్తులతో కూటమి ఏర్పాటు
♦ నేటి నుంచి 3 రోజుల పాటు నాగార్జునసాగర్‌లో సీపీఎం ప్లీనమ్
♦ సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రంతో ‘సాక్షి ’ప్రత్యేక ఇంటర్వ్యూ
సాక్షి, హైదరాబాద్ : కేసీఆర్ ప్రభుత్వ పాలన పై వివిధ వర్గాల ప్రజల్లో అసంతృప్తి క్రమక్రమంగా పెరుగుతోందని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం అన్నారు. ప్రజల్లో పెరుగుతున్న ఈ అసంతృప్తి నుంచి కాంగ్రెస్, టీడీపీ, బీజేపీ వంటి బూర్జువా పార్టీలు రాజకీయంగా లబ్ధి పొందకుండా ప్రజలపక్షాన నిలిచి పోరాడే వామపక్షాలు బలపడేందుకు ఏమి చేయాలన్నది తమ ముందున్న కర్తవ్యమని పేర్కొన్నారు. ప్రజల్లో ఉన్న వ్యతిరేకత నుంచి సంస్థాగతంగా, ఇతరత్రా బలంగా ఉన్న ప్రధాన ప్రతిపక్షం కాంగ్రెస్ ప్రయోజనం పొందకుండా వామపక్షాలు మరింత పదునుగా, క్రియాశీలంగా వ్యవహరించాల్సి ఉందన్నారు.
ఆదివారం నుంచి మూడు రోజుల పాటు నల్లగొండ జిల్లా నాగార్జునసాగర్‌లో జరగనున్న సీపీఎం తెలంగాణ రాష్ట్ర ప్లీనమ్ సమావేశాల్లో రాబోయే ఆరు నెలల్లో చేపట్టబోయే భవిష్యత్ కార్యాచరణను సిద్ధం చేసుకుంటామని ఆయన చెప్పారు. రాష్ట్రంలోని రాజకీయ పరిస్థితులు, సమస్యలు, జిల్లా స్థాయిల్లోని ఆయా అంశాలపై జిల్లా పార్టీల నుంచి వచే ్చ నివేదికల ఆధారంగా భవిష్యత్ కార్యాచరణ రూపొందిస్తామన్నారు. ప్లీనమ్ నేపథ్యంలో తమ్మినేని వీరభద్రం ‘సాక్షి’కి ఇచ్చిన ప్రత్యేక ఇంటర్వ్యూలోని ముఖ్యాంశాలివీ..
టీఆర్‌ఎస్ ప్రభుత్వంపై రైతులు, వ్యవసాయకూలీలు, ఆశ, కాంట్రాక్ట్, స్కీం, ఔట్‌సోర్సింగ్, తదితర రంగాల కార్మికుల్లో ఈ అసంతృప్తి తీవ్రంగా ఉందని, జీతాలు బాగా పెంచిన ప్రభుత్వ ఉద్యోగుల్లో కూడా ఇది పెరుగుతుండటం గమనార్హమని తమ్మినేని అన్నారు. రైతుల ఆత్మహత్యలు, ఇతర సమస్యలపై తాము ముందుగా కార్యక్రమాలను చేపట్టినా, ఈ విషయంలో కాంగ్రెస్ కంటె వెనకబడ్డామని, ఈ పరిస్థితిని అధిగమించేలా కార్యాచరణను రూపొందించుకోవాల్సిన ఆవశ్యకత ఏర్పడిందన్నారు. 2016 కల్లా వామపక్ష, ప్రజాతంత్ర, లౌకిక, సామాజికశక్తులతో కలసి ఒక కూటమి ఏర్పడేందుకు కృషి జరగాల్సి ఉందన్నారు.
సీపీఎం తెలంగాణ రాష్ర్ట తొలిమహాసభ తర్వాత గత 6, 7 నెలల్లో బీసీ, ఎస్సీ, ఎస్టీల సమస్యలపై చేపట్టిన ఉద్యమాలు, మున్సిపల్, ఆశ, పంచాయతీ, ఉపాధిహామీ, ఆరోగ్యశ్రీ కార్మికుల సమస్యలపై నిరసనలు, ఆందోళనలు, ఉద్యమాల ప్రభావంపై సమీక్షిస్తామని తమ్మినేని వీరభద్రం చెప్పారు. సామాజిక ఉద్యమాలను మండల, గ్రామస్థాయి వరకు తీసుకెళ్లి, ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఇతర అణగారిన వర్గాలను చైతన్యవంతం చేయాల్సిన అవసరం ఉందని తెలిపారు. ప్రస్తుతం పార్టీపరంగా, విడిగా కలిసొచ్చే సామాజిక సంస్థలతో ఉమ్మడిగా చేపట్టిన ఉద్యమాలకు మంచి గుర్తింపే వచ్చినా కిందిస్థాయి వరకు వీటిని తీసుకెళ్లాల్సి ఉందన్నారు.
రాబోయే రోజుల్లో కార్మిక, రైతాంగ సమస్యలతోపాటు కుల, వర్గపోరాటాలను ముందుకు తీసుకెళ్లాల్సిన అవసరం ఉందన్నారు. ప్రభుత్వంపై వెల్లడవుతున్న అసంతృప్తిపై గ్రామాలతోపాటు పట్టణాల్లో వార్డులు, డివిజన్ల స్థాయిలో కార్యక్రమాలు రూపొందించి తద్వారా స్థానికంగా పార్టీ పటిష్టానికి చర్యలు తీసుకుంటామన్నారు. రాష్ట్రంలోని 440 మండలాల్లో పార్టీని బలోపేతం చేసే దిశగా కార్యాచరణను రూపొందిస్తామని చెప్పారు. కేడర్‌కు రాజకీయ శిక్షణ తరగతులు, వారి పనితీరు సమీక్ష, మెరుగైన ఫలితాల సాధనకు అవసరమైన కార్యక్రమాలను రూపొందిస్తామన్నారు.
సీపీఐతో పాటు, మిగతా వామపక్షాల మధ్య సమన్వయం బాగా కుదిరిందని, దీనిని రాబోయే రోజుల్లో మరింత ముందుకు తీసుకెళతామన్నారు. మూడురోజుల పార్టీ ప్లీనంలో ప్రజాసమస్యలు, కరువు, రైతుల ఆత్మహత్యలు, కార్మికుల సమస్యలు, బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ ఇతర సామాజికవర్గాలు ఎదుర్కొంటున్న తక్షణ సమస్యలు.. వాటి పరిష్కారానికి చేపట్టాల్సిన కార్యక్రమాలపై చర్చిస్తామన్నారు.