ఖేడ్ కౌంటింగ్ ప్రారంభమైంది..
♦ ఉదయం 8 గంటలకు ప్రారంభమైన ఓట్ల లెక్కింపు ప్రక్రియ
♦ మొత్తం 14 టేబుళ్లు, 21 రౌండ్లు
♦ రెండు, మూడు గంటల్లోనే ఉప ఎన్నిక ఫలితం వెల్లడి
నారాయణఖేడ్: మెదక్ జిల్లా నారాయణఖేడ్ అసెంబ్లీ ఉప ఎన్నిక కౌంటింగ్ ప్రారంభమైంది. మండలం జూకల్ శివారులోని పాలిటెక్నిక్ కళాశాలలో కౌంటింగ్ కేంద్రాన్ని ఏర్పాటుచేసిన విషయం తెలిసిందే. ఎన్నికల రిటర్నింగ్ అధికారి, జిల్లా అడిషనల్ జాయింట్ కలెక్టర్ వాసం వెంకటేశ్వర్లు ఉదయమే కౌంటింగ్ కేంద్రానికి చేరుకుని ఏర్పాట్లను పర్యవేక్షించారు. కౌంటింగ్‌కు 14 టేబుళ్లను ఏర్పాటు చేశామని, మొత్తం 21 రౌండ్లు నిర్వహించనున్నట్లు తెలిపారు. దీనికి 137 మంది ఉద్యోగులను నియమించినట్లు పేర్కొన్నారు. 11 గంటల వరకు ఫలితం వెలుడడే అవకాశంఉంది.
ప్రతీ టేబుల్‌కు ఒక కౌంటింగ్ సూపర్‌వైజర్, ఇద్దరు అసిస్టెంట్లు, ఒక మైక్రో అబ్జర్వర్‌ను నియమించారు. ఈ ఫలితాలను త్వరితగతిన అందించేందుకు ప్రింటర్ కమ్ ఆగ్జీలరీ డిస్‌ప్లే యూనిట్లను వినియోగిస్తున్నారు. ఫలితాల సమాచారం ఎప్పటికప్పుడు మీడియాకు అందించేందుకు కౌంటింగ్ కేంద్రంలో మీడియా సెంటర్‌ను కూడా ఏర్పాటు చేశారు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా గట్టి భద్రత ఏర్పాటు చేశామని ఎన్నికల అధికారి వెంకటేశ్వర్లు వివరించారు.