
కిలాడీ మహిళ..
మహిళతో పాటు మరో ముగ్గురు అరెస్ట్
రూ.50 లక్షలు విలువ చేసే 1761 గ్రాముల బంగారు స్వాధీనం
బంగారు బిస్కెట్‌లు ఇస్తానని రైస్ మిల్లు యజమానికి రూ.2.36 కోట్ల టోకరా
ప్రొద్దుటూరు క్రైం: గల్ఫ్ దేశం నుంచి బంగారు బిస్కట్‌లను తెప్పించి మార్కెట్ ధర కంటే రూ. 20 వేలకు తక్కువకు ఇస్తానని ఓ కిలాడీ మహిళ రైస్ మిల్లు ఓనర్‌ను మోసం చేసింది. ఆమె మాటలను నమ్మి రూ. 2.36 కోట్ల మేర బంగారు, డబ్బు ఇచ్చిన రైస్ మిల్లు యజమాని మోసపోయాడు. అతని ఫిర్యాదు మేరకు రంగంలోకి దిగిన పోలీసులు ఆమెను అరెస్ట్ చేశారు. ఆమెకు సహకరించిన మరో ముగ్గురిని పోలీసులు మీడియా ఎదుట హాజరు పరిచారు. బుధవారం సాయంత్రం రూరల్ పోలీస్‌స్టేషన్‌లో నిర్వహించిన విలేకరుల సమావేశంలో అడిషనల్ ఎస్పీ పీవీజీ విజయ్‌కుమార్ వివరాలను వెల్లడించారు.
స్థానిక నడింపల్లెకు చెందిన విజయ 9వ తరగతి వరకు చదువుకుంది. పెళ్లైన తర్వాత కొన్నేళ్లకే భర్తను వదిలేసింది. తర్వాత కొందరి వ్యక్తులతో సన్నిహిత సంబంధాలను ఏర్పరచుకొని విలాస వంతమైన జీవితాన్ని గడిపేది. ఈ క్రమంలోనే ఆమె 2008లో కువైట్‌కు వెళ్లింది. ఇలా రెండు, మూడు సార్లు వెళ్లొచ్చింది. 2013లో ఇండియాకు వచ్చిన ఆమె ఇక తిరిగి కువైట్‌కు వెళ్లలేదు. విలాసవంతమైన జీవితానికి అలవాటు పడిన ఆమె డబ్బు కోసం చాపాడు మండలం, చిన్నగురవలూరుకు చెందిన చంద్రఓబుళరెడ్డితో పరిచయం ఏర్పరచుకుంది. అతని ద్వారా పట్టణంలోని రైస్‌మిల్లు యజమాని కొండయ్యను పరిచయం చేసుకుంది.
బంగారు బిస్కెట్‌లను తక్కువ రేటుకు ఇస్తానని..
కువైట్ నుంచి బంగారు బిస్కెట్‌లను తెప్పించి ఇక్కడి మార్కెట్ రేటు కంటే బిస్కెట్‌ను రూ.20 వేలు తక్కువకు ఇస్తానని ఆమె కొండయ్యతో చెప్పింది. దీంతో ఆశ పడిన కొండయ్య ఆమెకు డబ్బు ఇవ్వడం ప్రారంభించాడు. అయితే ఆమె స్థానికంగానే బంగారు వ్యాపారుల వద్ద స్వచ్ఛత కలిగిన బంగారు బిస్కెట్‌లు కొని కొండయ్యకు ఇస్తూ వచ్చింది. దీంతో అతను విజయను పూర్తిగా నమ్మాడు. ఆ నమ్మకంతోనే కొండయ్య ఆమె అడిగినంత డబ్బు ఇస్తూ వచ్చాడు. తనకు బంగారు ఆభరణాలు ఇస్తే వాటికి బదులుగా అంతే తూకం గల 9999 ముద్రగల 24 క్యారెట్ల బంగారం బిస్కెట్‌లు ఇస్తానని ఆమె నమ్మబలికింది.
అయితే ఆభరణాల బదులు బిస్కెట్‌లు తీసుకుంటే లక్షల్లో లాభం గడించవచ్చని అతను ఆశపడ్డాడు. దీంతో కొండయ్య కొన్ని రోజుల క్రితం 3 కిలోల మేర బంగారు నగలను తనకు తెలిసిన వ్యాపారుల వద్ద కొని ఆమెకు ఇచ్చాడు. ఇలా అతని వద్ద తీసుకున్న బంగారు నగలను మణప్పురం ఫైనాన్స్, ఇండియా ఇన్‌ఫో లైన్ ఫైనాన్స్ లిమిటెడ్ కంపెనీలలో తనఖా పెట్టి డబ్బు తీసుకుంది. ఆ డబ్బుతో అప్పుడప్పుడు ఆమె కొన్ని బంగారు బిస్కెట్‌లను అతనికి ఇస్తూ వచ్చింది.
మిగతా బిస్కెట్‌ల గురించి అతను అడగగా ఎయిర్ పోర్టులో కస్టమ్స్ అధికారులు తనిఖీ చేశారని, కువైట్ నుంచి తన మనుషులు ఇంకా రాలేదని ఇలా పలు కారణాలు చెప్పేది. అనేక సార్లు బిస్కెట్‌లు ఇవ్వకుండా సాకులు చెబుతుండటంతో అతనికి అనుమానం వచ్చింది. ఆమె నుంచి ఎలాంటి సమాధానం రాకపోవడంతో అతను విజయపై ఈ నెల 1న టూ టౌన్ పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశాడు. డబ్బు, బంగారు నగల రూపంలో సుమారు రూ. 2.36 కోట్లు నష్టపోయానని కొండయ్య ఫిర్యాదు చేశాడు.
రంగంలోకి దిగిన పోలీసులు..
కొండయ్య ఫిర్యాదుతో రూరల్ సీఐ ఓబులేసు, ఎస్‌ఐ మంజునాథరెడ్డిలు రంగంలోకి దిగారు. విజయకు ఎవరితో సంబంధాలు ఉన్నాయన్నదానిపై పోలీసులు కూపి లాగారు. ఈ క్రమంలోనే చిన్నగురువలూరుకు చెందిన చంద్ర ఓబుళరెడ్డితో ఆమెకు పరిచయం ఉన్నట్లు దర్యాప్తులో తేలింది. విజయ ఇంటి సమీపంలో నివాసం ఉంటున్న రెడ్డి బాష కూడా ఆమెకు సహకరిస్తుండేవాడు. ఇతనికి ఆమె నెల నెలా జీతం కూడా ఇస్తుండేది. ఆమెకు సమీప బంధువైన రవీంద్రారెడ్డి కూడా ఆమె వ్యవహారాల్లో సంబంధం ఉన్నట్లు తేలింది.
దీంతో ప్రధాన నిందితురాలు విజయతోపాటు ఆమె అనుచరులు చంద్ర ఓబుళరెడ్డి, ప్రొద్దుటూరుకు చరెందిన రెడ్డి బాషా, రవీంద్రారెడ్డిలను బుధవారం నడింపల్లెలోని ఆమె ఇంటి వద్ద అరెస్టు చేశారు. వారి నుంచి రూ.50లక్షలు విలువ చేసే 1761 గ్రాముల బంగారు నగలను స్వాధీనం చేసుకున్నారు. ఈ కేసులో కీలకపాత్ర పోషించిన సీఐ ఓబులేసు, ఎస్‌ఐ మంజునాథరెడ్డి, చాపాడు ఎస్‌ఐ శివశంకర్, సిబ్బందిని అడిషనల్ ఎస్పీ పీవీజీ విజయ్‌కుమార్ అభినందించారు.