నల్లగొండలో కిడ్నీ ‘రాకెట్’? | Kidney Racket in nalgonda | Sakshi
Sakshi News home page

నల్లగొండలో కిడ్నీ ‘రాకెట్’?

Published Tue, Jan 5 2016 3:42 AM | Last Updated on Tue, Aug 21 2018 5:52 PM

నల్లగొండలో కిడ్నీ ‘రాకెట్’? - Sakshi

నల్లగొండలో కిడ్నీ ‘రాకెట్’?

♦ ఇంటర్నెట్ ద్వారా కిడ్నీ అమ్ముకుని ఏజెంట్‌గా మారిన యువకుడు
♦ తనకు పరిచయమున్న వారిని రాకెట్‌లోకి లాగుతున్న వైనం
♦ మహారాష్ట్రలో కిడ్నీల అమ్మకం.. ఒక్కో కిడ్నీకి రూ.5 లక్షలు
♦ ఏజెంట్‌కు రూ.25 వేల అడ్వాన్స్.. రూ.50 వేల కమీషన్
♦ ఖరీదైన వాహనాలు, మొబైల్‌ఫోన్లు కొని జల్సా
♦ పోలీసుల అదుపులో నిందితుడు..?
 
 సాక్షి ప్రతినిధి, నల్లగొండ : ఓ యువకుడికి కిడ్నీ దానం చేసే వాళ్లు కావాలంటూ ఇంటర్నెట్ లో కనిపించిన సమాచారం ఏకంగా కిడ్నీ ‘నెట్‌వర్క్’ ఏర్పాటుకు దారి తీసింది. ఇంటర్నెట్‌లో లభించిన సమాచారం మేరకు కిడ్నీ అమ్ముకునేందుకు వెళ్లిన ఆ యువకుడు ఆ తర్వాత ఏకంగా ఏజెంట్ అవతారమెత్తి కిడ్నీ రాకెట్ సూత్రధారిగా మారాడు. తనకు పరిచయమున్న వారికి డబ్బు ఎరవేస్తూ.. కిడ్నీలను అమ్మిస్తూ సొమ్ము చేసుకునేందుకు అలవాటు పడ్డాడు. యాదృచ్ఛికంగా లభించిన సమాచారాన్ని తొలుత అవసరానికి, ఆ తర్వాత అక్రమ సంపాదనకు వినియోగించుకున్న ఆ యువకుడు ఇప్పుడు నల్లగొండ పోలీ సుల అదుపులో ఉన్నట్లు సమాచారం.

ఆ యువకుడిని రెండు రోజుల క్రితం అదుపులోకి తీసుకుని విచారిస్తున్న నల్లగొండ పోలీసులకు ఈ కిడ్నీ ‘నెట్‌వర్క్’కు సంబంధించిన వాస్తవాలు విచారణలో తెలుస్తున్నాయి. విశ్వసనీయ సమాచారం ప్రకారం.. నల్లగొండ పట్టణంలోని గంధవారిగూడెం రోడ్డులో నివసిస్తున్న ఓ యువకుడు (26) ఎలాంటి ఉద్యోగం లేకుండా తిరుగుతుండేవాడు. నల్లగొండ, హైదరాబాద్‌లో ఉంటూ కాలక్షేపం చేస్తుండేవాడు. ఆరునెలల క్రితం అతను ఓ రోజు ఇంటర్నెట్ చూస్తుండగా, కిడ్నీ దాతలు కావాలనే సమాచారం కనిపించింది.

ఆర్థికంగా ఎలాంటి ఆసరా లేకపోవడంతో కిడ్నీ ఇచ్చి డబ్బులు సంపాదించుకోవాలనే నిర్ణయానికి వచ్చాడు. నెట్‌లో ఉన్న సమాచారం ఫాలో అవుతూ మహారాష్ట్రకు వెళ్లి కిడ్నీ అమ్ముకున్నాడు. కిడ్నీ అమ్ముకోవడం ద్వారా వచ్చిన రూ.5 లక్షలతో ఖరీదైన ద్విచక్ర వాహనం, మొబైల్‌ఫోన్ కొనుక్కుని ఎంజాయ్ చేస్తున్నాడు. ఈ క్రమంలో నల్లగొండ పట్టణానికే చెందిన ఓ సస్పెండైన ప్రభుత్వ ఉద్యోగి అతనికి పరిచయం అయ్యాడు. అత డిని కూడా ఆ యువకుడు కిడ్నీ అమ్ముకునేందుకు ఒప్పించి మహారాష్ట్రకు తీసుకెళ్లి రూ.5 లక్షలు ఇప్పించాడు. ఆ ఉద్యోగి కూడా నల్లగొండకు వచ్చి డబ్బులు జల్సాగా ఖర్చు పెట్టడం మొదలుపెట్టాడు.

అక్కడే కథ రివర్స్ అయింది.  సస్పెండ్ అయిన ఉద్యోగి కూడా ఆ డబ్బుతో జల్సాలు చేస్తుండడంతో అతడి బంధువులకు అనుమానం వచ్చింది. నిలదీయడంతో ఫలానా వ్యక్తి మహారాష్ట్రకు తీసుకెళ్లి తన కిడ్నీ అమ్మించాడని వెల్లడించాడు. దీంతో కోపోద్రిక్తులైన అతని బంధువులు ఆ యువకుడిపై దాడి చేశారు. ఆ నోటా ఈనోటా పోలీసులకు తెలియడంతో వారు ఆ యువకుడిని అదుపులోనికి తీసుకుని విచారించడంతో అసలు కథ బయటకు వచ్చింది.

 మరో నాలుగు రోజులు ?
 రెండు రోజుల క్రితం ఆ యువకుడిని పోలీసులు అదుపులోకి తీసుకోగా, విచారణ పూర్తయ్యే సరికి మరో నాలుగైదు రోజులు పట్టవచ్చని సమాచారం. అయితే  పోలీసుల అదుపులో ఉన్న నిందితుడితోపాటు ఇతర వివరాల గురించి ఆరా తీసినా తమకేమీ తెలియదని, తమ అదుపులో లేరనివారు చెబుతున్నారు. కిడ్నీ రాకెట్ అంశాన్ని వెల్లడించేందుకు స్థానికపోలీసులు నిరాకరిస్తుం డడం గమనార్హం. నిందితుడు వెల్లడిం చిన వివరాల ఆధారంగా మహారాష్ట్రలో ఎక్కడ అమ్ముతున్నారు? అక్కడ ఎవరైనా ఏజెంట్ ఉన్నారా? లేదంటే ఏదైనా ఆస్పత్రికి తీసుకెళుతున్నాడా? అక్కడ ఏదైనా ముఠా పనిచేస్తుందా? అనే కోణం లో పోలీసులు దర్యాప్తు చేస్తున్నట్లు తెలుస్తోంది.
 
 బాధితుడు టు ఏజెంట్
  తొలుత ఆర్థిక అవసరాలం కోసం మహారాష్ట్రకు వెళ్లి వచ్చిన ఆ యువకుడికి ఈ కిడ్నీల వ్యాపారం ద్వారా డబ్బు సంపాదించాలనే ఆలోచన వచ్చింది. వచ్చిందే తడవుగా తనకు పరిచయమున్న వారిని డబ్బు ఆశ చూపెట్టి (ఆర్థిక అవసరాలు, వారి పరిస్థితిని గమనించి) మహారాష్ట్రకు తీసుకెళ్లి కిడ్నీలు అమ్మిస్తున్నాడు. అలా కిడ్నీలు ఇచ్చినందుకు ఒక్కో బాధితుడికి రూ.5 లక్షలు ఇప్పిస్తున్నాడు. కిడ్నీలు అమ్మించినందుకు తొలుత అడ్వాన్స్‌గా రూ,.25 వేలు ఇస్తున్నారని, మొత్తం ఒక్కో కిడ్నీకి రూ.50 వేల కమీషన్ వస్తుందని, అడ్వాన్స్ అందగానే మహారాష్ట్రకు తీసుకెళ్లి కిడ్నీలు ఇప్పిస్తుంటానని సదరు యువకుడు పోలీసుల ముందు వెల్లడించినట్లు తెలుస్తోంది. ఇప్పటివరకు ఇలా 18 మంది వరకు మహారాష్ట్రకు తీసుకెళ్లాడని, అందులో 10 మందివి మాత్రమే కిడ్నీలు అమ్మించాడని, మిగిలిన వారివి పనికిరాలేదని తెలుస్తోంది. ఈ సంఖ్య 30 వరకు ఉండొచ్చని పోలీసులు అనుమానిస్తున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement