చేతకాదని ముక్కునేలకు రాయండి: కిషన్‌రెడ్డి
గజ్వేల్: ఒకేసారి రుణమాఫీ చేయడానికి రూ.8 వేల కోట్లు విడుదల చేయడం తమకు చేతకాదని టీఆర్‌ఎస్ పాలకులు ముక్కునేలకు రాస్తే కేంద్రం వద్ధకు వెళ్లి నిధులిప్పిస్తామని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్‌రెడ్డి పేర్కొన్నారు. మంగళవారం మెదక్ జిల్లా గజ్వేల్‌లో రైతులకు ఏకకాలంలో రుణమాఫీ చేయాలని డిమాండ్ చేస్తూ టీడీపీ రాష్ట్ర రైతు విభాగం అధ్యక్షుడు బూర్గుపల్లి ప్రతాప్‌రెడ్డి చేపట్టిన దీక్షలో ఆయన మాట్లాడుతూ ప్రభుత్వ విధానాలపై తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. మిషన్ కాకతీయ, వాటర్‌గ్రిడ్ లాంటి కాంట్రాక్టు పనులకు ఎలాంటి నిధులకొరత లేదని చెబుతున్న ప్రభుత్వం.. సంక్షేమ కార్యక్రమాలకు మాత్రం డబ్బుల్లేవని చెప్పడంలో ఆంతర్యమేమిటని ప్రశ్నించారు.
హైదరాబాద్‌లో ఆకాశవీధులు నిర్మాణానికి రూ.21 వేలు కేటాయిస్తామని ప్రకటించిన ముఖ్యమంత్రి కేసీఆర్.. ముందుగా రైతుల రక్షణకు చర్యలు చేపట్టాలన్నారు. ఒకేసారి రుణమాఫీ చేసే వరకు తమ పోరు ఆగదని స్పష్టం చేశారు. టీడీపీ అధ్యక్షుడు ఎల్.రమణ మాట్లాడుతూ సీఎం కేసీఆర్ నయా ఫ్యూడలిస్ట్‌గా మారారని మండిపడ్డారు. తెలంగాణ ఆవిర్భావం నుంచి ఆత్మహత్యలకు పాల్పడిన రైతు కుటుంబాలన్నింటీకీ రుణమాఫీ ఒకేసారి అమలు చేసే విషయంలో ఈ నెల 9లోగా ప్రకటన చేయకపోతే తమ ఆందోళనలు ఉధృతం చేస్తామని హెచ్చరించారు. సభలో బీజేపీ శాసనసభా పక్షనేత కె.లక్ష్మణ్, ఎంపీ మల్లారెడ్డి, ఎమ్మెల్యేలు చింతల రాంచంద్రారెడ్డి, వివేక్‌గౌడ్, గాంధీ, గోపీనాథ్, ప్రకాష్‌గౌడ్, జి.సాయన్న, రాజేందర్‌రెడ్డి, ఎమ్మెల్సీ రాంచందర్‌రావు, బీజేపీ, టీడీపీ నేతలు పాల్గొన్నారు.