టూరిజం హబ్‌గా కోటప్పకొండ
సభాపతి కోడెల వెల్లడి
నరసరావుపేట రూరల్: ఎకో టూరిజం, టెంపుల్ టూరిజంను కోటప్పకొండలో ఆభివృద్ధి చేయనున్నట్లు సభాపతి కోడెల శివప్రసాదరావు తెలిపారు. అటవీశాఖ ఉన్నతాధికారులతో కలసి మంగళవారం ఆయన కోటప్పకొండను సందర్మించారు. సీసీఎఫ్ ప్రిన్సిపల్ రమేష్ కల్గాడి, వైల్డ్ లైఫ్ సీసీఎఫ్ రమణారెడ్డి, అడిషనల్ పీసీసీఎఫ్‌లు బిపిన్ చౌదరి, సీకే మిశ్రా, కౌశిక్‌లు సభాపతితో కలసి కోటప్పకొండ ఘూట్‌రోడ్డులోని పర్యాటక కేంద్రాన్ని పరిశీలించారు. ఘాట్ రోడ్డులోని బ్రహ్మ విగ్రహం ముందు భాగాన్ని అభివృద్ధి చేయాలని కోడెల సూచించారు. పర్యావరణ కేంద్రం ఎదురుగా ఉన్న క్యాంటీన్‌ను యోగా సెంటర్‌గా మార్చాలన్నారు. కాళింది బోటు షికారులో నూతన బోట్లు అందుబాటులో ఉంచాలన్నారు. పర్యావరణ కేంద్రాన్ని ఎవరు నిర్వహించాలి, టికెట్ ఎలా విక్రయించాలి తదితర అంశాలపై నిర్ణయం తీసుకోవాలని అధికారులకు సూచించారు. నిధులు కొరత లేదని, దాతల సహకారం తీసుకుంటామని చెప్పారు.
రూ.4.5 కోట్లతో అభివృద్ధి పనులు...
శివరాత్రి నాటికి రూ.4.5 కోట్లతో కోటప్పకొండ అభివృద్ధి చేయనున్నట్లు సభాపతి కోడెల తెలిపారు. రూ.కోటి వ్యయంతో పర్యావరణం పర్యాటక కేంద్రం, రూ.3.5 కోట్లతో ఆలయ అభివృద్ధి చేపడతామన్నారు. కార్యక్రమంలో టాస్క్‌ఫోర్స్ డీఎఫ్‌వో బ్రహ్మయ్య, డీఎఫ్‌వో మోహనరావు, డీసీఎఫ్ వై రమేష్, మార్కెట్ యార్డ్ చైర్మన్ కడియాల రమేష్, బెల్లంకొండ పిచ్చయ్య, ఆలయ కమిటీ సభ్యులు అనుమోలు వెంకయ్య చౌదరి, ఈవో శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు.