కొవ్వూరు డీఎస్పీపై వేటు?
Published Fri, Mar 3 2017 1:53 AM | Last Updated on Fri, May 25 2018 5:52 PM
సాక్షి ప్రతినిధి, ఏలూరు, కొవ్వూరు : కొవ్వూరు డీఎస్పీ నర్రా వెంకటేశ్వరరావుపై వేటు పడింది. ఆయనను డీజీపీ కార్యాలయానికి రిపోర్టు చేయాలని మౌఖికంగా ఆదేశించినట్టు సమాచారం. ఈ మేరకు బుధవారం రాత్రి ఆయనకు సమాచారం అందినట్టు తెలుస్తోంది. ప్రస్తుతం ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్ అమలులో ఉండడంతో బదిలీ అవకాశం లేకపోవడంతో డీఎస్పీని డీజీపి కార్యాలయానికి రిపోర్టు చేయాలని సూచనలు అందినట్టుగా చెబుతున్నారు. ఎన్నికల కోడ్ అమలులో ఉన్న సమయంలో డీఎస్పీని మార్చడంపై పలు అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. స్థానిక ఎమ్మెల్యేతో ఉన్న విభేదాలు, డీఎస్పీ ఉంటే తమ అరాచకాలు సాగవని భావించిన ఇసుక మాఫియా కలిసి డీఎస్పీని సాగనంపినట్టు ప్రచారం జరుగుతోంది. గత ఏడాది టీడీపీ కౌన్సిలర్ పాకా గోపాలకృష్ణ హత్యకు గురైన సమయంలో స్థానిక ఎమ్మెల్యే కేఎస్ జవహర్ డీఎస్పీపై అనుచితమైన వ్యాఖ్యలు చేశారు. పోలీసు వైఫల్యం కారణం గానే కౌన్సిలర్ హత్యకు గురైనట్టు వ్యాఖ్యానించారు. ప్రాణహాని ఉందని చెప్పినా కౌన్సిలర్‌కు రక్షణ కల్పించలేకపోయారని ఎమ్మెల్యే అప్పట్లో ఆరోపించారు. దీనిపై డీఎస్పీ సమాధానం ఇస్తూ కౌన్సిలర్ ప్రాణహాని ఉందని తనను ఎప్పుడు కలవలేదని, కనీసం ఫిర్యాదు చేయలేదని, అలా తప్పుగా మాట్లాడవద్దని డీఎస్పీ గట్టిగానే బదులిచ్చారు. అవసరమైతే తన కార్యాలయంలో సీసీ పుటేజ్‌లు చూపిస్తానని ఎమ్మెల్యేకు బదులిచ్చారు. ఈ విషయాన్ని అప్పట్లో తెలుగుదేశం నాయకులు రాద్ధాంతం చేయడంతో పాటు డీఎస్పీ వాహనానికి అడ్డువెళ్లి ఎమ్మెల్యేకి క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. పట్టణంలో టీడీపీ పేకాట క్లబ్‌కు అనుమతి ఇవ్వాలని కోరితే డీఎస్పీ నిరాకరించినట్టు చెబుతున్నారు. దీంతో అప్పటి నుంచి డీఎస్పీపై గురిపెట్టారు. మునిసిపల్ స్ధలంలో నూతనంగా నిర్మించిన డీఎస్పీ కార్యాలయం విషయంలో కూడా డీఎస్పీని టార్గెట్ చేసినట్టు సమాచారం. ఏడాది కాలం నుంచి దాతల సహాకారంతో ఈ భవన నిర్మాణం పూర్తి చేశారు. ఏడాది కాలం నుంచి పురపాలక సంఘం నుంచి కూడా ఎటువంటి అభ్యంతరాలు వ్యక్తం కాలేదు. ఇప్పుడు నిబంధనలకు విరుద్ధంగా నిర్మాణం చేపట్టారన్న వాదనను తెరపైకి తెచ్చినట్టు సమాచారం.
ఇసుక మాఫియాకు సహకరించనందుకే..!
ఇసుక మాఫియాకు సహకరించడంలేదన్న అక్కసుతో కొందరు టీడీపీ నేతలు డీఎస్పీపై కక్ష పెంచుకున్నారు. ఎమ్మెల్యేలపై స్థానిక నాయకుల వత్తిళ్లు పెరగడంతో డీఎస్పీని టార్గెట్ చేశారు. కొందరు ఎమ్మెల్యేలకు ఇసుక మాఫియా వ్యవహారం ఆదాయవనరుగా మారడంతో డీఎస్పీ బదిలీ కోసం తీవ్రంగా ప్రయత్నాలు చేశారు. దీనిలో భాగంగానే గతంలో నదీతీరంలో ఉన్న నలుగురు ఎమ్మెల్యేలు డీఎస్పీని బదిలీ చేయించాలని జిల్లా ఇన్‌చార్జ్ మంత్రిని, పోలీసు ఉన్నతాధికారులను కోరినట్టు సమాచారం. ఇటీవలకాలంలో మళ్లీ గోదావరి డైరెక్ట్ ర్యాంపుల ఏర్పాటు రంగం చేసుకుంటున్నారు. ర్యాంపుల ఏర్పాటుకు నాయకులు వత్తిడి చేస్తున్నట్టు సమాచారం. ఇసుక మాఫియా అగడాలకు అడ్డుగా ఉన్న డీఎస్పీ బదిలీకి చినబాబుపై తెచ్చిన వత్తిడితో ఈ ఆదేశాలు వచ్చినట్టు సమాచారం. దీనిపై పోలీసు ఉన్నతాధికారులు నోరుమెదపడం లేదు.
Advertisement
Advertisement