ఆందోళనలో ఆయకట్టు రైతులు
ఆందోళనలో ఆయకట్టు రైతులు
Published Wed, Aug 24 2016 10:15 PM | Last Updated on Mon, Oct 1 2018 2:11 PM
హుజూర్‌నగర్/మేళ్లచెర్వు : నాగార్జునసాగర్ ఎడమ కాల్వ పరిధిలో ఆయకట్టుగా ఉన్న నియోజకవర్గంలో రోజు రోజుకు వ్యవసాయరంగ పరిస్థితులు ప్రతికూలంగా మారుతున్నాయి. వరుణుడు ముఖం చాటేసినా, సాగర్ నుంచి నీరు రానప్పటికీ ప్రత్యామ్నాయంగా బోర్లు, బావులు ఏర్పాటు చేసుకొని ఎంతో కొంత వరిసాగు చేద్దామనుకున్న రైతుల ఆశలు అడియాశలుగానే మారుతున్నాయి.
పడిపోయిన భూగర్భ జలాలు
వేలాది రూపాయలు అప్పులు చేసి బావులు, బోర్ల ద్వారా వరిసాగు చేసేందుకు రైతులు సిద్ధమయ్యారు. దీనికి తోడు గత నెలలో అడపాదడపా కురిసిన వర్షాలకు రైతులు కాలం కలిసి వస్తుందనే ఆశతో బోర్లు, బావుల ఆధారంగా వరినార్లు పోశారు. అయితే వరి నాట్లు పెట్టాల్సిన సమయం ఆసన్నమైనా వర్షాలు పడకపోవడం, బోర్లలో నీటి తగ్గిపోవడంతో రైతులు తీవ్ర ఆవేదనలో పడిపోయారు.
15 వేల ఎకరాలు మాత్రమే సాగయ్యే పరిస్థితి
నాగార్జునసాగర్ ఎడమ కాల్వ కింద నియోజకవర్గంలోని 5 మండలాల్లో సాగర్ నీటి ద్వారా సుమారు లక్షా 80 వేల ఎకరాలు సాగవుతుండగా ప్రస్తుతం బోర్లు, బావుల ఆధారంగా 5 మండలాల పరిధిలో సుమారు 30 వేల ఎకరాల్లో వరిసాగు చేసేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. కానీ నీటి లభ్యత సరిగ్గా లేకపోవడంతో నియోజకవర్గ వ్యాప్తంగా సుమారు 15 వేల ఎకరాల్లో మాత్రమే వరినాట్లు వేసే అవకాశం కనిపిస్తుంది. అది కూడా బోర్లు, బావుల నీటితో ఎకరానికి మించి ఎక్కడా కూడా సాగు చేసే పరిస్థితి కనపడడం లేదు. వరినార్లకు, బోర్లు, బావుల ఏర్పాటుకు వేలాది రూపాయలు ఖర్చు చేసిన రైతులు చేసిన అప్పులు ఎలా తీర్చాలో తెలియక అయోమయంలో పడిపోయారు.
మిగతా పంటలదీ అదే పరిస్థితి
మేళ్లచెర్వు మండలంలోని పలు గ్రామాల్లో రైతులు వేసిన పంటలు ఎండుముఖం పట్టాయి. మండలంలో కంది వెయ్యి ఎకరాల,ఉ పెసర 2 వేలు, పత్తి 20 వేలు, మిరప 10 వేల ఎకరాల్లో సాగు చేశారు. కానీ వరుణుడు కరుణించకపోవడంతో పంట చేతికందుతుందా లేదా అని రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. గత సంవత్సరం కూడా వానలు కురువక వేసిన పంటలు చేతికందక అప్పుల పాలయ్యామని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు.
సాగర్ నీటిని విడుదల చేయాలి – భూక్యాపాండునాయక్, మఠంపల్లి
వరిసాగు చేసేందుకు రైతులు ఎన్ని ప్రయత్నాలు చేసినా ఫలితం లేని పరిస్థితి. అప్పులు చేసి బోర్లు, బావులు ఏర్పాటు చేసుకున్నా అప్పులే మిగిలాయి, తప్ప రైతులకు ఎటువంటి ప్రయోజనం లేదు. ఎట్టి పరిస్థితుల్లోనూ సాగర్ నీటిని విడుదల చేసి రైతులను ఆదుకోవాలి.
మూడు ఎకరాల్లో పత్తి సాగు చేశా – మొర్రిమేకల వీర య్య, రైతు, మేళ్లచెర్వు
మూడు ఎకరాల్లో పత్తి సాగు చేశా. ఎకరానికి రూ. 6 నుంచి రూ. 8 వేల వరకు పెట్టుబడి పెట్టాను. నెల రోజులుగా వానలు కురవక పోవడంతో పత్తి వాడిపోయింది. వానలు కురకవకపోతే పంట చేతికి వచ్చే పరిస్థితి లేదు. అఫ్పు తెచ్చి పంట సాగు చేపట్టా అప్పు తీరే మార్గం కనిపించడం లేదు.
ప్రత్యామ్నాయ చర్యలు తీసుకోవాలి – పొనగండ్ల సత్యనారాయణరెడ్డి, వైఎస్సార్‌సీపీ మండల అధ్యక్షుడు
రెండేళ్లుగా వానలు సరిపడా పడకపోవడంతో రైతులు ఇబ్బందులు పడుతున్నారు. ప్రస్తుతం వర్షాలు లేకపోవడంతో పంటలు ఎండిపోతున్నాయి. దీంతో రైతులు అప్పుల పాలవుతున్నారు. ప్రభుత్వం స్పందించి రైతులను ఆదుకునేందుకు ప్రత్యామ్నాయ చర్యలు తీసుకోవాలి.
Advertisement
Advertisement