mellachervu
-
ట్రాన్స్‌కో అధికారుల దాడులు
పీక్లానాయక్‌తండా(మేళ్లచెర్వు): మండలంలోని పీక్లానాయక్‌తండాలో సోమవారం విద్యుత్ అధికారులు ఆకస్మిక దాడులు నిర్వహించారు. అక్రమంగా విద్యుత్ వాడుతున్న 78 మందిపై కేసు నమోదు చేసినట్లు ట్రాన్స్‌కో ఏఈ నాగరాజు తెలిపారు. మీటర్లు లేకుండా బకాయిలు చెల్లించకుండ విద్యుత్ వాడుతున్న వారిపై కేసులు నమోదు చేసినట్లు తెలిపారు. ఎస్సీ,ఎస్టీలకు 50 యూనిట్ల మేరకు ఉచితంగా వాడుకోవచ్చు అని తెలిపారు. ఇట్టి అవకాశాన్ని గిరిజనులు సద్వినియోగం చేసుకోవాలన్నారు. ఇక మీదట ఎటువంటి అనుమతులు లేకుండా విద్యుత్ వాడుకుంటే కఠిన చర్యలు తీసుకుంటామన్నారు. దాడుల్లో కోదాడ,చిలుకూరు ఏఈలు ,విద్యుత్ సిబ్బంది పాల్గొన్నారు. -
టీఎమ్మార్పీఎస్ సభను జయప్రదం చేయాలి
మేళ్లచెరువు : ఈ నెల 6న నల్లగొండలో జరిగే టీఎమ్మార్పీఎస్ జిల్లా సదస్సును జయప్రదం చేయాలని ఆ సంఘం జిల్లా ఇన్చార్జి చింతబాబు మాదిగ పిలుపునిచ్చారు. ఆదివారం మండలకేంద్రంలో ఏర్పాటు చేసిన ఆ సంఘం కార్యకర్తల సమావేశంలో ఆయన మాట్లాడారు. మాదిగల చైతన్య పాదయాత్రలో భాగంగా చెప్పులుకుట్టే వారికి, డబ్బుకొట్టే వారికి నెలకు రూ.2వేల పింఛన్ అందజేయాలని డిమాండ్ చేశారు. అన్ని కుల వృత్తులకు పింఛన్ ఇస్తూ దళితులపై వివక్ష చూపుతూ పాలకులు పబ్బం గడుపుకుంటున్నారని విమర్శించారు. మాదిగలకు పింఛన్ల సాధనకు నవంబర్ 19న హైదరాబాద్‌లో నిర్వహించే జైత్రయాత్ర మహాసభకు అధికసంఖ్యలో తరలిరావాలని కోరారు. ఈ సమావేశంలో ఆ సంఘం మండల అధ్యక్షుడు చడపంగు సైదులు, జిల్లా ప్రచార కార్యదర్శి కృష్ణబాబు, ఆర్.కుటుంబరావు, వీహెచ్పీఎస్ మండల అధ్యక్షుడు కొమ్ము రామయ్య, దేవయ్యమాదిగ, కరుణాకర్, కోటయ్య, సురేష్, దావీదు, సాయిబాబు, శ్రీనివాస్, విజయభాస్కర్ తదితరులు పాల్గొన్నారు. -
ఉరేసుకుని వ్యక్తి ఆత్మహత్య
మేళ్లచెర్వు: ఉరేసుకుని ఓ వ్యక్తి బలవన్మరణానికి పాల్పడ్డాడు. ఈ ఘటన మేళ్లచెరువులో బుధవారం చోటు చేసుకుంది. ఎస్ఐ .రవికుమార్ తెలిపిన వివరాల ప్రకారం.. మండలకేంద్రానికి చెందిన కాకునూరి శ్రీనివాసరెడ్డి(50) స్థానిక మండలపరిషత్ కార్యాలయంలో అటెండర్‌గా విధులు నిర్వహిస్తున్నాడు. కొన్ని సంవత్సరాలుగా భార్యతో గొడవలు వచ్చి విడిగా ఉంటున్నారు. దీంతో శ్రీనివాసరెడ్డి మరో మహిళతో సహజీవనం చేస్తున్నాడు. మూడు నెలల క్రితం ఆమె కూడా వెళ్లి పోవడంతో అసహనానికి గురై తన ఇంట్లో ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. మృతుడి కుమారుడు కోటిరెడ్డి ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ తెలిపారు. -
సమస్యల పరిష్కారంలో విఫలం
రేబల్లె(మేళ్లచెర్వు) : పులిచింతల మనక గ్రామాల్లో పెండింగ్‌లో ఉన్న నిర్వాసితుల సమస్యలు పరిష్కరించడంలో టీఆర్ఎస్ ప్రభుత్వం విఫలమైందని ఎమ్మెల్యే, టీపీసీసీ అధ్యక్షుడు ఎన్.ఉత్తమ్‌కుమార్‌రెడ్డి ఆరోపించారు. ఆయన మంగళవారం మండలంలోని రేబల్లె గ్రామాన్ని సందర్శించి అక్కడ ప్రజల సమస్యలను అడిగి తెలుసుకున్నారు. అనంతరం గ్రామస్తులతో ఏర్పాటు చేసిన సమావేశంలో మాట్లాడారు. పులిచింతల ముంపు గ్రామాల వారికి పునరావాసం కల్పించేందుకు రూ. 565 కోట్లు ప్రకటించిందన్నారు. వాటిలో కాంగ్రెస్ ప్రభుత్వం పాలనలో 460 కోట్లకు పైగా ఇప్పించినట్లు పేర్కొన్నారు. మిగిలి ఉన్న వంద కోట్ల రూపాయలు ఇప్పించడానికి టీఆర్ఎస్ ప్రభుత్వానికి 27 నెలల కాలం గడిచినా కూడా ఇప్పించలేక పోయారన్నారు. తమ్మవరంలో 55 కుటుంబాలకు, రేబల్లెలో 400 కుటుంబాలకు ఇళ్ల స్థలాలు ఇవ్వాలని కలెక్టర్‌కు ఫోన్ ద్వారా విన్నవించారు. పులిచింతల మునక ప్రజలకు రావాల్సిన ప్యాకేజీ, ఇళ్ల స్థలాలు, నష్టపరిహారం అందించే వరకూ వారి తరపున పోరాడతామన్నారు. ఈ సమావేశంలో కాకునూరి భాస్కర్‌రెడ్డి, కర్నె ప్రతాపరెడ్డి, నాగిరెడ్డి, మోర్తాల వెంకటరెడ్డి, జె.గురవయ్య యాదవ్, జాలాది వెంకటేశ్వర్లు, వెంకటేశ్వరెడ్డి, జక్కుల శంభయ్య, రామచంద్రయ్య, శ్రీనివాసరెడ్డి, వెంకటరెడ్డి, రామకృష్ణారెడ్డి తదితరులు పాల్గొన్నారు. -
పులిచింతలకు కొనసాగుతున్న వరద
పులిచింతల ప్రాజెక్టు(మేళ్లచెర్వు): రెండు రోజులుగా కురుస్తున్న వానలతో పాటు మూసీ నది నుంచి నీటితో మండలంలోని పులిచింతల ప్రాజెక్ట్‌కు వరద ఉధృతి కొనసాగుతోంది. దీంతో ప్రాజెక్టులో 30 టీఎంసీల నీటిని నిల్వ చేసి, ఆ పైన వస్తున్న నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. శుక్రవారం 1.60 లక్షల క్యూసెక్కుల వరద వస్తుండడంతో అంతే మెుత్తంలో నీటిని నాలుగు గేట్లు ఎత్తి విడుదల చేస్తున్నారు. భారీగా పెరిగిన సందర్శకులు మండలంలోని పులిచింతల ప్రాజెక్టులో భారీగా వరద నీరు చేరడంతో పాటు దిగువకు నీటిని విడుదల చేస్తుండండతో శుక్రవారం సందర్శకులు భారీగా తరలివచ్చారు. మండలంలోని చుట్టుప్రక్కల గ్రామాలతో పాటు కృష్ణా, గుంటూరు, ఖమ్మం జిల్లాల నుంచి ప్రజలు ఇక్కడికి వచ్చారు. -
పులిచింతలలో నీటి నిల్వకు సహకరించాలి
మేళ్లచెర్వు : మండలంలోని పులిచింతల ప్రాజెక్టులో నీటి నిల్వకు నిర్వాసితులు సహకరించాలని ఏపీ నీటి పారుదల శాఖ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు కోరారు. ఆయన బుధవారం నల్లగొండ జిల్లా మేళ్లచెర్వు మండలంలోని పులిచింతల ప్రాజెక్టును పరిశీలించారు. అనంతరం మంత్రి మాట్లాడుతూ ప్రాజెక్టులో 30 టీఎంసీల వరకు నీటిని నిల్వ చేయనున్నట్లు దానికి గుంటూరు,నల్లగొండ జిల్లాల్లోని ప్రజలు సహకరించాలన్నారు. వరద పరిస్థితిని ఎప్పటికప్పుడు పర్యవేక్షించాలని అధికారులను ఆదేశించారు. ఏపీ, తెలంగాణ రాష్ట్రాల ప్రజలకు నీటి పంపకంలో సమన్యాయం పాటించనున్నట్లు చెప్పారు. ఆయన వెంట జగ్గయ్యపేట ఎమ్మెల్యే శ్రీరాం తాతయ్య, వెంకటేశ్వరరావు, సీఈ సుధాకర్, ఎస్ఈ వెంకటరమణ తదితరులున్నారు. -
ఆందోళనలో ఆయకట్టు రైతులు
హుజూర్నగర్/మేళ్లచెర్వు : నాగార్జునసాగర్ ఎడమ కాల్వ పరిధిలో ఆయకట్టుగా ఉన్న నియోజకవర్గంలో రోజు రోజుకు వ్యవసాయరంగ పరిస్థితులు ప్రతికూలంగా మారుతున్నాయి. వరుణుడు ముఖం చాటేసినా, సాగర్ నుంచి నీరు రానప్పటికీ ప్రత్యామ్నాయంగా బోర్లు, బావులు ఏర్పాటు చేసుకొని ఎంతో కొంత వరిసాగు చేద్దామనుకున్న రైతుల ఆశలు అడియాశలుగానే మారుతున్నాయి. పడిపోయిన భూగర్భ జలాలు వేలాది రూపాయలు అప్పులు చేసి బావులు, బోర్ల ద్వారా వరిసాగు చేసేందుకు రైతులు సిద్ధమయ్యారు. దీనికి తోడు గత నెలలో అడపాదడపా కురిసిన వర్షాలకు రైతులు కాలం కలిసి వస్తుందనే ఆశతో బోర్లు, బావుల ఆధారంగా వరినార్లు పోశారు. అయితే వరి నాట్లు పెట్టాల్సిన సమయం ఆసన్నమైనా వర్షాలు పడకపోవడం, బోర్లలో నీటి తగ్గిపోవడంతో రైతులు తీవ్ర ఆవేదనలో పడిపోయారు. 15 వేల ఎకరాలు మాత్రమే సాగయ్యే పరిస్థితి నాగార్జునసాగర్ ఎడమ కాల్వ కింద నియోజకవర్గంలోని 5 మండలాల్లో సాగర్ నీటి ద్వారా సుమారు లక్షా 80 వేల ఎకరాలు సాగవుతుండగా ప్రస్తుతం బోర్లు, బావుల ఆధారంగా 5 మండలాల పరిధిలో సుమారు 30 వేల ఎకరాల్లో వరిసాగు చేసేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. కానీ నీటి లభ్యత సరిగ్గా లేకపోవడంతో నియోజకవర్గ వ్యాప్తంగా సుమారు 15 వేల ఎకరాల్లో మాత్రమే వరినాట్లు వేసే అవకాశం కనిపిస్తుంది. అది కూడా బోర్లు, బావుల నీటితో ఎకరానికి మించి ఎక్కడా కూడా సాగు చేసే పరిస్థితి కనపడడం లేదు. వరినార్లకు, బోర్లు, బావుల ఏర్పాటుకు వేలాది రూపాయలు ఖర్చు చేసిన రైతులు చేసిన అప్పులు ఎలా తీర్చాలో తెలియక అయోమయంలో పడిపోయారు. మిగతా పంటలదీ అదే పరిస్థితి మేళ్లచెర్వు మండలంలోని పలు గ్రామాల్లో రైతులు వేసిన పంటలు ఎండుముఖం పట్టాయి. మండలంలో కంది వెయ్యి ఎకరాల,ఉ పెసర 2 వేలు, పత్తి 20 వేలు, మిరప 10 వేల ఎకరాల్లో సాగు చేశారు. కానీ వరుణుడు కరుణించకపోవడంతో పంట చేతికందుతుందా లేదా అని రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. గత సంవత్సరం కూడా వానలు కురువక వేసిన పంటలు చేతికందక అప్పుల పాలయ్యామని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. సాగర్ నీటిని విడుదల చేయాలి – భూక్యాపాండునాయక్, మఠంపల్లి వరిసాగు చేసేందుకు రైతులు ఎన్ని ప్రయత్నాలు చేసినా ఫలితం లేని పరిస్థితి. అప్పులు చేసి బోర్లు, బావులు ఏర్పాటు చేసుకున్నా అప్పులే మిగిలాయి, తప్ప రైతులకు ఎటువంటి ప్రయోజనం లేదు. ఎట్టి పరిస్థితుల్లోనూ సాగర్ నీటిని విడుదల చేసి రైతులను ఆదుకోవాలి. మూడు ఎకరాల్లో పత్తి సాగు చేశా – మొర్రిమేకల వీర య్య, రైతు, మేళ్లచెర్వు మూడు ఎకరాల్లో పత్తి సాగు చేశా. ఎకరానికి రూ. 6 నుంచి రూ. 8 వేల వరకు పెట్టుబడి పెట్టాను. నెల రోజులుగా వానలు కురవక పోవడంతో పత్తి వాడిపోయింది. వానలు కురకవకపోతే పంట చేతికి వచ్చే పరిస్థితి లేదు. అఫ్పు తెచ్చి పంట సాగు చేపట్టా అప్పు తీరే మార్గం కనిపించడం లేదు. ప్రత్యామ్నాయ చర్యలు తీసుకోవాలి – పొనగండ్ల సత్యనారాయణరెడ్డి, వైఎస్సార్సీపీ మండల అధ్యక్షుడు రెండేళ్లుగా వానలు సరిపడా పడకపోవడంతో రైతులు ఇబ్బందులు పడుతున్నారు. ప్రస్తుతం వర్షాలు లేకపోవడంతో పంటలు ఎండిపోతున్నాయి. దీంతో రైతులు అప్పుల పాలవుతున్నారు. ప్రభుత్వం స్పందించి రైతులను ఆదుకునేందుకు ప్రత్యామ్నాయ చర్యలు తీసుకోవాలి. -
విద్యుత్ పవర్ ప్లాంట్‌ను పరిశీలించిన జెన్కో సీఎండీ
మేళ్లచెర్వు : మండలంలోని వజినేపల్లి సమీపంలోని పులిచింతల ప్రాజెక్టు వద్ద ఏర్పాటు చేస్తున్న 120 మెగావాట్ల విద్యుత్ ప్లాంట్‌ను జెన్కో చైర్మన్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్ ప్రభాకర్‌రావు మంగళవారం పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన విలేకరులతో మాట్లాడుతూ పులిచింతల వద్ద ఏర్పాటు చేస్తున్న విద్యుత్ ప్రాజెక్టులో మొత్తం నాలుగు యూనిట్లకు గాను మొదటి యూనిట్‌ను నెల రోజుల్లో ప్రారంభించి 30 మెగావాట్ల విద్యుత్‌ను ఉత్పత్తి చేయనున్నట్లు తెలిపారు. సెప్టెంబర్ చివరి నాటికి రెండవ యూనిట్, 2017 ఫిబ్రవరి చివరి నాటికి మూడు, నాలుగు యూనిట్లను ప్రారంభించి 120 యూనిట్ల మెగావాట్ల విద్యుత్‌ను ఉత్పత్తి చేయనున్నట్లు తెలిపారు. వీటితో పాటు భద్రాద్రి పవర్ ప్రాజెక్టు ద్వారా1080 మెగావాట్లు, యాదాద్రి ప్రాజెక్టు ద్వారా 400 మెగా వాట్ల విద్యుత్ ప్లాంట్ల నిర్మాణాలు చేపట్టినట్లు తెలిపారు. ప్రస్తుతం 7600 మెగావాట్ల విద్యుత్తును ఉత్పత్తి చేస్తున్నట్లు పేర్కొన్నారు. అక్టోబరు నాటికి 9వేల మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి చేయనున్నట్లు తెలిపారు. అంతకుముందు అక్కడ జరుగుతున్న పనుల తీరుపై అధికారులు, కాంట్రాక్టర్లతో సమావేశం నిర్వహించారు. ఆయన వెంట హైడల్ డైరెక్టర్ వెంకటరాజన్, ఎస్ఈ లు శ్రీనివారెడ్డి, సద్గుణ కుమార్, ఈఈ ఆశోక్‌కుమార్, డీఈలు నాగిరెడ్డి రవి,టి.నర్సింహారావు తదితరులున్నారు. -
నీటిపారుదల పథకాల అభివృద్ధికి కృషి
వెల్లటూరు(మేళ్లచెర్వు) : నియోజకవర్గంలో నీటి పారుదల పథకాల అభివృద్ధికి తన వంతు కృషి చేసినట్లు స్థానిక ఎమ్మెల్యే, టీపీసీసీ అధ్యక్షుడు ఎన్.ఉత్తమ్‌కుమార్‌రెడ్డి తెలిపారు. సోమవారం 99 కోట్ల రూపాయలతో నిర్మించిన మండలంలోని వెల్లటూరు ఎత్తిపోతల పథకాన్ని పరిశీలించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ నియోజకవర్గంలో సుమారు 20 వేల ఎకరాలకు నీరందించేందుకు వెల్లటూరు, మఠంపల్లి మండలంలోని అమరవరం ఎత్తిపోతల పథకాల ఏర్పాటుకు కృషి చేసినట్లు తెలిపారు. అంతకుముందు మండలకేంద్రంలో యువజన కాంగ్రెస్ కార్యకర్తలు ఆయనకు బైక్ ర్యాలీతో స్వాగతం పలికారు. కార్యక్రమంలో లక్ష్మీనారాయణరెడ్డి, జెడ్పీటీసీ కర్నె వెంకటలక్ష్మీ, ప్రతాపరెడ్డి, మన్సారలీ, యరగాని నాగన్నగౌడ్, నియోజకవర్గ యూత్‌కాంగ్రెస్ అధ్యక్షుడు సుంకర శివరాం యాదవ్, జక్కుల మల్లయ్య, ఐల వెంకన్న, బాణోతు బాబు, మైల నాగిరెడ్డి, మోర్తాల వెంకటరెడ్డి, లిప్టు చైర్మన్ సీతరాంరెడ్డి, అణివిరెడ్డి, గోనె అంకయ్య,నారాయణరెడ్డి, అమరబోయిన శ్రీనివాస్‌యాదవ్, సాధం గంగయ్య, నారాయణరెడ్డి తదితరులు పాల్గొన్నారు. -
ధ్వజస్తంభ ప్రతిష్ఠోత్సవంలో పాల్గొన్న భట్టివిక్రమార్క
శ్రీ లక్ష్మీనర్సింహస్వామి దేవాలయంలో ఆదివారం నిర్వహించిన ధ్వజస్తంభ ప్రతిష్ఠోత్సవానికి టీ పీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ మల్లు భట్టి విక్రమార్క హాజరయ్యారు. ఈ సందర్భంగా ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం గ్రామం వద్ద ఏర్పాటు చేసిన పుష్కర ఘాట్లను పరిశీలించారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ పార్టీ నాయకులు ఆయనకు స్వాగతం పలికారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ నాగలక్ష్మి, మండల పార్టీ అధ్యక్షుడు కాకునూరి భాస్కర్‌రెడ్డి, ప్రతాపరెడ్డి, దేవిరెడ్డి లక్ష్మారెడ్డి పాల్గొన్నారు. -
మేళ్లచెరువులో డ్వామా పీడీ..
మేళ్లచెర్వు: మండలంలోని బుగ్గమాధవరం,వజినేపల్లి పుష్కర ఘాట్లను శనివారం పుష్కరఘాట్లను డ్వామా పీడీ దామోదర్‌రెడ్డి, సూర్యాపేట ఆర్డీఓ నారాయణరెడ్డి పరిశీలించారు. ఈ సందర్భంగా వారు ఘాట్ల వద్ద పనుల తీరు, ఏర్పాట్లు, భక్తులకు కల్పిస్తున్న సౌకర్యాలను పరిశీలించారు. వారి వెంట తహసీల్దార్ శ్రీదేవి, ఆర్ఐ వీరయ్య, ఐబీ ఈఈ సంజీవరెడ్డి, డీఈ స్వామి ఉన్నారు. -
పుష్కరఘాట్లను పరిశీలించిన ఆర్డీఓ
బుగ్గమాధవరం (మేళ్లచెర్వు): మండలంలోని బుగ్గమాధవరం, వజినేపల్లి గ్రామాల వద్ద ఏర్పాటు చేస్తున్న పుష్కరఘాట్లను మంగళవారం సూర్యాపేట ఆర్డీఓ నారాయణరెడ్డి పరిశీలించారు. ఈ సందర్భంగా అక్కడ చేపడుతున్న విద్యుత్, మరుగుదొడ్లు, తాగునీరు వంటి సౌకర్యాలను పరిశీలించారు. ఆయన వెంట ఎంపీపీ భూక్యా ఝామా చోక్లానాయక్, తహసీల్దార్ శ్రీదేవి, సీఐ మధుసూదన్‌రెడ్డి, ఎస్ఐ.రవికుమార్ పాల్గొన్నారు. -
పుష్కర ఘాట్‌ను పరిశీలించిన ఆర్డీఓ
కిష్టాపురం (మేళ్లచెర్వు): మండలంలోని కిష్టాపురం వద్ద నిర్మిస్తున్న పుష్కరఘాట్ పనులను సోమవారం సూర్యాపేట ఆర్డీఓ నారాయణరెడ్డి పరిశీలించారు. ఈ సందర్భంగా భక్తులకు తాగునీరు, మరుగుదొడ్లు, పార్కింగ్ వంటి సౌకర్యాల గురించి అధికారులను అడిగి తెలుసుకున్నారు. ఆయన వెంట ఇన్చార్జి తహసీల్దార్ శ్రీదేవి, ఐబీ డీఈ స్వామి, ఏఈఈ పిచ్చయ్య, పాండునాయక్, ఆర్ఐ వీరయ్య, జిలానీ ఉన్నారు. -
మేళ్లచెర్వులో సర్వసభ్య సమావేశం
మేళ్లచెర్వు: స్థానిక ఎంపీడీఓ కార్యాలయంలో గురువారం ఎంపీపీ భూక్యా ఝామా చోక్లానాయక్ అధ్యక్షతన మండల సర్వసభ్య మావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా మేళ్లచెర్వును కరువు మండలంగా ప్రకటించాలని ఎంపీటీసీ, సర్పంచ్‌లు ఏకగ్రీవంగా తీర్మానించారు. గ్రామాల్లో మంచినీటి సమస్య, ఆసరా పింఛన్లు, కరువు ప్రభావంతో పశుగ్రాసం, దాణా, దొండపాడు ఉన్నత పాఠశాలలో మధ్యాహ్న భోజన ఏజెన్సీ వివాదం, తాగు నీటి సమస్య, మరుగుదొడ్లు బిల్లులు, ఉపాధి పనులు, అంగన్వాడీ కేంద్రాల్లో సమస్యలను ప్రజాప్రతినిధులు అధికారుల దృష్టికి తీసుకొచ్చారు. ఈ సమావేశానికి ఎంపీడీఓ శాంతకుమారి, డిప్యూటీ తహసీల్దార్ సంధ్యారాణి, మండల ఉపాధ్యక్షుడు మధిర సత్యనారాయణరెడ్డి, ఎంఈఓ సైదానాయక్, వ్యవసాయాధికారి శ్రీనివాస్‌గౌడ్, ట్రాన్స్‌కో ఏఈ నాగరాజు, పీఆర్ ఏఈ కోక్యానాయక్, ఐకేపీ ఏపీఎం లక్ష్మీ, పశువైధ్యాధికారి డాక్టర్ శ్రీనివాస్‌రెడ్డి, ఆర్డబ్లూ్య ఏఈఈ వెంకన్న, ఎంపీటీసీలు కొండా వెంకటేశ్వర్లు, వీరకుమార్, పుష్పావతి, గోపిశెట్టి లక్ష్మమ్మ, గుండెబోయిన వెంకటేశ్వర్లు, శ్రీనివాస్‌యాదవ్, సర్పంచ్‌లు కొట్టె సైదేశ్వరరావు, రుక్కయ్యయాదవ్, దేశాల పద్మ, గోనె లక్ష్మీ, బిక్రి, భూక్యా సైదమ్మ పాల్గొన్నారు. -
రోడ్డు ప్రమాదంలో గాయపడిన వ్యక్తి మృతి
మేళ్లచెర్వు: రోడ్డు ప్రమాదంలో గాయపడిన వ్యక్తి మృతిచెందాడు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. మండలంలోని రేవూరు గ్రామానికి చెందిన బొగ్గవరపు సైదయ్య(40)బైక్ 17వ తేదీన పని నిమిత్తం కోదాడకు వెళ్లాడు. రాత్రి సమయంలో స్వగ్రామానికి వెళుతుండగా మండలకేంద్రం శివారు లోని పెట్రోల్ బంక్ సమీపంలో ఎదరుగా వస్తున్న మరో బైక్ ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన సైదయ్యను తొలుత కోదాడ అక్కడి నుంచి హైదరాబాద్‌లోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో చేర్పించగా చిక్తిత్స పొందుతూ సోమవారం రాత్రి మృతిచెందాడు. మృతదేహానికి మంగళవారం ఆస్పత్రిలో పోస్టుమార్టం నిర్వహించి కుటుంబ సభ్యలకు అప్పగించినట్లు పోలీసులు తెలిపారు. మృతుడి బంధువుల పిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ రవికుమార్ తెలిపారు. -
మేళ్లచెర్వులో హోం మంత్రి ఏరియల్ సర్వే
బుగ్గమాధవరం (మేళ్లచెర్వు) : మండలంలోని బుగ్గమాధవరం, వజినేపల్లి, కిష్టాపురం వద్ద నిర్మిస్తున్న పుష్కర ఘాట్లను రాష్ట్ర హోం శాఖ మంత్రి నాయిని నర్సింహారెడ్డి, విద్యుత్ శాఖ మంత్రి గుంటకండ్ల జగదీశ్‌రెడ్డి మంగళవారం హెలికాప్టర్ ద్వారా ఏరియల్ సర్వే నిర్వహించారు. ఘాట్ల ఏర్పాట్లును పరిశీలించారు. వారి వెంట డీజీపీ అనురాగ్ శర్మ, ఐజీ నాగిరెడ్డి ఉన్నారు. కాగా, ఘాట్ల వద్ద భద్రతా ఏర్పాట్లను సీఐ మధుసూదన్‌రెడ్డి, ఎస్ఐ.రవికుమార్ పర్యవేక్షించారు. -
వైభవంగా గంగమ్మ జాతర
మేళ్లచెర్వు: మండల కేంద్రంలో ఆదివారం నిర్వహించిన గంగమ్మ జాతరను ప్రజలు ఘనంగా జరుపుకున్నారు. ఈ సందర్భంగా గంగమ్మ ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా గ్రామానికి చెందిన మహిళలు మంద గంపలు, బోనాలు ఎత్తుకోని మేళతాళాలు, డప్పు వాయిద్యాలతో ఊరేగింపుగా ఆలయం వద్దకు చేరుకొని శ్రీ ఇష్టకామేశ్వరీ సమేత శ్రీ స్వయంభు శంభులింగేశ్వర స్వామి, గంగమ్మ ఆలయాల చుట్టూ ప్రదక్షిణలు చేసి అమ్మవారికి పాలు పొంగళ్లు, బొనాలతో మెుక్కలు సమర్పించుకున్నారు. అనంతరం పోతురాజు వద్ద యాట పోతులను, కోడిపుంజులను బలిచ్చారు. కార్యక్రమంలో ఎంపీటీసీ గోపిశెట్టి లక్ష్మమ్మ, తిరుపతి వెంకయ్య, మాజీ ఎంపీటీసీ జనిగ సైదులు యాదవ్, వెంకటేశ్వర్లు, బసవయ్య, శ్రీను, గజ్జల శంకర్‌రెడ్డి, కొండారెడ్డి, బాల వెంకటరెడ్డి, కాకునూరి వెంకటరెడ్డి, సైదులు, కృష్ణయ్య, చంద్రయ్య, లింగయ్య, శంభయ్య, వీరయ్య, బక్కయ్య, కె.వెంకటేశ్వర్లు, ఎం.రాంబాబు, సోమయ్య, నర్సింహారావులు పాల్గొన్నారు. -
తండ్రితో పాటు పక్కింటి వ్యక్తిని హతమార్చాడు
చిత్తూరు : చిత్తూరు జిల్లా పీలేరు మండలం మేళ్లచెర్వులో దారుణం జరిగింది. భూ తగాదాలు ఇద్దరి ప్రాణాలు తీశాయి. పున్నామ నరకం నుంచి కాపాడాల్సిన ఆ తనయుడు క్షణికావేశానికి లోనై కన్నతండ్రినే హతమార్చాడు. శనివారం ఉదయం ఈ సంఘటన చోటుచేసుకుంది. స్థానికంగా నివాసం ఉంటున్న కేశవరెడ్డికి... కొడుకు విశ్వనాథ్ రెడ్డికి గత కొంతకాలంగా భూమి విషయంలో గొడవలు జరుగుతున్నాయి. ఈ రోజు ఉదయం అదికాస్తా తారాస్థాయికి చేరటంతో విశ్వనాథ్ రెడ్డి ...తండ్రిపై దాడి చేయటంతో అతను తీవ్రంగా గాయపడి మృతి చెందాడు. ఈ విషయాన్ని గమనించిన కృష్ణయ్య అనే వ్యక్తి ప్రశ్నించటంతో కోపం పట్టలేని విశ్వనాథ్ రెడ్డి ...అతడిపై కూడా దాడి చేయటంతో అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. దాంతో చుట్టుపక్కలవారు....విశ్వనాథ్‌రెడ్డిని బంధించి తీవ్రంగా కొట్టారు. ఈ ఘటనలో తీవ్రంగా గాయపడిన అతడికి చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని, విచారణ జరుపుతున్నారు.