ప్రతిభ ఉంటే పతకాలే..
ప్రతిభ ఉంటే పతకాలే..
Published Fri, Feb 24 2017 10:24 PM | Last Updated on Mon, Oct 1 2018 6:33 PM
జేఎన్‌టీయూకేలో క్రియ ఉత్సవాలు
నేటి నుంచి ప్రారంభం
హాజరుకానున్న పాఠశాలల చిన్నారులు
కాకినాడ కల్చరల్ / బాలాజీచెరువు (కాకినాడ) : క్రియ పిల్లల పండుగ పేరుతో క్రియ స్వచ్ఛంద సేవాసంస్థ నిర్వహిస్తున్న వేడుకలకు జేఎన్‌టీయూకే ముస్తాబైంది. శని, ఆదివారాల్లో జరిగే ఈ పోటీల్లో నృత్యం, క్విజ్, డిబేట్, చిత్రలేఖనం, వేషధారణ తదితర 25 రకాల అంశాల్లో పోటీలు నిర్వహించనున్నారు. గ్రామ, మండల, జిల్లాస్థాయిలో ప్రతిభ చూపిన వారికి ఈ పోటీల్లో అవకాశం కల్పించారు. ఒకటి నుంచి ఐదో తరగతి వరకూ సబ్ జూనియర్స్‌గా, 6, 7 తరగతులను జూనియర్స్‌గా, 8, 9, 10 తరగతులను సీనియర్స్‌గా విభజించి జానపద, లఘు నాటికలు, శాస్త్రీయ నృత్యాలు, స్పెల్లింగ్, క్విజ్ పోటీలు, సినిమా పాటలకు నృత్యాలు నిర్వహిస్తారు. మొదటి మూడు స్థానాల్లో నిలిచిన వారికి బహుమతులు అందిస్తారు. దూర ప్రాంతాల నుంచి వచ్చే విద్యార్థులు, వారి తల్లిదండ్రులు, ఉపాధ్యాయులకు భోజనం, వసతి ఏర్పాట్లు చేశారు. ఎటువంటి లాభాపేక్ష లేకుండా కేవలం చిన్నారుల్లో ప్రతిభను వెలికితీయడానికి కొందరు క్రియ స్వచ్ఛంద సంస్థగా ఏర్పడి ఈ పండుగ నిర్వహిస్తున్నారు. దీనిలో వలంటీర్లుగా పనిచేయడానికి చాలామంది సుముఖత వ్యక్తం చేస్తున్నారు. ఉత్సవాలను శనివారం జేఎన్‌టీయూకే ఉపకులపతి వీఎస్‌ఎస్‌కుమార్‌తో పాటు జిల్లా విద్యాశాఖాధికారులు, ప్రజాప్రతినిధులు ప్రారంభించనున్నారు. ఆదివారం సాయంత్రం నిర్వహించే ముగింపు కార్యక్రమంలో విజేతలకు ప్రముఖులు బహుమతులు అందిస్తారు.
2002లో ‘క్రియ’ ఏర్పాటు
కాకినాడ కల్చరల్: 2002లో తిమ్మాపురం(కాకినాడ రూరల్)లో ఆరుగురు యువకులు క్రియ ఫౌండేషన్ ఏర్పాటు చేశారు. ముందుగా ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులకు జనరల్ నాలెడ్జ్‌పై పోటీ పరీక్షలు నిర్వహించి బహుమతులు అందజేశారు. 2013లో పీఆర్ ప్రభుత్వ కళాశాలలో రెండు రోజలు నిర్వహించిన పిల్లల పండుగకు స్పందన లభించింది. 2014లో కూడా పిల్లల పండుగను జేఎన్‌టీయూకేలో నిర్వహించారు. 2016లో జేఎన్‌టీయూకేలో పదివేలమంది పిల్లలతో కార్యక్రమం జరిపారు. నేడు ఈ సంస్థ రాష్ట్రస్థాయిలో అంతర పాఠశాలల పోటీలు నిర్వహించే స్థాయికి ఎదిగింది. ప్రతిభ కలిగిన పేద విద్యార్థులకు స్కాలర్‌షిప్‌లు కూడా ఈ సంస్థ అందజేస్తోంది. శని, ఆదివారాల్లో జేఎన్‌టీయూకే ప్రాంగణంలో 12 వేల మంది విద్యార్థులతో సాంస్కృతిక పోటీలు నిర్వహిస్తోంది. ముఖ్యఅతిథులుగా లోక్‌సత్తా పార్టీ జాతీయ నాయకుడు జయప్రకాష్ నారాయణ, ఏపీపీఎసీ కమిషనర్ కె.ఉదయభాస్కర్ హజరవుతారు.
పేద విద్యార్థులకు ప్రోత్సాహం
క్రియ సంస్థ ద్వారా మట్టిలో ఉండే మాణిక్యాలను వెలికితీయాలన్నదే మా లక్ష్యం. పేద విద్యార్థులకు ప్రోత్సాహం అందిస్తూ ముందుకు సాగుతున్నాం. దానికి అందరూ సహకారం అందజేయడం ఆనందంగా ఉంది.
- ఎస్‌ఎస్‌ఆర్ జగన్నాథరావు, క్రియ సంస్థ కార్యదర్శి
Advertisement
Advertisement