
మాటల్లేవ్.. చేతలే..
♦ ప్రచార సభలో మంత్రి కేటీఆర్
♦ కార్పొరేషన్ ఎన్నికల్లో
♦ టీఆర్‌ఎస్ గెలుపు ఖాయం
ఖమ్మం అర్బన్ : ఇప్పటివరకు పాలించిన ప్రభుత్వాల మాదిరిగా మాటలు చెప్పే ప్రభుత్వం కాదని, మాది చేతల ప్రభుత్వమని రాష్ట్ర ఐటీ, పీఆర్, మున్సిపల్ శాఖ మంత్రి కేటీఆర్ పేర్కొన్నారు. కార్పొరేషన్ ఎన్నికల ప్రచారంలో భాగంగా నగరంలో గురువారం రోడ్‌షోలో పాల్గొన్నారు. బల్లేపల్లి, పాండురంగాపురం, ఖానాపురం, రోటరీ నగర్, ఇల్లెందు క్రాస్‌రోడ్డు జంక్షన్లలో అభ్యర్థులు ధారావత్ రామ్మూర్తినాయక్, డాక్టర్ పాపాలాల్, కొనకంచి సరళ, నాగండ్ల కోటి, దయాకర్, హనుమాన్, కొత్తపల్లి నీరజ, చావా నారాయణరావు, ఎస్‌కే.జాన్‌బీ, కూరాకుల వలరాజు విజయాన్ని కాంక్షిస్తూ ప్రచారం చేశారు. ఖమ్మంలో అభివృద్ధి చూసిన ప్రజలు ప్రభుత్వం ఏర్పడిన 18 నెలల్లోనే ఇంత అభివృద్ధి జరిగితే.. కార్పొరేషన్ ఎన్నికల్లోనూ టీఆర్‌ఎస్ గెలిస్తే..
మరింత అభివృద్ధి జరుగుతుందని ఆకాంక్షిస్తున్నారని మంత్రి కేటీఆర్ అన్నారు. రాష్ట్రంలో చేతల సీఎంగా కేసీఆర్, ఖమ్మంలో చేతల మంత్రిగా తుమ్మల నాగేశ్వరరావు ఉన్నారని, వీరి ద్వారా జిల్లా అన్ని రంగాల్లో అభివృద్ధి చెందుతోందన్నారు. ప్రపంచవ్యాప్తంగా రాష్ట్రాల మధ్య జల సమస్య కొనసాగుతోందని, అపర చాణక్యుడిలా 950 టీఎంసీల నీటిని సాగుకు ఉపయోగించుకునేలా సీఎం కేసీఆర్ పొరుగు రాష్ట్రాలను మెప్పించారన్నారు. జిల్లాలోని 5 లక్షల ఎకరాలకు సాగునీరందించడానికి రెండు ప్రధాన ప్రాజెక్టులను మంజూరు చేసినట్లు తెలిపారు. ఎన్నికల పోటీ లో ఉన్న పచ్చ, ఎర్ర, మూడు రంగుల పార్టీల పరిస్థితి జోగిజోగి రాసుకుంటే బూడిద రాలిన చందంగా ఉంటుందని, మీ ఓటు బూడిదకా.. అభివృద్ధి చేసే టీఆర్‌ఎస్‌కా అనేది నిర్ణయించుకొని.. ఓటు వేయాలన్నారు. ఇంకా సభలో మంత్రి తుమ్మల నాగేశ్వరరావు, డోర్నకల్ ఎమ్మెల్యే రెడ్యానాయక్ మాట్లాడారు.
ఖమ్మానికి ఒరిగిందేమీ లేదు..
ఖమ్మం వైరారోడ్ : ప్రతిపక్షాల పాలనలో ఖమ్మంకు ఒరిగిందేమీ లేదని, పట్టణ అభివృద్ధిని పూర్తిగా విస్మరించారని మంత్రి కేటీఆర్ అన్నారు. నగరంలో గురువారం నిర్వహించిన పలు రోడ్‌షోలు, జహీర్‌పుర తండా, గాంధీచౌక్, సారధినగర్ ప్రాంతాల్లో నిర్వహించిన సభల్లో ఆయన మాట్లాడారు. టీఆర్‌ఎస్ అభ్యర్థులను పరిచయం చేస్తూ.. కారు గుర్తుకే ఓటేసి అభ్యర్థులను గెలిపించాలని కోరారు. ఐదేళ్లు తమకు అవకాశం ఇస్తే నగర రూపురేఖలు పూర్తిగా మారుస్తామని హామీ ఇచ్చారు. మంత్రి తుమ్మల, టీఆర్‌ఎస్ జిల్లా అధ్యక్షుడు ఎస్.బి.బేగ్, డీసీసీబీ చైర్మన్ మువ్వా విజయ్‌బాబు, ఎమ్మెల్సీలు పల్లా రాజేశ్వర్‌రెడ్డి, బాలసాని లక్షీనారాయణ, జీహెచ్‌ఎంసీ మేయర్ రామ్మోహన్, ఫజీయుద్దీన్, కార్పొరేషన్ ఎన్నికల ఇన్‌చార్జ్ నూకల నరేష్‌రెడ్డి, అసెంబ్లీ నియోజకవర్గ ఇన్‌చార్జ్ కృష్ణ పాల్గొన్నారు.
ఓడించలేకే కుట్రలు
ఖమ్మం కల్చరల్/జెడ్పీసెంటర్ : టీఆర్‌ఎస్‌ను ప్రత్యక్షంగా ఎన్నికల్లో ఎదుర్కోలేక ప్రతిపక్ష పార్టీలన్నీ అంతర్గతంగా కుమ్మక్కై.. కుళ్లు రాజకీయాలకు పాల్పడుతున్నాయని మంత్రి కేటీఆర్ అన్నారు. కార్పొరేషన్ ఎన్నికల సందర్భంగా టీఆర్‌ఎస్ అభ్యర్థుల తరఫున గురువారం ఆయన ప్రచారం చేశారు. ముస్తఫా నగర్, చర్చి కాంపౌండ్, రోటరీ నగర్‌లలో జరిగిన రోడ్‌షోలో ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలో టీడీపీ అడ్రస్ లేకుండా పోయిందన్నారు. రోడ్‌షోలో మంత్రి తుమ్మల నాగేశ్వరరావు, ఎమ్మెల్సీ బాలసాని, పల్లా రాజేశ్వర్‌రెడ్డితోపాటు 11 నుంచి 25వ డివిజన్ అభ్యర్థులు మేడా ప్రశాంత లక్ష్మి, గాజుల వసంత, ఆళ్ల నిరీష, మందడపు మనోహర్‌రావు, వీరస్వామి రమణమ్మ, కమర్తపు మురళి, పునుకుండ్ల నీరజ, వంగర కిషోర్, సయ్యద్‌మీరా బేగం, కర్నాటి కృష్ణమూర్తి, చావా నారాయణరావు, పోట్ల శశికళ, బత్తుల మురళి, మచ్చా నరేందర్ పాల్గొన్నారు.
బోస్ విగ్రహ ఏర్పాటుకు తొలి తీర్మానం
ఖమ్మం గాంధీచౌక్ : కార్పొరేషన్‌పై గులాబీ జెండా ఎగురవేసి.. బోస్ సెంటర్‌లో సుభాష్ చంద్రబోస్ కాంస్య విగ్రహ ఏర్పాటుకు తొలి తీర్మానం చేయాలని రాష్ట్ర మంత్రి కేటీఆర్ అన్నారు. నగరంలోని బోస్ బొమ్మ సెంటర్‌లో గురువారం జరిగిన సభలో ఆయన మాట్లాడారు. ఖమ్మంలో ఎర్రన్నలకు చాలా అవకాశాలు ఇచ్చారని, అయినా అభివృద్ధి జరగలేదన్నారు. 41,42,43 డివిజన్ల అభ్యర్థులు మెంతుల గీత, బాదె సుజాత, కోడి విజయ లక్ష్మిలను పరిచయం చేస్తూ.. వారికి ఓటు వేయాలని అభ్యర్థించారు. బోస్ బొమ్మ సెంటర్ నుంచి మార్కెట్ రోడ్, పొట్టి శ్రీరాములు రోడ్ మీదుగా రోడ్‌షో సాగింది. మంత్రి తుమ్మల, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు పాల్గొన్నారు.