- ఆరోగ్య విషయాల్లో అట్టడుగున ఉన్నాం
- కర్నూలు పేరు చెబితేనే తిడుతున్నారు
- డీఎంహెచ్‌ఓ డాక్టర్ స్వరాజ్యలక్ష్మి
కర్నూలు : ‘జిల్లా, రాష్ట్రస్థాయిలో ఎక్కడ వైద్య ఆరోగ్యశాఖ సమావేశం జరిగినా కర్నూలు పేరు చెబితేనే తిడుతున్నారు.. ఆ తర్వాతే మాట్లాడుతున్నారు. కుటుంబసంక్షేమ కార్యక్రమాల అమలులో మన జిల్లా అంతలా దిగజారి పోయింది. పనితీరు మార్చుకుని అభివృద్ధిలో ముందడుగు వేయకపోతే తిప్పలు తప్పవు’ అని జిల్లా వైద్యారోగ్యశాఖాధికారి డాక్టర్ ఎం.స్వరాజ్యలక్ష్మి హెచ్చరించారు.
స్థానిక ప్రాంతీయ శిక్షణా కేంద్రం(ఫిమేల్)లో ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు, అర్బన్ హెల్త్ సెంటర్ల మెడికల్ ఆఫీసర్లతో మంగళవారం నిర్వహించిన సమావేశంలో ఆమె మాట్లాడారు. ఈ నెల 11 నుంచి 23 వరకు అతిసార వ్యాధి నివారణ పక్షోత్సవాలు నిర్వహిస్తున్నామన్నారు. ఎక్కడైనా అతిసార కేసు నమోదైతే అందుకు మెడికల్ ఆఫీసరే బాధ్యత వహించాల్సి ఉంటుందన్నారు. ప్రభుత్వ ఆసుపత్రుల్లో 80వేల మంది గర్భిణీలకు పరీక్షలు జరిగితే చివరగా 60వేల మంది మాత్రమే ప్రసవిస్తున్నారని, మిగిలిన 20వేల మంది ఎక్కడికి వెళ్తున్నారని ప్రశ్నించారు.
ఈ పరిస్థితిలో మార్పు రావాలన్నారు. మాతృత్వ మరణాలు తగ్గించాలన్న ఉద్దేశ్యంతో ఈ నెల 9వ తేదీన ప్రధాన మంత్రి సురక్షిత మాతృత్వ అభియాన్ కార్యక్రమాన్ని ప్రారంభిస్తున్నట్లు తెలిపారు. ఇకపై ప్రతి నెలా 9వతేదీన ప్రభుత్వ ఆసుపత్రుల్లో 2వ క్వార్టర్‌లో గర్భిణీలకు 4 నుంచి 6 నెలలవరకు, 3వ క్వార్టర్‌లో 7 నుంచి 9 నెలలున్న వారికి వైద్యులచే పరీక్ష చేయించాలన్నారు.
ఈ పరీక్షల ద్వారా హైరిస్క్ గర్భిణీలను గుర్తించి, రెఫరల్ ఆసుపత్రులకు పంపించే అవకాశం ఉందన్నారు. అడిషనల్ డీఎంహెచ్‌ఓ డాక్టర్ యు.రాజాసుబ్బారావు మాట్లాడుతూ ప్రయివేటు ప్రాక్టీస్ చేసే వైద్యులపై ప్రభుత్వం చర్యలు తీసుకుంటోందని, ఇంకా ఎవరైనా ప్రాక్టీస్ చేస్తుంటే మానుకోవాలన్నారు. సమావేశంలో డీసీహెచ్‌ఎస్ డాక్టర్ రామకృష్ణారెడ్డి, డీఐఓ డాక్టర్ వెంకటరమణ, పీఓడీటీ డాక్టర్ సరస్వతీదేవి, ఐసీడీఎస్ పీడీ అరుణ, డబ్ల్యూహెచ్‌వో ప్రతినిది ప్రగత్ పాల్గొన్నారు.