భారతి(ఫైల్)
-
ప్రేమపేరుతో యువకుడి మోసం
-
రెండోపెళ్లి చేసుకుంటానని గొడవ
-
మనస్తాపంతో ఓ అభాగ్యురాలి బలవన్మరణం
-
మతదేహంతో విద్యార్థుల రాస్తారోకో
మద్దూరు: ప్రేమించిన వాడు కాదన్నాడు.. అంతటితో ఆగకుండా పెళ్లి కూడా చేసుకున్నాడు. మళ్లీ నిన్ను రెండో పెళ్లి చేసుకుంటానని వెంటపడి వేధించడం ప్రారంభించాడు. అవమానభారం భరించలేక ఆ అభాగ్యురాలు ఆత్మహత్యకు ఒడిగట్టింది. ఈ విషాదకర సంఘటన బుధవారం రాత్రి మండలంలోని గోకుల్‌నగర్‌లో చోటుచేసుకుంది. ఎస్‌ఐ నరేందర్, గ్రామస్తుల కథనం మేరకు.. గ్రామానికి చెందిన భారతి(20) మద్దూరులోని ఓ ప్రై వేట్ కాలేజీలో డిగ్రీ మూడో సంవత్సరం చదువుతోంది. అదే ఊరికి చెందిన శివరాజ్(25) గ్రామంలోని విద్యుత్ సబ్‌స్టేషన్‌లో కాంట్రాక్టు విధానంపై ఆపరేటర్‌గా పనిచేస్తున్నాడు. వీరిద్దరూ ఆరేళ్లుగా ప్రేమించుకుంటున్నారు. శివరాజ్ భారతిని కాదని తన కులానికి చెందిన అమ్మాయిని ఆరునెలల క్రితమే వివాహం చేసుకున్నాడు. కొంతకాలంగా భారతికి ఫోన్‌చేసి ‘నిన్ను రెండో పెళ్లిచేసుకుంటా..’అంటూ వేధించడం ప్రారంభించాడు. ఈ క్రమంలో రెండురోజుల క్రితం ఇంటికివచ్చి భారతితో గొడవకు దిగాడు. దీంతో మనస్తాపానికి గురైన ఆమె ఇంట్లోనే ఒంటిపై కిరోసిన్ పోసుకుని నిప్పంటించుకుంది. తండ్రి గమనించి ఆస్పత్రికి తరలిస్తుండగా పరిస్థితి విషమించడంతో ప్రాణాలు విడిచింది. మతురాలి తండ్రి శేఖర్ ఫిర్యాదు మేరకు కేసు దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌ఐ నరేందర్ తెలిపారు.
విద్యార్థుల రాస్తారోకో..
భారతి మతికి కారణమైన శివరాజ్‌ను అరెస్ట్ చేసి కఠినంగా శిక్షించాలని గురువారం ఏబీవీపీ, వీరశైవలింగాయత్ సంఘం ఆధ్వర్యంలో మతదేహంతో మద్దూరు పాతబస్టాండ్ చౌరస్తాలో రాస్తారోకో చేపట్టారు. అంతకుముందు పెదిరిపాడ్ చౌరస్తా నుంచి పాతబస్టాండ్ వరకు వారు భారీ ర్యాలీ నిర్వహించారు. చదువుకుంటున్న విద్యార్థికి మాయమాటలు చెప్పి మోసం చేసి మరోపెళ్లి చేసుకున్న తరువాత కూడా వెధించడంతోనే ఆమె చనిపోయిందని ఆగ్రహించారు. నిందితుడిని అరెస్ట్‌చేసే వరకు రాస్తారోకో విరమించేది లేదని భీష్మించారు. నిందితుడి శివరాజ్‌ను అరెస్ట్‌చేస్తామని హామీఇవ్వడంతో రాస్తారోకో విరమించారు. కార్యక్రమంలో వీరశైవలింగాయత్ నేతలు జగదీశ్వర్, శివరాజ్, చంద్రశేఖర్, మల్లికార్జున్, శివకుమార్, శేఖర్, సిద్ధిలింగం, ఏబీవీపీ నాయకులు పాల్గొన్నారు.