సీఎం ఆదేశాల మేరకే భూసమీకరణ
ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆదేశాల మేరకే మచిలీపట్నంలో భూసమీకరణ చేస్తున్నట్లు రాష్ట్ర మున్సిపల్ శాఖ మంత్రి పి.నారాయణ అన్నారు. మచిలీపట్నం కలెక్టరేట్‌లో మచిలీపట్నం ఏరియా డెవలప్‌మెంట్ అథారిటీ (ఎంఏడీఏ) కార్యాలయాన్ని శనివారం ప్రారంభించారు.
మచిలీపట్నం : ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆదేశాల మేరకే మచిలీపట్నంలో భూసమీకరణ చేస్తున్నట్లు రాష్ట్ర మున్సిపల్ శాఖ మంత్రి పి.నారాయణ అన్నారు. మచిలీపట్నం కలెక్టరేట్‌లో మచిలీపట్నం ఏరియా డెవలప్‌మెంట్ అథారిటీ (ఎంఏడీఏ) కార్యాలయాన్ని శనివారం ప్రారంభించారు. ఈ సందర్భంగా కలెక్టరేట్ ప్రధాన గేటు వద్ద ఏర్పాటు చేసిన సభను ఉద్దేశించి ఆయన ప్రసంగించారు. మచిలీపట్నం పోర్టును అభివృద్ధి చేస్తే ఈ ప్రాంతం అభివృద్ధి చెందుతుందన్నారు. రాజధాని అమరావతిలో 33 వేల ఎకరాల భూమిని సమీకరించామని రోడ్లు, గ్రీనరీ, సచివాలయం తదితరాలకు భూమిని కేటాయిస్తే మిగిలింది 6 వేల ఎకరాలు మాత్రమే అని చెప్పారు. మచిలీపట్నంలోనూ 33 వేల ఎకరాల భూమిని సమీకరిస్తున్నారనే భయం రైతుల్లో ఉందని, పరిశ్రమలు వస్తే ఈ ప్రాంతంలో ఉపాధి అవకాశాలు మెరుగవుతాయని తెలిపారు. ఎంఏడీఏ కార్యాలయం ప్రారంభించిన రోజే 1370 ఎకరాల భూమిని ఇచ్చేందుకు రైతులు ముందుకు రావటం అభినందనీయమని పేర్కొన్నారు. మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు మాట్లాడుతూ ప్రభుత్వం చేసే అభివృద్ధి కార్యక్రమాలను అడ్డుకునేందుకు ప్రతిపక్షం ప్రయత్నిస్తోందన్నారు. ఎంపీ కొనకళ్ల నారాయణరావు మాట్లాడుతూ భూములు కోల్పోతామనే భయం నుంచి రైతులు భయటపడాలన్నారు.
ఏ రైతు కంట కన్నీరు రానివ్వం..
మంత్రి కొల్లు రవీంద్ర మాట్లాడుతూ ఏ ఒక్క రైతు కంట కన్నీరు రాకుండా భూసమీకరణ చేస్తామని చెప్పారు. శాసనసభ ఉపసభాపతి మండలి బుద్ధప్రసాద్ మాట్లాడుతూ ఈ ప్రాంత భవిష్యత్తు కోసం రైతులు త్యాగాలు చేయాల్సిన అవసరం ఉందన్నారు. ఎమ్మెల్సీ పీతా రవిచంద్ర, పెడన ఎమ్మెల్యే కాగిత వెంకట్రావు మాట్లాడుతూ రైతుల భాగస్వామ్యంతోనే పోర్టు, పరిశ్రమల నిర్మాణం జరుగుతుందని పేర్కొన్నారు.
ఉపాధి కోసం వలసపోతున్న జనం
ఇన్‌చార్జి కలెక్టర్ గంధం చంద్రుడు మాట్లాడుతూ మచిలీపట్నం పారిశ్రామికంగా అభివృద్ధి చెందకపోవటంతో ఉపాధి కోసం ఇక్కడి ప్రజలు వలస పోతున్నారని చెప్పారు. ఈ పరిస్థితి నుంచి బయటపడేందుకు మచిలీపట్నంలో పోర్టు నిర్మాణంతో పాటు పారిశ్రామిక అభివృద్ధి జరగాలని పేర్కొన్నారు. కార్యక్రమంలో మాజీ మంత్రి నడకుదుటి నరసింహారావు, మున్సిపల్ చైర్మన్ ఎంవీ బాబాప్రసాద్, వైస్‌చైర్మన్ పి.కాశీవిశ్వనాథం, ఎంపీపీ కాగిత వెంకటేశ్వరరావు, జెడ్పీటీసీ సభ్యుడు లంకే నారాయణప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. తొలుత ఎంఏడీఏ కార్యాలయం వద్దకు మంత్రులు, టీడీపీ నాయకులు ద్విచక్ర వాహనాలపై ర్యాలీగా వెళ్లారు.