దేవళంపేటలోని ఆక్రమిత చెరువు స్థలంలో సాగవుతున్న పంటలు
జిల్లాలో భూ కబ్జాల పర్వం
Published Mon, Aug 22 2016 11:59 PM | Last Updated on Mon, Sep 4 2017 10:24 AM
– రెవెన్యూ అధికారుల సాయంతో అక్రమాలు
– తప్పుల తడకగా వెబ్‌ల్యాండ్
– ఇష్టారాజ్యంగా రిజిస్ట్రేషన్లు
– అన్‌రిజిస్టర్ డాక్యుమెంట్లకే అధికారుల పెద్దపీట
– రిజిస్టర్ డాక్యుమెంట్లకు విలువివ్వని వైనం
చిత్తూరు(కలెక్టరేట్):
జిల్లాలో కబ్జాదారుల ఆగడాలు మితిమీరుతున్నాయి. ప్రభుత్వ ఉదాసీనత, రెవెన్యూ అధికారుల నిర్లక్ష్యం కారణంగా అక్రమార్కులు రెచ్చిపోతున్నారు. ప్రభుత్వ, ప్రైవేటు, దేవాదాయ, మఠం భూములన్న తేడా లేకుండా యథేచ్ఛగా అక్రమించేస్తున్నారు. అన్‌రిజిస్టర్ డాక్యుమెంట్ల సాయంతో వెబ్‌ల్యాండ్‌లో వివరాలు నమోదు చేసుకుని బ్యాంకుల నుంచి అడ్డదిడ్డంగా రుణాలు పొందడమేకాకుండా, భారీ ధరలకు విక్రయిస్తూ సొమ్ము చేసుకుంటున్నారు. నిజమైన లబ్ధిదారులు రిజిస్టర్ డాక్యుమెంట్లను చూపిస్తున్నా రెవెన్యూ అధికారులు కబ్జాదారులకే వంతపాడుతుండడం గమనార్హం.
జిల్లాలో అక్రమార్కులు రెచ్చిపోతున్నారు. చట్టంలోని లొసుగులను ఆసరగా చేసుకుని భూ కబ్జాలకు పాల్పడుతున్నారు.
ఇదిగో సాక్ష్యం..
– పులిచెర్ల మండలం దేవళంపేట గ్రామలెక్కల దాఖలా సర్వే నెం. 125 లోని 7.96 ఎకరాల స్థలం 1954 ముందు మూడు కుంటల సముదాయం. అదేగాక సర్వే నెం. 128–10 లోని జమీందారుల ఆధీనంలోని పాళ్యంకట్టుబడి భూములు, దేవాదాయ భూములను అప్పటి కరణం బంజరు భూములుగా మార్పు చేశారు. సర్వే నెం. 146–11 లో 18 సెంట్ల శ్మశాన స్థలంతో పాటు, హంద్రీ నీవా కాలువ గట్టు భూములను కూడా ఇటీవల ఓ వ్యక్తి ఆక్రమించుకున్నాడు. సర్వే నెం. 296–4 లోని 1.96 ఎకరాల విస్తీర్ణం ఉన్న గంగమ్మ చెరువు గత మూడేళ్ల క్రితం కూడా ప్రభుత్వ లెక్కల్లో చెరువుగానే ఉంది. అయితే ప్రస్తుతం ఓ వ్యక్తి ఆధీనంలో పూర్తిగా సాగులో ఉంది. వీటిపై పలుమార్లు అధికారులకు ఫిర్యాదు చేసినా ఏమాత్రం స్పందించడం లేదని గ్రామస్తులు సాక్షికి తెలియజేశారు.
– పూతలపట్టు మండలం అయ్యప్పగారి పల్లెకు చెందిన ఓ ప్రబుద్ధుడు ఏకంగా 10 మంది రైతులకు చెందిన 67 సర్వే నంబర్ల పరిధిలోని దాదాపు 17.50 ఎకరాల స్థలానికి తప్పుడు రికార్డులు సృష్టించి ఆన్‌లైన్‌లో నమోదు చేసుకున్నాడు. అదేగాక వెబ్‌ల్యాండ్‌లోని 1 (బీ) ఆధారంగా ఏకంగా ఆ భూములను పక్కాగా రిజిస్టర్ చేయించుకున్నాడు. అయితే ఆ భూమలు గ్రామస్తుల అనుభవంలోనే ఉన్నాయి, కానీ రికార్డులు మాత్రం ఇతనిపై ఉన్నాయి. అంతటితో ఆగని కబ్జాదారు రికార్డుల ప్రకారం భూములను స్వాధీనం చేసుకునేందుకు సర్వేకు సన్నద్ధమయ్యాడు. దీంతో విషయం తెలుకున్న గ్రామస్తులు లబోదిబోమంటూ గత నెల 25 తేదీ కలెక్టరేట్‌కు విచ్చేసి ప్రజావాణిలో అధికారులకు ఫిర్యాదు చేశారు.
రెవెన్యూ లీలలు
గతంలో భూములకు సంబంధించి కొనుగోలు, విక్రయాలను రిజిస్టర్ డాక్యుమెంట్ల ద్వారా చేసేవారు. ఫలితంగా రిజిస్ట్రేష్లలో అవకతవకలు జరిగేందుకు ఆస్కారం ఉండేది కాదు. అయితే రైతులు తమ భూముల ఆధారంగా బ్యాంకు రుణాలు పొందాలంటే డాక్యుమెంట్లను తాకట్టు పెట్టేవారు. ఈ విధానం వల్ల రైతులు ఇబ్బందులు పడాల్సి వస్తోందని ప్రభుత్వం భావించింది. రికార్డుల ప్రకారం పట్టాదారు పాసుపుస్తకాలను రెవెన్యూ అధికారుల ద్వారా పొంది, వాటి ఆధారంగా బ్యాంకు రుణాలు పొందే సౌలభ్యాన్ని కల్పించారు. దీంతో కొందరు స్వార్థపరులు రెవెన్యూ అధికారులు, సిబ్బందితో కుమ్మక్కై ఇతరుల భూముల సర్వే నంబర్లతో అన్‌రిజిస్టర్ డాక్యుమెంట్లు సృష్టించి, వాటి ఆధారంగా పట్టాదారు పాసుపుస్తకాలు పొంది బ్యాంకు రుణాలు పొందారు.
తప్పుల తడకగా వెబ్‌ల్యాండ్
ప్రస్తుత ప్రభుత్వం పట్టాదారు పాసుపుస్తకాల ఆధారంగా ఆన్‌లైన్‌లోని వె»Œ ల్యాండ్ రికార్డులను పక్కా చేసే పనులు ముమ్మరం చేస్తోంది. దీంతో గతంలో అన్‌రిజిస్టర్ డాక్యుమెంట్లతో పట్టాదారు పుస్తకాలు పొంది, ఆన్‌లైన్‌లోని 1(బీ)లో సర్వే నెంబర్లను నమోదు చేసుకున్న వారు అధికంగా ఉన్నారు. దీనికారణంగా భూముల యజమానులు ఒకరైతే, వెబ్‌ల్యాండ్‌లో నకిలీ పత్రాలు, పట్టాదారు పుస్తకం కల్గిన వారు యజమానులుగా మారుతున్నారు. దీంతో పక్కాగా రిజిస్టర్ డాక్యుమెంట్లు కల్గిన భూస్వాములు వెళ్లి తమ రికార్డులు చూపినా రెవెన్యూ అధికారులు స్పందించడం లేదనే విమర్శలు గుప్పుమంటున్నాయి.
గుడ్డిగా రిజిస్ట్రేషన్లు
రికార్డులు పక్కాగా ఉన్నా, అన్‌లైన్‌లోని 1 (బీ)లో స్వార్థపరుల పేరున ఉండే సర్వే నంబర్లను తొలగించేందుకు రెవెన్యూ అధికారులు అనేక నిబంధనలు చెబుతున్నారు. నకిలీ పట్టాదారు పుస్తకమయినా, ఆ పుస్తకాన్ని రద్దుచేసే, 1 (బీ)లో నంబర్లను తొలగించే అర్హత తహశీల్దార్లకు లేదని, ఆర్డీఓకు అప్పీల్ చేసుకోవాలని తెలుపుతున్నారు. భూస్వామి రికార్డుల ప్రకారం ఆర్డీఓకు ఫిర్యాదు చేసినా, వాటికి సంబంధించిన సర్వే నంబర్లను 1 (బీ)లో కనీసం బ్లాక్ లిస్ట్‌లో కూడా పెట్టడం లేదు. దీనికారణంగా భూస్వామి ఫిర్యాదు చేసినా ఆక్రమ రికార్డు దారులు ఆ భూములను వెబ్‌ల్యాండ్ ఆధారంగా ఇతరులకు విక్రయించుకునే వెసులుబాటును కల్పిస్తున్నారు. దీంతో అసలు యజమాని ఆ భూములపై పట్టుకోల్పోవాల్సి వస్తోంది. ఆఖరుకు వ్యవహారం కోర్టుకు వెళ్లడం, వాటిపై పూర్తి స్థాయి విచారణ చేపట్టిన తరువాతనే రెవెన్యూ అధికారులు 1 (బీ)లో అసలు యజమానికి మార్పు చేస్తున్నారు. ఈ తతంగం అంతా పూర్తి చేసుకోవాలంటే భూస్వామికి ఏళ్ల తరబడి సమయం పడుతోంది. ప్రభుత్వం స్పందించి చర్యలు తీసుకోవాల్సి ఉంది.
ఫిర్యాదు చేసినా పట్టించుకోవడం లేదు
మా గ్రామ పరిధిలోని భూములకు తప్పుడు రికార్డులతో కొందరు పట్టాదారు పాసుపుస్తకాలు సృష్టించుకుని ఆన్‌లైన్ 1 (బీ)లో నమోదు చేసుకున్నారు. ఏకంగా చెరువు, శ్మశాన స్థలాన్ని కూడా ఆక్రమించుకున్నారు. దీనిపై గ్రామస్తులందరు కలిసి అధికారులకు ఫిర్యాదు చేసినా పట్టించుకోవడం లేదు. – వెంకటరమణ, దేవళంపేట – పులిచెర్ల మండలం
Advertisement