లంకలోకి రావొద్దు
► సర్వే చేయటానికి మేం ఒప్పుకోం
► అధికారులపై రాజధాని రైతుల ఆగ్రహం
► సర్వే అధికారులను అడ్డుకున్న కర్షకులు
► వచ్చిన దారినే వెనుదిరిగిన అధికారులు
సాక్షి, అమరావతి బ్యూరో : ‘లంకలోకి ఎన్ని పర్యాయాలు వస్తారు. మమ్మల్ని ఏం చేయాలనుకుంటున్నారు. ఇకపై లంకలోకి రావొద్దు. అందరితో సమానంగా ప్యాకేజీ ఇచ్చేలా ఉంటే రండి. ఈ లోపు లంకలో అడుగుపెడితే ఒప్పుకునేది లేదు’ అంటూ ఉద్దండ్రాయునిపాలెం రైతులు రెవెన్యూ అధికారులను అడ్డుకున్నారు. లింగాయపాలెం పంచాయతీ పరిధిలో లంక భూముల వద్ద కాపురం ఉంటున్న నివాసాల వివరాలు సేకరించేందుకు సోమవారం తుళ్లూరు తహసీల్దార్ సుధీర్‌బాబు, ముగ్గురు సర్వేయర్లు ఉద్దండ్రాయునిపాలెంకు చేరుకున్నారు. విషయం తెలుసుక్ను స్థానికులు వారిని అడ్డుకున్నారు. ‘ఎందుకొచ్చారు? ఇప్పటికి ఎన్ని పర్యాయాలు వచ్చి సర్వే చేసి ఉంటారు. మమ్మల్ని ఏం చేయాలనుకుంటున్నారు. లంకలో సర్వే చేయటానికి వీల్లేదు. అందరితో సమాన ప్యాకేజీ ఇస్తామని ప్రభుత్వం నుంచి గట్టి హామీ ఇస్తేనే లోనికి వెళ్లండి. లేకపోతే వచ్చిన దారినే వెళ్లిపోండి’ అంటూ ఎదురు తిరిగారు.
అంటరానివారిలా చూస్తున్నారు..: ప్రజా రాజధాని అని చెప్పి దళితులకు చోటు లేకుండా చేయటం మంచిదేనా? అని రైతులు ప్రశ్నించారు. ప్రభుత్వం లంక రైతుల పట్ల వివక్ష ప్రదర్శిస్తోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. భూముల కోసం మంత్రులు, ఎమ్మెల్యేలు అందరూ రైతుల నివాసాలకు వెళ్లి బతిమలాడారని గుర్తుచేశారు. అయితే లంక రైతులను అంటరాని వారిలా చూస్తున్నారని మండిపడ్డారు. లంకలో నివాసాలు ఏర్పాటు చేసుకున్న వారిపట్లా వివక్ష చూపుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. కేవలం నివాసాలకు మాత్రమే పరిహారం ఇచ్చి... చుట్టూ ఉన్న ఖాళీ స్థలాన్ని లెక్కలోకి ఎందుకు తీసుకోరని ప్రశ్నించారు.
సమాన ప్యాకేజీ ఇవ్వొద్దని ఏ చట్టం చెప్పింది: దళిత రైతులకు సమాన ప్యాకేజీ ఇవ్వకూడదని ఏ చట్టం చెప్పిందని తహసీల్దార్ సుధీర్‌బాబును రైతులు నిలదీశారు. రాజధాని నిర్మాణం కోసం ఇప్పటి వరకు భూములు ఇచ్చిన వారంతా కన్నీరుపెడుతున్నారని గుర్తుచేశారు. గజం స్థలం ఇస్తే పరిహారం కింద గజం ఇస్తామని హామీ ఇచ్చి... అవసరం తీరాక మాట మారుస్తున్నారని ధ్వజమెత్తారు. లంక భూముల రైతులకు సమాన ప్యాకేజీ ఇచ్చేవరకు సర్వే చేయటానికి ఒప్పుకునేది లేదని తేల్చిచెప్పటంతో తహసీల్దార్, సర్వేయర్లు వచ్చినదారినే వెనుదిరిగి వెళ్లిపోయారు.