చివరి అవకాశం!
మిగులు భూముల క్రమబద్ధీకరణపై కలెక్టర్ రఘునందన్‌రావు
♦ 25వ తేదీలోపు దరఖాస్తు చేసుకోవాలి
♦ క్రమబద్ధీకరించుకోని స్థలాలు వెనక్కి..
♦ యూఎల్‌సీ స్థలాల రెగ్యులరైజేషన్‌తో రూ.వెయ్యి కోట్ల రాబడిట
♦ విలేకరుల సమావేశంలో హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాల కలెక్టర్లు
సాక్షి, రంగారెడ్డి జిల్లా ప్రతినిధి: పట్టణ భూ గరిష్ట పరిమితి (యూఎల్‌సీ) భూములను క్రమబద్ధీకరించుకోవడానికి ఇదే చివరి అవకాశమని కలెక్టర్ ఎం.రఘునందన్‌రావు వెల్లడించారు. ఈ నె ల 25వ తేదీలోపు దరఖాస్తులను సమర్పించాలని, గడువు పొడగించే ఆలోచన ప్రభుత్వానికి లేదని స్పష్టం చేశారు. ప్రభుత్వ మిగులు భూములుగా గుర్తించిన ఖాళీ స్థలాలనే క్రమబద్ధీకరించనున్నట్లు ఆయన చెప్పారు. దరఖాస్తు చేయని మిగులు భూములను 22ఏ కింద ప్రకటించి వీటిని ప్రజోపయోగ అవసరాలకు లేదా వేలం ద్వారా ప్రభుత్వం విక్రయిస్తుందని తెలిపారు. శనివారం రంగారెడ్డి జిల్లా కలెక్టరేట్‌లో హైదరాబాద్ కలెక్టర్ రాహుల్‌బొజ్జ, జేసీ రజత్‌కుమార్‌సైనీతో కలిసి విలేకర్లతో మాట్లాడారు.
జంట జిల్లాల్లో 672 ఎకరాల విస్తీర్ణంలో వివాదరహిత యూఎల్‌సీ స్థలాలున్నాయని, వీటిని క్రమబద్ధీకరణకు జీఓ 92ను జారీచేసిన ట్లు తెలిపారు. ఆర్డీఓ అధ్యక్షతన గల కమిటీ మూడు వేల గజాల వరకు క్రమబద్ధీకరిస్తుందని, అపై విస్తీర్ణం కలిగిన స్థలాలు మాత్రం ప్రభుత్వం పరిశీలిస్తుందని చెప్పారు. రంగారెడ్డి జిల్లాలో 601 ఎకరాల విస్తీర్ణంలో మిగులు భూములు ఖాళీగా ఉన్నట్లు గుర్తించామని, ప్రతి కాలనీకి ప్రత్యేక బృందాలను పంపి క్రమబద్ధీకరణ సమాచారాన్ని ఆక్రమణదారులకు తెలియపరిచామని తెలిపారు. నిర్ధారించిన ఖాళీ మిగులు భూములు 5,700 మంది పొజిషన్‌లో ఉన్నట్లు గుర్తించామని, వీరిలో 250 గజాల్లోపు దాదాపు 4,200 మంది వరకు ఉన్నారని తెలిపారు. అంతేగాకుండా..
ఆయా భూములకు సంబంధించిన సమాచారాన్ని కూడా ప్రభుత్వ వెబ్‌సైట్‌లో పొందుపరిచినట్లు పేర్కొన్నారు. ఇప్పటివరకు 750 దరఖాస్తులు వచ్చాయని, రెండు జిల్లాల్లో యూఎల్‌సీ భూముల క్రమబద్ధీకరణ ద్వారా కనిష్టంగా రూ.1000 కోట్ల మేర ఖజానాకు ఆదాయం లభిస్తుందని అంచనా వేస్తున్నట్లు చెప్పారు. కోర్టు పరిధిలో ఉన్న గురుకుల్ ట్రస్ట్ భూములను క్రమబద్ధీకరించే అవకాశంలేదని కలెక్టర్ రఘునందన్ ఓ విలేకరి అడిగిన ప్రశ్నకు సమాధానంగా చెప్పారు. హైదరాబాద్ జిల్లా పరిధిలో 71 ఎకరాల పరి ధిలో ఖాళీ మిగులు భూములున్నాయని, వీటి ని క్రమబద్ధీకరిస్తామని రాహుల్ బొజ్జ చెప్పా రు. ప్రైవేటు పాఠశాలల్లో ఫీజులను క్రమబద్ధీకరించేందుకు ప్రత్యేక విధానాన్ని తీసుకురావాలని యోచిస్తున్నట్లు ఆయన వెల్లడించారు.
దరఖాస్తు ఇలా...
♦ రిజిస్టర్ సేల్ డీడ్, దరఖాస్తు పత్రం, ఆధార్ కార్డును జతపరిచి మీ-సేవ కేంద్రాల్లో దరఖాస్తు సమర్పించాలి.
♦ దస్తావేజు గత నెల 26వ తేదీకి ముందు రిజిస్టర్ అయి ఉండాలి.
♦ దరఖాస్తుతోపాటు రూ.2,035 ప్రాసెస్ రుసుము మీ సేవ కేంద్రంలో చెల్లించాలి.
♦ క్రమబద్ధీకరణ ప్రభుత్వ భూమిగా నిర్ధారించిన మిగులు భూములకే వర్తిస్తుంది.
చెల్లించాల్సిన రుసుం
♦ 250 గజాల వరకు మే 26, 2016 నాటి రిజిస్ట్రేషన్ విలువలో 25శాతం
♦ 251 -500 గజాల వరకు నిర్దేశిత విలువలో 50 శాతం
♦ 500 గజాలపైబడిన స్థలాలకు నిర్ధిష్ట రిజిస్ట్రేషన్ విలువలో 75 శాతం
♦ గుర్తించిన మురికివాడల్లో 125 గజాల వరకు పది శాతం
♦ క్రమబద్ధీకరణకు అర్హమైనవిగా తేల్చి నోటీసులు అందుకున్న దరఖాస్తుదారులు నెలరోజుల్లోపు 40శాతం, ఆ తర్వాత మూడు మాసాల్లో 30శాతం, మిగతా మొత్తం నోటీసు తీసుకున్న ఏడు మాసాల్లోపు చెల్లించాల్సి ఉంటుంది.
♦ నిర్దేశిత మొత్తాన్ని ఏకకాలంలో చెల్లించినవారికి ఐదుశాతం డిస్కౌంట్‌ను కూడా ప్రభుత్వం ప్రకటి ంచింది.