
'మందిని ముంచినవారు మాట్లాడుతున్నారు'
హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్కు ప్రత్యేక హోదా డిమాండ్తో నిరవధిక నిరాహార దీక్ష చేస్తున్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఆరోగ్యం పట్ల రాష్ట్ర ప్రభుత్వ మంత్రులు చేస్తున్న వ్యాఖ్యలు బాధాకరమని లక్ష్మీ పార్వతి అన్నారు. నైతిక హక్కులేని వారంతా వైఎస్ జగన్ ఆరోగ్యంపై మాట్లాడుతున్నారని మండిపడ్డారు. ప్రత్తిపాటి పుల్లారావు, మంత్రి గంటా శ్రీనివాసరావుల గురించి ఎవరికీ తెలియని విషయం లేదని, ప్రత్తిపాటి పుల్లారావు మందిని ముంచినవారేనని, తక్కువ ధరలకే రైతుల భూములు ఆక్రమించుకున్నారని, వారి పత్తి పంట సొమ్ములు తన ఖాతాలోకి వేసుకున్నారని ఆరోపించారు.
ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు మోసపూరిత హామీలతో అధికారంలోకి వస్తే రాష్ట్ర సమస్యల పరిష్కారం కోసం, అభివృద్ధి కోసం చిన్నవాడైనా వైఎస్ జగన్ అనేక దీక్షలు, ధర్నాలతో ముందుకు వెళుతున్నారని చెప్పారు. ఇప్పటి వరకు వైఎస్ జగన్ లాగా ఎవరూ శ్రమించలేదని పేర్కొన్నారు. ఆయనను చూసైనా చంద్రబాబు బుద్ధి తెచ్చుకోవాలని అన్నారు. గాంధీ అనుసరించిన మార్గాన్ని వైఎస్ జగన్ఎంచుకున్నారని, నిరవధిక దీక్ష అంటే అమరణ నిరాహార దీక్షేనని, అలాంటి దీక్షను అవమాన పరుస్తారా అని ఆగ్రహం వ్యక్తం చేశారు.
ప్రత్యేక హోదాపై ఇచ్చిన హామీని విస్మరిస్తారా.. అందుకేనా ప్రజలు మీకు ఓట్లేసి గెలిపించింది అని ప్రశ్నించారు. నీతి ఆయోగ్ పేరిట ప్రత్యేక హోదా అడ్డుకుంటున్నారని, నాడు పదేళ్లు ప్రత్యేక హోదా కావాలని సభలో అడిగిన వెంకయ్యనాయుడికి ఇప్పుడు ఆ విషయం ఎందుకు అర్థం కావడంలేదో అని అన్నారు. కేవలం 4,200 కోట్లు మాత్రమే ఆంధ్రప్రదేశ్ కు ఇప్పటి వరకు కేంద్రం ఇచ్చిందని, కాని తెలంగాణ 5,145కోట్లు కేంద్రం నుంచి సాధించుకుందని చెప్పారు.