వేంపల్లె : ఇడుపులపాయ ట్రిపుల్ ఐటీ పరిసర ప్రాంతాలలో చిరుత సంచారం మొదలైంది. గురు, శుక్రవారాలలో వీరన్నగట్టుపల్లె, ట్రిపుల్ ఐటీ రహదారి మధ్యలో ఉన్న ఓ వంతెన వద్ద చిరుత కనిపించిందని అక్కడ ఉన్న మెంటర్స్.. ట్రిపుల్ ఐటీ అధికారులకు తెలియజేశారు. దీంతో ఏవో అమరేంద్రకుమార్ వేంపల్లె అటవీ శాఖాధికారి పీసీ రెడ్డయ్య, ఆర్‌కె వ్యాలీ ఎస్‌ఐ మస్తాన్‌బాషా, ట్రిపుల్ ఐటీ సెక్యూరిటీ ఆఫీసర్ రెడ్డిశేఖరరెడ్డిలకు చిరుత సంచారం గురించి శుక్రవారం తెలిపారు. ట్రిపుల్ ఐటీలో మెస్‌ల వద్ద కుక్కల తాకిడి ఎక్కువైందని.. దీంతో కుక్కలను తినేందుకు చిరుత ఆ ప్రాంతానికి వచ్చి ఉంటుందని అటవీ శాఖాధికారి రెడ్డయ్య తెలిపారు. అక్కడ కుక్కలను లేకుండా చూడాలని ట్రిపుల్ ఐటీ అధికారులకు తెలిపామని ఆయన పేర్కొన్నారు. ఇడుపులపాయ నుంచి పొలతల ఫారెస్ట్ వరకు ప్రతి కిలోమీటరుకు ఒక చిరుత ఉంటుందన్న అభిప్రాయం ఉందని రేంజర్ తెలిపారు. ఇదిలా ఉండగా.. ట్రిపుల్ ఐటీ క్యాంపస్‌కు ఇంతవరకు సక్రమంగా ప్రహరీ లేనందున చిరుతలు లోపలికి వచ్చే అవకాశం ఉంది. భద్రమైన రక్షణ గోడ నిర్మించుకొని పెన్సింగ్ వాల్ ఏర్పాటు చేసుకుంటే అక్కడికి చిరుతలు రావని అటవీ శాఖాధికారులు తెలిపారు.