
ట్రిపుల్ ఐటీలో సంక్షేమం గాలికి
వేంపల్లె: వేంపల్లె మండలం ఇడుపులపాయ ట్రిపుల్ ఐటీలో విద్యార్థుల సంక్షేమం గాలిలో దీపంలా మారింది. ఇక్కడి అధికారుల నిర్లక్ష్యం అడుగడుగునా కొట్టొచ్చినట్లు కనిపిస్తోందనే విమర్శలు ఉన్నాయి. ప్రధానంగా విద్యార్థుల సంక్షేమ కార్యాలయాన్ని ఏర్పాటు చేశారు కానీ.. ఏ ఒక్కరు కూడా బాధ్యతాయుతంగా విద్యార్థుల సంక్షేమానికి పాటుపడలేదన్న అపవాదు తెచ్చుకున్నారు. అధికారులు సక్రమంగా విధులు నిర్వహించకపోవడంతో ట్రిపుల్ ఐటీలో ఇప్పటికే ముగ్గురు విద్యార్థులు వివిధ కారణాలవల్ల బలవన్మరణాలకు పాల్పడ్డారు. గత నాలుగేళ్ల కాలంలో దాదాపు ఐదారు మంది విద్యార్థులు ఆత్మహత్యకు యత్నించారు. కొంతమంది తీవ్ర గాయాలతో చదువులకు దూరమైన పరిస్థితులు ఉన్నాయి. ఈ నేపథ్యంలో బుధవారం సాయంత్రం రాజేష్ అనే విద్యార్థి ఆత్మహత్య చేసుకున్నాడు. కానీ చనిపోయిన విషయాన్ని తల్లిదండ్రులకు ఆలస్యంగా తెలియజేయడంతో అధికారులపై తీవ్ర విమర్శలు వస్తున్నాయి.
విద్యార్థుల సంక్షేమం గాలికి..
ఇడుపులపాయ ట్రిపుల్ ఐటీలో స్టూడెంట్ వెల్ఫేర్ డీన్ కార్యాలయం పేరుకు మాత్రమే ఉంది. స్టూడెంట్ వెల్ఫేర్ డీన్‌గా రత్నకుమారి కొనసాగుతుండగా.. డిప్యూటీ వార్డెన్లు అందరూ కలిపి దాదాపు 30మంది దాకా ఇక్కడ ఉన్నారు. కానీ వీరందరూ ఫ్యాకల్టీగా, మెంటర్స్‌గా ఉంటూ అదనపు బాధ్యతలు చేపడుతున్నారు. నిబంధనల ప్రకారం ట్రిపుల్ ఐటీలో దాదాపు 6వేల మందికిపైగా విద్యార్థులు ఉన్నారు. ప్రధానంగా వార్డెన్లు తరగతి గదులకు వెళ్లకుండా హాస్టల్‌లో ఉన్న విద్యార్థులను నిశితంగా పరిశీలిస్తూ ఉండాలి. ఒకవేళ దిగాలుగా కనిపిస్తే వారికి కౌన్సెలింగ్ నిర్వహించి వారి మనసు మార్చే ప్రయత్నం చేయాలి. తీరని సమస్య అయితే తల్లిదండ్రులకు సమాచారం ఇవ్వాలి. కానీ నిబంధనల ప్రకారం ఏ ఒక్కటి కూడా ఇడుపులపాయ ట్రిపుల్ ఐటీలో జరగలేదని విద్యార్థులు, తల్లిదండ్రులు ఆరోపిస్తున్నారు.
గతంలో జరిగిన సంఘటనలు ఇలా..
– 2015 ఆగస్టు 10వ తేదీన కర్నూలు జిల్లా కొమిలిగుండ్ల గ్రామానికి చెందిన వడ్డే భారతి (ఈ3 విద్యార్థిని) విషద్రావణం మింగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది.
– 2015 అక్టోబరు 30వ తేదీన తూర్పు గోదావరి జిల్లా అప్పనపల్లె గ్రామానికి చెందిన ఉమా జ్యోతి(ఈ3 విద్యార్థిని) ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకుంది.
– 2017 ఫిబ్రవరి 15వ తేదీన చిత్తూరు జిల్లా ఐరాల మండలం తాళంబేడువారిపల్లెకు చెందిన కొత్త రాజేష్(ఈ4 విద్యార్థి) ఫ్యానుకు ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు.
– 2016 ఫిబ్రవరి 6వ తేదీన సౌందర్య, నవీన్ అనే విద్యార్థులు శేషాచలం అడవుల్లోకి పారిపోయి మూడు రోజుల తర్వాత పొలతల వద్ద పోలీసుల గాలింపు చర్యలలో పట్టుబడ్డారు.
వారం రోజులక్రితం జమ్మలమడుగుకు చెందిన పీ1 విద్యార్థిని మాస్ కాపీయింగ్‌కు పాల్పడటంతో దండించారని యాంటీ బయాటిక్ మాత్రలను మింగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది. ఇలాంటి సంఘటనలు కొన్ని తెరపైకి రాగా.. వెలుగు చూడని సంఘటనలు మరెన్నో ఉన్నాయని పలువురు పేర్కొంటున్నారు.