టీడీపీకి చరమగీతం పాడుదాం
- మూడేళ్లలో ఒక్క అభివృద్ధీ లేదు
- రుణమాఫీ పేరుతో మోసం
- జన్మభూమి కమిటీలదే పెత్తనం
- రాజ్యాంగ విరుద్ధంగా నిధుల కేటాయింపు
- నారాయణరెడ్డిది రాజకీయ హత్యే
- ఆదోని ప్లీనరీలో వైఎస్‌ఆర్‌సీపీ నేతలు
ఆదోని: ప్రజావ్యతిరేక విధానాలు అవలంబిస్తున్న టీడీపీకి చరమగీతం పాడుదామని వైఎస్‌ఆర్‌సీపీ నేతలు పిలుపునిచ్చారు. సోమవారం ఆదోని పట్టణం బాబా గార్డెన్‌లో ఎమ్మెల్యే సాయిప్రసాద్‌రెడ్డి అధ్యక్షతన నియోజకవర్గ స్థాయి ప్లీనరీ నిర్వహించారు. ప్రజలు భారీ ఎత్తున తరలివచ్చారు. అంతకు ముందు పట్టణంలో పార్టీ కార్యకర్తలు మోటార్ సైకిల్ ర్యాలీ నిర్వహించారు. ప్లీనరీలో ముఖ్య అతిథిగా కర్నూలు ఎంపీ బుట్టా రేణుక ప్రసంగించారు. మూడేళ్ల టీడీపీ పాలనలో ఒక్క అభివృద్ధి కూడా లేదన్నారు. ఆదోని డివిజన్‌కు పరిశ్రమలు రాలేదని, రోడ్లు వేయలేదని గుర్తు చేశారు. పేదలకు ఒక్క ఇంటిని కూడా నిర్మించలేదని.. అసలు ప్రభుత్వం ఉందా అన్న అనుమానం ప్రజలలో కలుగుతోందన్నారు. అధికారం ఉందని.. వైఎస్సార్సీపీ నాయకులు, కార్యకర్తలపై దౌర్జన్యం చేస్తున్నారని, ప్రజలుఅంతా గమనిస్తున్నారని, ఎన్నికల్లో తగిన బుద్ధి చెబుతారన్నారు. ఎమ్మెల్యేలకు కాకుండా రాజ్యంగ విరుద్ధంగా టీడీపీ నియోజకవర్గ ఇన్‌చార్జ్‌లకు నిధులు కేటాయిస్తున్నారని.. జన్మ భూమి కమిటీల పేరుతో టీడీపీ నాయకులు పెత్తనం చెలాయిస్తున్నారని ఆరోపించారు. ప్రభుత్వ వైఫల్యాలను ప్రజలకు వివరించాలని కార్యకర్తలకు పిలుపునిచ్చారు.
మోసం బట్టబయలు
రుణమాఫీ పేరుతో డ్వాక్రా మహిళలను, రైతులు మోసం చేసిన ఘనత సీఎం చంద్రబాబుదేనని వైఎస్సార్సీపీ జిల్లా అధ్యక్షుడు గౌరు వెంకటరెడ్డి అన్నారు. టీడీపీ అధికారం చేపట్టి మూడేళ్లయినా ఏ హామీ నెరవేరకపోవడంతో తాము మోసపోయామని ప్రజలు బాధపడుతున్నారన్నారు. టీడీపీ నాయకులు, కార్యకర్తలు మాత్రమే బాగుపడాలనే దుర్మార్గపు ఆలోచనలో సీఎం చంద్రబాబు ఉన్నారని ధ్వజమెత్తారు. రాబోయే ఎన్నికల్లో జిల్లాలో 12 నియోజకవర్గాల్లో వైఎస్సార్సీపీ విజయ పతాకం ఎగుర వేస్తుందని ధీమా వ్యక్తం చేశారు.
టీడీపీపై పెరుగుతున్న అసంతృప్తి..
చంద్రబాబు అస్తవ్యస్త పాలనతో విసిగి వేశారి పోయిన ప్రజలు నాటి వైఎస్ పాలనను గుర్తు చేసుకుంటున్నారని మంత్రాలయం ఎమ్మెల్యే, ప్లీనరీ సమావేశం పరిశీలకుడు బాలనాగిరెడ్డి అన్నారు. టీడీపీ పాలనపై ప్రజల్లో అసంతృప్తి పెరుగుతోందన్నారు. పింఛన్, రేషన్ కూడా సకాలంలో అందడం లేదన్నారు. టీడీపీకి ఇక భవిష్యత్తు లేదని, మూడోసారి కూడా తామే గెలుస్తామని చెప్పారు. టీడీపీ నాయకుల దౌర్జన్యాలు, పోలీసు కేసులకు తామెప్పుడు భయపడబోమన్నారు. తమను నమ్ముకున్న కార్యకర్తలకు ఎలాంటి కష్టమొచ్చినా అండగా నిలబడుతామని భరోసానిచ్చారు.
చంద్రబాబు పాలనలో కరువు
వైఎస్ హయాంలో వర్షాలు సమృద్ధిగా కురిసి ప్రజలు సుభిక్షమైన జీవితం గడిపితే.. చంద్రబాబు హయాంలో వర్షాలు కనుమరుగై కరువు తాండవిస్తోందని ఆలూరు ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం అన్నారు. ఆలూరు నియోజకవర్గంలో గుక్కెడు నీరు దొరక్క ప్రజలు అల్లాడిపోతున్నా ప్రభుత్వం పట్టించుకోవడం లేదన్నారు. చంద్రబాబు తనయుడు లోకేష్ ఒక్క ఫోన్ కొడితే తాగునీరు ఇంటికి చేరుతోందని చెపుతున్నారని, అయితే ఆలూరనులో పది రోజులైనా బిందెడు నీరు దొరకని పరిస్థితి ఎందుకు నెలకొందని ఆయన ప్రశ్నించారు. తాగునీరు ఇవ్వండని ఆందోళన చేసిన ప్రజలపై పోలీసులు కేసులు పెట్టి వేధించడం తగదన్నారు.
అధికార పార్టీ దౌర్జన్యాలకు భయపడం...
ఇంటికి ఒక ఉద్యోగం ఇస్తానని టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు..ఎన్నికల్లో హామీ ఇచ్చారని, అధికారంలోకి వచ్చాక.. నిరుద్యోగులకు కాకుండా తన కుమారుడు నారా లోకేష్‌కు మాత్రం ఉద్యోగం ఇచ్చారని ఎమ్మెల్యే సాయిప్రసాద్ రెడ్డి ఆరోపించారు. టీడీపీ నాయకుల దౌర్జన్యాలు పెరిగిపోయాయని, అక్రమ కేసులతో వైఎస్‌ఆర్‌సీపీ కార్యకర్తలు, నాయకులను భయాందోళనకు గురి చేస్తున్నారన్నారు. అధికార పార్టీ దౌర్జనాలకు భయపడేది లేదన్నారు. వైఎస్‌ఆర్‌సీపీ పత్తికొండ నియోజకవర్గ ఇన్‌చార్జ్ చెరకులపాడు నారాయణరెడ్డి ఎదుగుదల చూసి ఓర్వలేక దారుణంగా హత్య చేయించారన్నారు. చంద్రబాబు సహకారంతోనే ఈ హత్య జరిగిందని ఆరోపించారు.