జీవితం అభద్రత! | Life insecurity! | Sakshi
Sakshi News home page

జీవితం అభద్రత!

Published Mon, Jul 24 2017 11:03 PM | Last Updated on Fri, Jun 1 2018 8:52 PM

జీవితం అభద్రత! - Sakshi

జీవితం అభద్రత!

  • హోంగార్డుల వెట్టి
  • సక్రమంగా అందని వేతనాలు
  • కేటాయింపులకు మించి ఉద్యోగులు
  • ప్రతి నెలా జీతంలో తప్పని కోతలు
  • త్రిశంకు స్వర్గంలో 75 మంది హోంగార్డులు
  • అధికారులకు పట్టని సంక్షేమం
  •  

    జిల్లాలో మొత్తం హోంగార్డులు : 800

    కేటాయిస్తున్న బడ్జెట్‌ : 725 మందికే

    జీతాలు అందని వారి సంఖ్య :  75

    ఒక్కొక్కరి జీతాల్లో కోత : రూ.800

    ప్రతి నెలా నష్టపోతున్న మొత్తం : 5.80 లక్షలు

     

    • నగరానికి చెంది ఓ హోంగార్డు పదేళ్ల క్రితం ఉద్యోగం‍లో చేరాడు. అప్పటి నుంచి ఆయన జీవితం ఎదుగూబొదుగూ లేకుండాపోయింది. నెలకు రూ.12వేల జీతంతో జీవితాన్ని భారంగా నెట్టుకొస్తున్నాడు. కొద్ది రోజులుగా అందులోనూ కోత విధిస్తుండటంతో ఇతని వేదన వర్ణనాతీతం.
    • మరో హోంగార్డు విధుల్లో చేరిన తర్వాత దేవుని సేవలో తరిద్దామనే ఉద్దేశంతో దేవాదాయ శాఖకు డిప్యూటేషన్‌పై వెళ్లారు. ఓ ప్రముఖ దేవస్థానంలో కొన్నేళ్ల పాటు సేవలందించారు. ఆ తర్వాత ఆయనను సొంత శాఖకు సరెండర్‌ చేశారు. ప్రస్తుతం ఆయన ఉద్యోగం గాలిలో దీపంగా మారింది.
    • ప్రభుత్వ శాఖలో పనిచేసే ఉద్యోగులకు ఏడాదికేడాది ఇంక్రిమెంట్‌ ఉంటుంది. అలాగని అందరి పరిస్థితి ఇలాగే ఉంటుందనుకుంటే పొరపాటు. హోంగార్డు ఉద్యోగం ఇందుకు భిన్నం. పేరుకు పోలీసు శాఖలో పని చేస్తున్నామని చెప్పుకోవాల్సిందే కానీ.. పూట గడవని కుటుంబాలు ఎన్నో ఉన్నాయి. వీరి సంక్షేమం పట్ల రాష్ట్ర ప్రభుత్వంతో పాటు అధికారులూ వివక్ష చూపడం విమర్శలకు తావిస్తోంది.

     

    అనంతపురం సెంట్రల్‌:

    హోంగార్డుల జీవనం దుర్భరంగా మారింది. అసలే అరకొర జీతం.. అది కూడా నెల నెలా అందని పరిస్థితి. పోలీసులతో సమానంగా సేవలు అందిస్తున్నా.. ఇప్పటికీ అప్పు చేయనిదే కుటుంబం గడవని దీనావస్థ. జిల్లాలో 800 పైచిలుకు హోంగార్డులు పని చేస్తున్నారు. వీరిలో 725 మంది పోలీసు శాఖలో ఉన్నారు. మిగిలిన వారు రోడ్డు రవాణా శాఖ, సివిల్‌ సప్లయ్‌, బీఎస్‌ఎన్‌ఎల్‌, సబ్‌జైలు తదితర కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ శాఖల్లో డిప్యూటేషన్‌పై కొనసాగుతున్నారు. దాదాపు 20 సంవత్సరాలుగా పని చేస్తున్నా ఇప్పటికీ వీరి జీతం రూ.12వేలే. ఈ మొత్తం కూడా ఎప్పుడు వస్తుందో.. ఎంత కోత పడుతుందోననే బెంగ ఉంటోంది. ప్రతి నెలా 5లోగా జీతాలు చెల్లించాలని గత ప్రభుత్వాలు జీఓలు విడుదల చేసినా.. అమలుకు నోచుకోకపోవడం గమనార్హం.

     

    గాలిలో దీపంలా బతుకులు

    పోలీసుశాఖ ద్వారా రిక్రూట్‌ అయి ఇతర ప్రభుత్వశాఖలకు డెప్యూటేషన్‌లపై వెళ్లిన హోంగార్డుల పరిస్థితి గాల్లో దీపంలా తయారైంది. పోలీసుశాఖకు ప్రతి నెలా 725 మంది హోంగార్డులకు సంబంధించిన జీతాలకు మాత్రమే బడ్జెట్‌ విడుదలవుతోంది. ఇతర ప్రభుత్వ శాఖల నుంచి సరైండరైన ఉద్యోగులకు జీతాలు రావట్లేదు. ఇలాంటి వారి సంఖ్య దాదాపు 40 మందికి పైగా ఉన్నారు. మరికొందరు ఆయా శాఖల్లోనే కొనసాగుతున్నారు. ప్రస్తుతం వీరి పరిస్థితి గాల్లో దీపంలా తయారైంది. పోలీసు అధికారులు వారికి పోస్టింగ్‌లు చూపించడం లేదు. దీంతో ఒక నెల కొంతమందికి, మరో నెల ఇంకొందరికి విధులకు పంపేవారు. ఖాళీగా ఉన్న సమయంలో వారికి జీతాలు అందే పరిస్థితి లేదు. ఈ నెల నుంచి బడ్జెట్‌ వస్తున్న 725 మంది నుంచి కొంత మంది కట్‌ చేసుకొని వీరికి పంపిణీ చేయాలని నిర్ణయించారు. దీంతో ఈ నెల ఒక్కో హోంగార్డు నుంచి రూ. 800 వరకు వసూలు చేశారు. ‘‘చాలీచాలని జీతాలతో నెట్టుకొస్తున్నాం.

    ఇందులోనూ కోతలు పెడితే ఎలా’’ అంటూ చాలామంది హోంగార్డులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పోలీసుశాఖలో ఎవరికీ తలెత్తని బడ్జెట్‌ సమస్య హోంగార్డులకే ఎందుకు వస్తోందని వాపోతున్నారు. పోలీసుశాఖలో హోంగార్డులు అంతర్భాగమని, వారు లేని శాఖను ఊహించుకోలేమని కొందరు అధికారులు ఉపన్యాసాల్లో చెబుతుంటారు. అలాంటి హోంగార్డుల సంక్షేమాన్ని మాత్రం అధికారులు పట్టించుకోకపోవడం ఎంతవరకు సమంజసమనే ప్రశ్న ఉత్పన్నమవుతోంది. పిల్లలకు స్కాలర్‌షిప్‌లు, వైద్య చికిత్సలు, కల్యాణ మంటపాల్లో రాయితీలు ఏవీ హోంగార్డులకు లేకపోవడం శోచనీయం. కానీ విధులు మాత్రం పోలీసులతో సమానంగా చేయిస్తుండడం గమనార్హం.

     

    725 మందికే బడ్జెట్‌

    జిల్లాలో కేటాయించిన పోస్టుల కన్నా ఎక్కువ మంది హోంగార్డులు ఉన్నారు. 725 మందికి మాత్రమే జీతాలకు సంబందించి బడ్జెట్‌ రిలీజ్‌ అవుతోంది. ఇందులో కొంతమందికి జీతాలు రావట్లేదు. వారి సంక్షేమాన్ని దృష్టిలో పెట్టుకొని నెలలో రెండు రోజులు మిగిలిన వారికి సెలవులు ఇస్తున్నాం. వారి జీతంలో ఆ మొత్తం కట్‌ చేసి జీతాలు రాని వారికి అందిస్తున్నాం. మరో 200 హోంగార్డు పోస్టులు భర్తీ చేయాలని ప్రభుత్వానికి ప్రతిపాదనలు చేశాం. అనుమతి వస్తే సమస్యకు శాశ్వత పరిష్కారం లభిస్తుంది.

    - చిన్నికృష్ణ, డీఎస్పీ, ఏఆర్‌

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement