అనంతపురం మెడికల్ :
ప్రాణాపాయ స్థితిలో ఉన్న తల్లికి శస్త్రచికిత్సను విజయవంతంగా పూర్తి చేసి తల్లీబిడ్డకు కొత్త జీవితాన్నిచ్చారు అనంతపురం సర్వజనాస్పత్రి వైద్యులు. ఇందుకు సంబంధించిన వివరాలను సోమవారం ఆస్పత్రి సూపరింటెండెంట్ డాక్టర్ జగన్నాథ్, గైనిక్ హెచ్‌ఓడీ డాక్టర్ శంషాద్‌బేగం వైద్యబృందంతో కలిసి విలేకరులకు వెల్లడించారు. కూడేరు మండలం కొర్రకోడు డ్యాం(పీఏబీఆర్)కు చెందిన పార్వతి (28)కి ఇద్దరు మగ పిల్లలున్నారు. ఇప్పటికే రెండు సార్లు ఆమెకు సిజేరియన్ చేశారు. మూడో కాన్పు కోసం ఈ నెల 4వ తేదీన సర్వజనాస్పత్రికి వచ్చింది. డాక్టర్ సుచిత్ర సిజేరియన్ చేయగా ఆడ పిల్లకు జన్మనిచ్చింది. ఆపరేషన్ చేశాక గర్భసంచికి పైన ఉండాల్సిన ‘మాయ’ కింద ఉండటం.. అది కూడా అతుక్కునిపోయి ఉండటంతో దాన్ని తొలగించే క్రమంలో రక్తస్రావం ఎక్కువై అపస్మారక స్థితిలోకి వెళ్లిపోయింది. దీంతో విషయాన్ని గైనిక్ ఇన్‌చార్జ్ హెచ్‌ఓడీ డాక్టర్ సంధ్య దృష్టికి తీసుకెళ్లారు. ఆమె అక్కడకు చేరుకుని పరిస్థితి విషమంగా ఉందని గుర్తించి అనస్తీషియా హెచ్‌ఓడీ నవీన్, మరో అనస్తీషియన్ హరిశ్రీనివాస్, అనస్తీషియా టెక్నీషియన్ బాషా, సర్జన్లు శివశంకర్ నాయక్, మహేశ్, మురళీకృష్ణ, సీనియర్ రెసిడెంట్ స్వాతిలను పిలిపించారు. ఆ వెంటనే ఎనిమిది బాటిళ్ల రక్తం తెప్పించి ఎక్కిస్తూ శస్త్ర చికిత్సను ప్రారంభించారు. యురాలజిస్ట్ అవసరం ఉండటంతో ప్రైవేట్ డాక్టర్ హరినాథ్‌రెడ్డికి ఫోన్ చేసి విషయం చెప్పారు.
అప్పటికే ఆయన కర్నూలుకు బయలుదేరి ఉన్నా ప్రయాణాన్ని విరమించుకుని అరగంటలోనే ఆస్పత్రికి చేరుకున్నారు. అందరూ కలిసి సుమారు నాలుగు గంటలకు పైగా శ్రమించి ఆపరేషన్‌ను విజయవంతం చేశారు. ఆ తర్వాత రెండు వారాల పాటు తల్లి పరిస్థితి విషమంగానే ఉండటంతో లేబర్ వార్డులో చికిత్స కొనసాగించారు. ప్రస్తుతం తల్లీబిడ్డ క్షేమంగా ఉన్నారు. ఈ ఆపరేషన్ విజయవంతం వెనుక యురాలజిస్ట్ డాక్టర్ హరినాథ్‌రెడ్డి పాత్ర కీలకమని, ప్రైవేట్ డాక్టర్ అయి ఉండీ ఎలాంటి లాభాపేక్ష లేకుండా శస్త్రచికిత్సలో పాలుపంచుకున్నారని సూపరింటెంటెండ్ డాక్టర్ జగన్నాథ్ తెలిపారు. కాగా.. తనకు, తన బిడ్డకు ప్రాణం పోసిన వైద్యులకు పార్వతి కృతజ్ఞతలు తెలిపింది.