అగ్రవర్ణాల నుంచి ప్రాణహాని
అగ్రవర్ణాల నుంచి ప్రాణహాని
Published Mon, Sep 19 2016 10:25 PM | Last Updated on Tue, Aug 21 2018 7:17 PM
– పోలీస్‌దర్బార్‌ను ఆశ్రయించిన కొత్తకోట దళితులు
కర్నూలు: అగ్రకులాల వర్గానికి చెందిన కొందరు తమపై దాడులు చేస్తున్నారని, వారి నుంచి ప్రాణహాని ఉన్నందున రక్షణ కల్పించాలని కోరుతూ డోన్ మండలం కొత్తకోట గ్రామానికి చెందిన దళిత కుటుంబాలు ఎస్పీ ఆకే రవికృష్ణకు ఫిర్యాదు చేశారు. సోమవారం కమాండ్ కంట్రోల్ సెంటర్‌లో పోలీస్ ప్రజాదర్బార్ కార్యక్రమాన్ని ఎస్పీ నిర్వహించారు. ఉదయం 9 నుంచి 10 గంటల వరకు డయల్ యువర్ ఎస్పీ కార్యక్రమంలో భాగంగా సెల్ నం.94407 95567కు జిల్లా నలుమూలల నుంచి వచ్చిన ఫిర్యాదులను నోట్ చేసుకున్నారు. కమాండ్ కంట్రోల్ సెంటర్‌కు నేరుగా వచ్చిన వారి నుంచి వినతులను స్వీకరించి సమస్యలను అడిగి తెలుసుకున్నారు.
ఎస్పీకి వచ్చిన ఫిర్యాదుల్లో కొన్ని...
– తనపై అనుమానంతో భర్త రామానాయుడుతో పాటు అత్త, మామ, ఆడబిడ్డలు వేధిస్తున్నారని పుఠాన్‌దొడ్డి గ్రామానికి చెందిన రేవతి ఫిర్యాదు చేశారు. మానసికంగా, శారీరకంగా హింసించడమే కాక అదనపు కట్నం తీసుకురావాలని ఒత్తిడి చేస్తున్నారని ఫిర్యాదులో పేర్కొన్నారు. తన భర్తకు కౌన్సెలింగ్ ఇచ్చి కాపురం చక్కబెట్టాలని రేవతి ఎస్పీని వేడుకున్నారు.
– రైతుల నుంచి ధాన్యం తీసుకుని సొమ్మును చెల్లించకుండా ఇబ్బంది పెడుతున్నాడని టి.లింగందిన్నె గ్రామానికి చెందిన నరసింహారెడ్డి ఎస్పీకి ఫిర్యాదు చేశారు. నాగలాపురం గ్రామానికి చెందిన దూదేకుల నాగన్న రైతుల నుంచి వరి ధాన్యాన్ని కొనుగోలు చేసి అమ్ముకుని సొంత ఆస్తులు కూడబెట్టుకుంటూ ఆ సొమ్మును రైతులు చెల్లించకుండా రెండున్నర సంవత్సరాల నుంచి ఇబ్బందులకు గురిచేస్తున్నాడని ఆయన వినతిపత్రంలో పేర్కొన్నారు. రైతులకు రావలసిన సొమ్మును ఇప్పించి దగాకు పాల్పడిన నాగన్నపై చర్యలు తీసుకోవాల్సిందిగా నరసింహారెడ్డి వినతిపత్రంలో కోరారు.
డయల్ యువర్ ఎస్పీ, పోలీస్ ప్రజాదర్బార్‌కు వచ్చిన ఫిర్యాదులన్నిటిపై విచారణ జరిపి చట్టప్రకారం చర్యలు తీసుకుంటామని ఎస్పీ హామీ ఇచ్చారు. కార్యక్రమంలో సీఐ పార్థసారథి పాల్గొన్నారు.
Advertisement
Advertisement