వైఎస్ జగన్ దృష్టికి దళితులపై దాడి ఘటన
పోలీసు హింసపై విచారణకు జాతీయ ఎస్సీ కమిషన్ ఆదేశం
సాక్షి, హైదరాబాద్/తెనాలి: గుంటూరు జిల్లా చుండూరు మండలం అంబేడ్కర్ నగరంలో పోలీసులు బెల్టులతో ఇష్టా రాజ్యంగా కొట్టిన ఘటనను బాధిత దళితులు మంగళవారం వైఎస్సార్‌సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి దృష్టికి తీసుకెళ్లారు. తెనాలిలోని జిల్లా ప్రభుత్వ వైద్యశాలలో చికిత్స పొంది సోమవారం డిశ్చార్జి అరుున మేడికొండు రవి, కర్రి ప్రేమ్‌చంద్ తదితరులు మంగళవారం హైదరాబాద్‌లోని పార్టీ కేంద్ర కార్యాలయంలో వైఎస్ జగన్‌ని కలసి పోలీసుల దాడితో అరుున గాయాలను చూపించారు. తమకు నిలువ నీడ లేకుండా చేసేలా భయబ్రాంతుల్ని చేస్తున్నారని వాపోయారు.
ఈ దాడి ఘటనపై తీవ్రంగా స్పందించిన వైఎస్ జగన్.. దాడి దుర్మార్గమని అన్నారు. దీనిపై ఎస్సీ కమిషన్, మానవ హక్కుల కమిషన్లలో కేసు వేయాలని పార్టీ ఎస్సీ సెల్ అధ్యక్షుడు మేరుగ నాగార్జునను ఆదేశించారు. అనంతరం బాధితులు నాగార్జున వెంట ఎస్సీ కమిషన్, మానవహక్కుల సంఘ కార్యాలయాలకు వెళ్లి, తమకు జరిగిన అన్యాయంపై విచారించి న్యాయం చేయాలని కోరుతూ అర్జీలిచ్చారు. గత నెల 30వ తేదీ నుంచి జరిగిన సంఘటనల వివరాలను నాగార్జున కమిషనుకు వివరించారు. దీనిపై స్పందించిన కమిషన్ గుంటూరు జిల్లా కలెక్టరు, ఎస్పీకి వెంటనే సమాచారం పంపుతూ ఆ కాపీని బాధితులకు అందజేసింది. బాధితుల ఆరోపణలపై విచారణ చేసి వెంటనే నివేదిక పంపాలని రూరల్ ఎస్పీ నారాయణ్‌నాయక్‌కు లేఖ పంపింది.