విశాఖ ప్రజలకు నిరంతర సేవలందిస్తా
విశాఖ ప్రజలకు నిరంతర సేవలందిస్తా
Published Sun, Aug 14 2016 5:10 PM | Last Updated on Mon, Sep 4 2017 9:17 AM
పేదల పరిస్థితులు నన్ను కదిలించాయి
తన శివార్చన ఫలితమే విశాఖకు హుద్‌హుద్ గండం నుంచి రక్షణ
రాజ్యసభ సభ్యుడు టి.సుబ్బరామిరెడ్డి
ఏయూక్యాంపస్: సేవ చేయడంలోనే పూర్తి సంతృప్తి లభిస్తుందని రాజ్యసభ సభ్యుడు టి.సుబ్బరామి రెడ్డి అన్నారు. ఆదివారం ఉదయం ఏయూ స్నాతకోత్సవ మందిరంలో టీఎస్‌ఆర్ ఉచిత వైద్య సేవా కార్యక్రమం ద్విదశ వార్షికోత్సవాన్ని ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ విశాఖ నగరంలోని మురికి వాడల ప్రజల జీవనం తనను కదిలించిందన్నారు. వీరికి ఇంటి వద్దకే వైద్యం అందించాలనే లక్ష్యంతో దీన్ని నిర్వహిస్తున్నామన్నారు. కేజీహెచ్ అభివృద్ధికి, క్యాన్సర్ ఆసుపత్రి ఏర్పాటుకు తాను పూర్తిస్థాయిలో పనిచేశానన్నారు. తాను ఏటా సముద్ర తీరంలో చేస్తున్న శివార్చన ఫలితంగా హుద్‌హుద్ ప్రభావం నుంచి విశాఖ సురక్షితంగా బయట పడిందన్నారు. విశాఖ ప్రజలకు పూర్తిస్థాయిలో నిరంతర సేవలు అందిస్తానన్నారు. ప్రజలందరూ సంతోషంగా ఉండటమే లక్ష్యంగా పనిచేస్తున్నానని చెప్పారు. పిఠాపురం స్వామీజీ డాక్టర్ ఉమర్ ఆలీషా మాట్లాడుతూ ఆధ్యాతిక, సామాజిక సేవను రెండు కళ్లుగా భావించి సుబ్బరామిరెడ్డి ఎనలేని సేవలు అందిస్తున్నారని కొనియాడారు. మతాలకు, రాజకీయాలకు అతీతంగా ఈ సేవలు సాగడం శుభపరిణామమన్నారు. సామాజిక సేవ మహాశక్తిని అందిస్తుందన్నారు. సాయం పొందిన వారు అందించే ఆశీస్సులే మనతో ఎప్పుడూ ఉంటాయన్నారు.
ఏయూ వీసీ ఆచార్య జి.నాగేశ్వరరావు మాట్లాడుతూ కళలు, వైద్య సేవలతో సుబ్బరామిరెడ్డి విశాఖ ప్రజలకు మన్ననలు అందుకున్నారన్నారు. తమ వర్సిటీలో రాజనీతిశాస్త్రం, ఎంబీఏ విద్యార్థులనుద్దేశించి ప్రసంగించాలని కోరారు.
మాజీ శాసన సభ్యుడు ద్రోణంరాజు శ్రీనివాస్ మాట్లాడుతూ సుబ్బరామిరెడ్డికి విశాఖ నగరం మానస పుత్రికగా నిలుస్తుందన్నారు. విశాఖలో ఆధ్యాత్మిక పునాదులు వేసిన వ్యక్తిగా ఆయన నిలుస్తారన్నారు. మానవతావాదిగా అందరి హదయాలను గెలుచుకున్నారన్నారు. వైద్య విశ్వవిద్యాలయం ఉప కులపతి ఆచార్య టి.రవి రాజు మాట్లాడుతూ ఉదాత్తమైన ఆదర్శంగా విద్య, సాంస్కతిక, ఆధ్యాత్మిక రంగాలో విశేష సేవలు అందిస్తున్నారన్నారు. ఏయూ రిజిస్ట్రార్ ఆచార్య వి.ఉమా మహేశ్వరరావు మాట్లాడుతూ కేన్సర్ ఆస్పత్రి విశాఖ రావడానికి టీఎస్సార్ ఎంతో కషిచేశారంటూ అభినందించారు. ఏయూ పాఠశాలల భవనాల నిర్మాణానికి సైతం నిధులను అందించి ఏయూపై తన అభిమానాన్ని చాటుకున్నారన్నారు.
కార్యక్రమంలో కాంగ్రెస్ నగర అధ్యక్షుడు బెహరా భాస్కరరావు, డి.వరదా రెడ్డి, ఎస్.కె భాషా, కేజీహెచ్ సూపరింటెండెంట్ డాక్టర్ మధుసూధన్ బాబు, మంత్రి రాజశేఖర్, మాజీ శాసన సభ్యుడు చింతలపూడి వెంకటరామయ్య తదితరులు పాల్గొన్నారు.
అవార్డుల ప్రదానం....
ఈ సందర్భంగా కేజీహెచ్ డిప్యూటీ సూపరిండెంట్ డాక్టర్ జి.అర్జున్, డాక్టర్ సి.ఎం.ఎ. జహీర్ అహ్మద్, డాక్టర్ బి.ఆశాలత, డాక్టర్ కె.ఎస్.ఎన్ మూర్తిలకు టీఎస్‌ఆర్ అవార్డులను ప్రదానం చేశారు. ఏయూ వీసీ నాగేశ్వరరావు, డాక్టర్ ఉమర్ ఆలీషా, డాక్టర్ రవిరాజులను ఈ సందర్భంగా సుబ్బరామిరెడ్డి సత్కరించారు.
Advertisement
Advertisement