లారీల బంద్ ఉద్ధృతం
- ఇన్సూరెన్స్ కంపెనీలతో చర్చలు విఫలం
- 8 నుంచి దేశవ్యాప్త బంద్
- కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల నిరంకుశ వైఖరిపై ఆగ్రహం
నెల్లూరు(టౌన్): దక్షిణాది రాష్ట్రాల ట్రాన్స్‌పోర్ట్ అసోసియేషన్ చేపట్టిన బంద్ సోమవారానికి ఐదో రోజుకు చేరుకుంది. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ విధానాలకు వ్యతిరేకంగా చేపట్టిన సమ్మెపై సానుకూల స్పందన రాకపోవడంపై లారీ యజమానులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇన్సూరెన్స్ కంపెనీలతో సోమవారం లారీ అసోసియేషన్ నాయకులు జరిపిన చర్చలు విఫలమయ్యాయి. ఈనెల 8 నుంచి ఆల్ ఇండియా ట్రాన్స్‌పోర్ట్ అసోసియేషన్ దేశవ్యాప్త బంద్‌కు పిలుపునిచ్చింది. ఇప్పటి వరకు పాలు, గుడ్లు, కూరగాయలు, చాపలు, రొయ్యలు, నిత్యావసర సరుకులు సరఫరా చేసే రవాణా వాహనాలకు సమ్మె నుంచి మినాహాయింపు ఇచ్చారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు స్పందించకపోవడంతో వాటిని కూడా నిలిపివేయాలని లారీ యజమానుల అసోసియేషన్ నాయకులు నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. లారీ యజమానులు అన్ని రకాల వాహనాలను నిలిపివేయాలని నిర్ణయంతో నిత్యావసర సరుకుల ధరలు పెరిగే అవకాశం ఉంది.
జిల్లాలో రూ.12.5 కోట్లు నష్టం లారీ యజమానుల సంఘం సమ్మె పిలుపుతో జిల్లాలో రూ.12.5 కోట్ల నష్టం వాటిల్లినట్లు చెబుతున్నారు. జిల్లావ్యాప్తంగా 4500కు పైగా చిన్న పెద్ద రవాణా వాహనాలు ఉన్నాయి. రోజుకు సరాసరి రూ.2.5 కోట్లు వీటి ద్వారా ఆదాయం లభిస్తుంది. గత 5 రోజులుగా లారీల సమ్మె నిర్వహిస్తున్నారు. çసమ్మె కారణంగా పనిలేక డ్రైవర్లు, క్లీనర్లతోపాటు కూలీలు ఇంటిపట్టునే ఉంటున్నారు.
సమ్మెను తీవ్రతరం చేస్తాం.
గత ఐదు రోజులుగా సమ్మె చేస్తున్న కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల నుంచి స్పందన కరువైంది. ఈనెల 8 నుంచి అన్ని రాష్ట్రాల లారీ అసోసియేషన్ సంఘాలు సమ్మెలో పాల్గొననున్నాయి. పాలు, గుడ్లు, కూరగాయలు, పచ్చి సరుకులు తరలించే వాహనాలను కూడా నిలిపివేయాలని నిర్ణయం తీసుకున్నాం.
– గోపాలనాయుడు, నారాయణ,
ఏపీ లారీ యజమానులు సంఘం అధ్యక్ష, కార్యదర్శులు