లారీ ఢీకొని మహిళ దుర్మరణం
► మరో వ్యక్తికి తీవ్రగాయాలు
పాలకొండ: మండలంలోని మంగళాపురం గ్రామ కూడలి వద్ద ఆదివారం జరిగిన రోడ్డు ప్రమాదంలో లక్ష్మీపురం గ్రామానికి చెందిన ముంజు అక్కమ్మ(40) మృతి చెందింది. వివరాలిలా ఉన్నాయి. లక్ష్మీపురం గ్రామానికి చెందిన అక్కమ్మ.. భర్త చనిపోవడంతో ఇద్దరి పిల్లలతో జీవనం సాగిస్తోంది. ఆదివారం కావడంతో మంగళాపురం గ్రామంలో ఉన్న తన చెల్లి ఎనేతల రమణమ్మ ఇంటికి బియ్యం, ఇతర సామగ్రి తీసుకువెళ్లింది.
మధ్యాహ్నం వరకూ అక్కడే ఉండి భోజనం చేసి, తిరుగు ప్రయాణమైంది. బస్టాప్ వరకూ వస్తానంటూ చెల్లి రమణమ్మ కుమారుడు మురళి అనడంతో, ఇద్దరూ కలసి ద్విచక్ర వాహనంపై బయల్దేరారు. పాలకొండ–రాజాం రహదారిపైకి వచ్చేసరికి రాజాం వెళ్తున్న లారీ బలంగా ఢీకొంది. ఈ ప్రమాదంలో లారీ చక్రాల కింద పడి అక్కమ్మ ముద్దలా మారింది. అక్కడికక్కడే ప్రాణాలు వదిలింది. అక్కడి నుంచి 50 మీటర్ల దూరం వరకూ లారీ దూసుకుపోయి ఆగింది. ద్విచక్రవాహనం లారీ కింది భాగంలో ఉండిపోయింది. బయటకు తుళ్లిపోయిన మురళికి కాలు విరిగింది. అతను ప్రాణాపాయం నుంచి బయటపడ్డాడు. వెంటనే అతనిని రాజాం కేర్ ఆస్పత్రికి తరలించారు. ఎస్సై ఎం.చంద్రమౌళి సంఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించారు. మృతదేహన్ని పోస్టుమార్టం నిమిత్తం ఏరియా ఆస్పత్రికి తరలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై తెలిపారు.