గార్లదిన్నె : జిల్లాను కరువు కమ్ముకొని వ్యవసాయాన్ని సంక్షోభంలోకి నెట్టిందని, అతివృష్టి, అనావృష్టి ప్రభావం వల్ల రైతుల బతుకులు దయనీయంగా మారాయని ఏపీసీసీ ఉపాధ్యక్షుడు, మాజీ మంత్రి శైలజానాథ్ అన్నారు. మండల పరిధిలోని ఇల్లూరు, కల్లూరు, గుడ్డాలపల్లి, కనంపల్లి, తిమ్మంపేట గ్రామాల్లో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో కరువుపై రైతులతో ఆదివారం ముఖాముఖీ కార్యక్రమం నిర్వహించారు. ఆయా గ్రామాల్లో రైతులు సమస్యలను శైలజానాథ్ దృష్టికి తీసుకొచ్చారు. అనంతరం ఆయన విలేకరులతో మాట్లాడుతూ మూడేళ్లుగా ఆయకట్టుకు నీరు రాకపోవడంతో రైతుల పరిస్థితి దయనీయంగా ఉందన్నారు. జిల్లాలో ఎప్పుడూ లేనివిధంగా కరువు తాండవిస్తోందన్నారు.
భూగర్భజలాలు అడుగంటి తాగునీరు కరువయ్యాయన్నారు. జిల్లాలోనే పంటలు సమృద్ధిగా పండే గార్లదిన్నె మండలంలోని ఇల్లూరు గ్రామంలో వరి, పండ్లతోటలు నీరులేక ఎండిపోయాయని తెలిపారు. దీంతో గ్రామాల్లో ప్రజలు ఇప్పటికే 20 శాతం మంది వలస పోయారన్నారు. అదేవిధంగా రైతులు కూలీలుగా మారారని ఆవేదన వ్యక్తం చేశారు. ఉపాధి హామీ పథకం కింద పనులు కల్పించినా బిల్లులు రాక కూలీల పరిస్థితి దారుణంగా ఉందన్నారు. ఉపాధి బిల్లులు వచ్చినా బ్యాంకుల్లో అప్పులోకి జమ చేస్తున్నారని తెలిపారు. కరువు నివారణ చర్యల కోసం ప్రభుత్వంపై ఒత్తిడి తెస్తామన్నారు. కాంగ్రెస్ మండల కన్వీనర్ నాగరాజు, నగర అధ్యక్షుడు దాదా గాంధీ, బీసీ సెల్ అధ్యక్షుడు రామాంజనేయులు, తదితరులు పాల్గొన్నారు.
సంక్షోభంలో రైతాంగం
Published Sun, Apr 16 2017 10:59 PM | Last Updated on Wed, Oct 3 2018 7:31 PM
Advertisement
Advertisement