- సీపీఐ నేత గుండా మల్లేశ్
లాఠీలు, తూటాలు ప్రజా ఉద్యమాలను ఆపలేవు
Published Mon, Jul 25 2016 11:38 PM | Last Updated on Mon, Sep 4 2017 6:14 AM
కరీంనగర్ : లాఠీలు, తూటాలతో ప్రజా ఉద్యమాలను అణిచివేయాలనుకోవడం మూర్ఖత్వమని సీపీఐ రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యుడు, మాజీ శాసనసభాపక్ష నేత గుండా మల్లేశ్ అన్నారు. గౌరవెల్లి, గండిపల్లి, అనంతగిరి రిజర్వాయర్ల భూనిర్వాసితులకు 2013 చట్టం ప్రకారం భూసేకరణ చేపట్టాలని, అర్‌అండ్‌ఆర్ ప్యాకేజీ అమలు చేయాలని డిమాండ్ చేస్తూ సీపీఐ ఆధ్వర్యంలో సోమవారం కరీంనగర్ కలెక్టరేట్‌ను ముట్టడించారు. గుండా మల్లేశ్ మాట్లాడుతూ జీవో నంబర్ 123 ద్వారా రైతుల నోట్లో మట్టి కొట్టే చర్యలను సాగనివ్వబోమని హెచ్చరించారు. ప్రాణాలు పోయినా భూనిర్వాసితులకు అండగా ఉంటామన్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్ పోలీసులతో రాజ్యహింస కొనసాగించడం అప్రజాస్వామికమన్నారు. మల్లన్నసాగర్‌లో భూనిర్వాసితులపై లాఠీచార్జీ చేయడం హేయమైన చర్య అని అభివర్ణించారు. ప్రభుత్వానికి కౌంట్‌డౌన్ మెుదలైందని, అప్రజాస్వామిక పోకడలతో నియంత పాలన కొనసాగించిన ప్రభుత్వాలు మనుగడ సాగించిన దాఖలాలు లేవని అన్నారు. 2013 భూసేకరణ పునరావాస చట్టాన్ని అమలు చేయాలని డిమాండ్ చేశారు. సీపీఐ జిల్లా కార్యదర్శి కోమటిరెడ్డి రాంగోపాల్‌రెడ్డి, భూనిర్వాసితులు పాల్గొన్నారు.
Advertisement
Advertisement