కరీంనగర్: పల్లె జీవనం.. పడచుల కట్టుబొట్టు.. భారతీయ సంస్కృతి.. ఆయన చిత్రాలకు మూలాధారం. తోట వైకుంఠం కుంచె పడితే చిత్రాలకు జీవం వచ్చి, కాన్వాస్‌పై నాట్యం చేస్తాయి. రాజన్న సిరిసిల్ల జిల్లా బోయినపల్లి మండలం బూర్గుపల్లిలో జన్మించిన వైకుంఠం జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు తెచ్చుకున్నాడు. ఏడేళ్ల క్రితం గీసిన చిత్రానికి ఇటీవల ముంబయిలోని ఆస్తాగురు యాక్షన్ హౌస్ నిర్వహించిన వేలంలో రూ.1,41,35,220 ధర పలకడం విశేషం.
బూర్గుపల్లిలో విద్యాభ్యాసం..
బూర్గుపల్లిలో 1942లో జన్మించిన తోట వైకుంఠం స్వగ్రామంలోనే ప్రాథమిక విద్య పూర్తి చేశా రు. బోయినపల్లి, శాత్రాజ్‌పల్లి, వేములవాడ, సిరి సిల్లలో ఉన్నత విద్య చదివారు. హైదరాబాద్‌లోని కాలేజ్ ఆఫ్ ఫైన్ ఆర్ట్స్‌లో చిత్రలేఖనం పూర్తి చేశా రు. అనంతరం మహారాజ సయాజీరావు యూనివర్సిటీ ఆఫ్ బరోడాలో ప్రముఖ చిత్రకళా కారుడు సుబ్రమణియన్ దగ్గర శిష్యరికం చేశారు.
రంగుల ఆయన ప్రత్యేకత..
డస్కీస్కిన్‌తో మహిళల చిత్రాలు గీయడం ఆయన ప్రత్యేకత. సాదాగా కనిపించే మహిళలు రూపం ఆయన చిత్రంగా మలిస్తే అందంగా కనిపిస్తారు. ఆయన గీసిన అందమైన మహిళల చిత్రాలను సిరిసిల్ల చీరెలుగా అభివర్ణిస్తారు.
అమ్మ.. మహిళలే స్ఫూర్తి!
చిత్రకారుడిగా గుర్తింపు పొందడానికి అమ్మ స్ఫూర్తి అని వైకుంఠం చెబుతుంటారు. చిన్నప్పుడు గ్రామంలో చిందు కళాకారులు నాటకాలు ప్రదర్శిస్తుంటే వారు వేసిన వేశాలకు తగినట్లుగా మేకప్ వేసి రంగులు దిద్దే అలవాటు ఉండేదని తెలిపారు. అలా చిన్నప్పటి నుంచే రంగులు, బొమ్మలు గీయడంపై అనురక్తి కల్గిందని చెబుతుంటారు. ఎరుపు, ఆకుపచ్చ, నీలం రంగులు తనకు ఇష్టమని.. తన చిత్రాలలోనూ ఎక్కువగా వాటినే వాడుతానని తెలిపారు.
ఎన్నో అవార్డులు!
భోపాల్‌లో రెండేళ్లకోసారి ఇచ్చే భారత్ భవన్ అవార్డుతోపాటు భారత ప్రభుత్వం అందించే జాతీయ అవార్డు, ఉమ్మడి రాష్ట్రంలో హంస అవార్డు అందుకున్నారు. తెలంగాణ రాష్ట్రంలో ఉత్తమ చిత్రకళాకారుడిగా అవార్డు లభించింది. దాసి, మాభూమి చిత్రాలకు ఆర్ట్ డైరెక్టర్‌గా పనిశారు. దాసి చిత్రానికి ఉత్తమ ఆర్ట్ డైరెక్టర్‌గా జాతీయ అవార్డు అందుకున్నారు.
వైకుంఠంపై పలు డాక్యుమెంటరీలు..
వైకుంఠంపై పలు డాక్యుమెంటరీలు వచ్చాయి. 2015లో కోల్‌కతాకు చెందిన పార్థూరాయ్ డాక్యుమెంటరీ నిర్మించారు.
గ్రామాభివృద్ధికి విరాళాలు..
స్వగ్రామం బూర్గుపల్లిలో పాఠశాల అభివృద్ధికి రూ.40 వేలు విరాళంగా అందించారు. యువత చదువుకుంటేనే మంచి భవిష్యత్ ఉంటుందని తెలుపుతున్నారు.
మాకు గర్వంగా ఉంది..
అంతర్జాతీయ చిత్రాకారుడిగా పేరు పొందిన తోట వైకుంఠం మా గ్రామస్తుడని చెప్పుకోవడం గర్వంగా ఉంది. ఆయనతో మా గ్రామానికి పేరు రావడం గొప్పగా భావిస్తున్నాం. ముంబయిలో జరిగిన వేలంలో ఆయన గీసిన చిత్రానికి కోటిన్నర పలకడం చాలా సంతోషంగా ఉంది. – కమటం అంజయ్య,మాజీ సర్పంచ్, బూర్గుపల్లి
చిందు నాటకాలు ఇష్టపడేవారు..
వైకుంఠం సారు చిన్నప్పుడు మా గ్రామంలో చిందునాటకాలు వేసేవారు. పదేళ్ల కింద గ్రామానికి వచ్చినప్పుడు పాతతరం చిందు కళాకారులతో వేశాలు వేయించి డాక్యుమెంటరీ తీశారు. చిందుకళను ఇష్టపడేవారు. – గజ్జెల సాయిలు,చిందు కళాకారుడు
గ్రామాభివృద్ధికి తోడ్పాటు..
తోట వైకుంఠం గ్రామంలో యువతకు స్ఫూర్తినిచ్చే వ్యక్తి. స్వగ్రామంలోని పాఠశాల అభివృద్ధికి గతంలో రూ.40 వేలు సాయం చేశారు. ఆయన గీసిన చిత్రాలతో మా ఊరికి పేరు రావడం గర్వంగా ఉంది. – పెరుక మహేశ్, యువకుడు
Comments
Please login to add a commentAdd a comment