
అంజలి(ఫైల్)
సాక్షి, సిటీబ్యూరో: వ్యక్తిగత రుణాల పేరుతో ప్రభుత్వ ఉద్యోగులకు టోకరా వేసిన కేసులో సైబర్ క్రైమ్ పోలీసులు అరెస్టు చేసిన అంజలి అసలు పేరు మాధవిగా తేలింది. ఈమెపై గతంలోనూ రెండు కేసులు నమోదై ఉన్నట్లు వెలుగులోకి వచ్చింది. మాధవితో పాటు ఈ నేరానికి సహకరించిన నర్సింహ్మారావును బుధవారం పట్టుకుని రిమాండ్‌కు తరలించిన విషయం విదితమే. వీరు వరంగల్‌లోనూ మోసాలకు పాల్పడినట్లు అనుమానిస్తున్న పోలీసులు ఆ కోణంలోనూ దర్యాప్తు చేస్తున్నారు.
రంగారెడ్డి జిల్లా చినచీర్లపల్లికి చెందిన వివాహిత బి.మాధవి, వారాసిగూడకు చెందిన జి.నర్సింహ్మారావు కలిసి ప్రభుత్వ ఉద్యోగులకు వ్యక్తిగత రుణాలు ఇప్పిస్తామంటూ పత్రికల్లో ప్రకటనలు ఇచ్చారు. రుణం తీసుకొనేందుకు ఎవరైనా ఫోన్ చేస్తే.. బజాజ్ ఫైనాన్స్ సంస్థ నుంచి రుణాలు ఇస్తామంటూ అంజలి నమ్మబలికేది. రుణం ఇవ్వడంలో ఓ చిత్రమైన లాజిక్ చెప్పేది. నాగోల్‌లో ఉన్న బజార్ ఎలక్ట్రానిక్స్ షోరూమ్ నుంచి మార్జిన్ మనీ చెల్లించడం ద్వారా సులభ వాయిదాల పద్ధతిలో వస్తువులు ఖరీదు చేయాలని, తర్వాత వాటిని తమకు విక్రయిస్తే నగదు ఇస్తామని, షోరూమ్‌కు సులభవాయిదాల్లో మొత్తం చెల్లించవచ్చని వల వేసేది.
అలా చేసిన ప్రభుత్వ ఉద్యోగుల నుంచి ఎలక్ట్రానిక్ వస్తువులు తీసుకుని మోసం చేసేవారు. ఓ బాధితుడి ఫిర్యాదుతో కేసు నమోదు చేసిన సైబర్ క్రైమ్ పోలీసులు నిందితులు అంజలి, నర్సింహ్మారావును అరెస్టు చేశారు. అరెస్టు సమయంలో నిందితురాలు తన పేరును అంజలిగా చెప్పింది. లోతుగా ఆరా తీసిన సైబర్‌క్రైమ్ పోలీసులు ఆమె అసలు పేరు మాధవిగా గుర్తించారు. 2013లోనూ ఈమెపై సీసీఎస్‌లో రెండు కేసులు నమోదు కావడంతో అరెస్టు చేసినట్లు తేలింది.
అప్పట్లో ఓ యాడ్ ఏజెన్సీ ముసుగులో మల్టీ లెవల్ మార్కెటింగ్ తరహాలో వందల మందిని మోసం చేసిందని సైబర్ క్రైమ్ ఏసీపీ కేసీఎస్ రఘువీర్ తెలిపారు. ఈ కేసుల్లోనూ అభియోగపత్రాలు దాఖలు చేయడానికి సన్నాహాలు చేస్తున్నామన్నారు. మరోపక్క తాజా కేసుకు సంబంధించిన పూర్తి వివరాలతో పాటు బాధితుల వివరాలూ సేకరించడానికి మాధవిని న్యాయస్థానం అనుమతితో కస్టడీలోకి తీసుకొనేందుకు దర్యాప్తు అధికారి ఇన్‌స్పెక్టర్ రవికిరణ్ సన్నాహాలు చేస్తున్నారు. ఈమె చేతిలో మోసపోయిన వారు ఎవరైనా ఉంటే సైబర్ క్రైమ్ పోలీసులను ఆశ్రయించాలని కోరారు.