
మాగంటి సై.. గోకరాజు నో
ఏలూరు : కోడిపందేల నిర్వహణపై జిల్లాకు చెందిన ఇద్దరు ఎంపీలు వేరు వేరు అభిప్రాయాలను వ్యక్తం చేశారు. కాటన్ పార్కులో జరిగిన సభలో బహిరంగంగానే వారి అభిప్రాయాలను స్పష్టం చేశారు. నరసాపురం ఎంపీ గోకరాజు గంగరాజు మాట్లాడుతూ కోడిపందెం ఆటకు తాను పూర్తి వ్యతిరేకమన్నారు. దీనివల్ల కష్టపడి సంపాదించిన డబ్బు అంతా పోగొట్టుకోవలసి వస్తుందన్నారు. జూదం అసలు ఆడవద్దని చెప్పారు. వ్యసనాలకు ఖర్చుపెట్టడం సరికాదన్నారు.
తాను గాంబ్లింగ్‌కు పూర్తి వ్యతిరేకమని చెప్పారు. సంపాదించండి, ఎవరికైనా సహాయం చేయండి అంటూ గోకరాజు తన మనోభావాన్ని వ్యక్తం చేశారు. కోడిపందేలు ఆడవద్దని చెబితే తనకు ఓట్లు పోతాయన్న భయం లేదన్నారు. ఇలా చెప్పడం వల్ల 60 శాతం ఓట్లు ఉన్న మహిళలు తనవైపే ఉంటారని చెప్పారు. ఏలూరు ఎంపీ మాగంటి వెంకటేశ్వరరావు(బాబు) మాట్లాడుతూ సంప్రదాయంగా వస్తున్న కోడిపందేలు ఆడటం తప్పేమీ కాదన్నారు.
ఆ నాలుగు రోజులూ కోడి పందేలు ఆడుకోవాలన్నారు. డింకీలు ఆడుకోండి అంటూ కోడిపందేల రాయుళ్లకు హితబోధ చేశారు. జూదం ఆడవద్దని చెప్పారు. ఎంపీల వేరు వేరు అభిప్రాయాలను వ్యక్తంచేయడంతో హాజరైన ప్రజలు, ప్రజాప్రతినిధులు, అధికారులు అవాక్కయ్యారు.