మహిళల సమస్యల పరిష్కారంలో విఫలం
పిఠాపురం టౌన్:
రాష్ట్రం లో మహిళలు ఎదుర్కొంటున్న సమస్యలను పరిష్కరించడంలో ప్రభుత్వం విఫలమైందని ఏపీ మహిళా సంఘం (ఐద్వా) మహాసభలో రాష్ట్ర అధ్యక్షురాలు బి.ప్రభావతి ఆరోపించారు. స్థానిక సూర్యరాయ గ్రంథాలయంలోని చెలికాని భావనరావు సభాసదన్‌లో శుక్రవారం జరిగిన ఈమహాసభలకు కుంచే మణి, కూరాకుల వెంకటలక్ష్మి అధ్యక్షత వహించారు. ముఖ్యఅతిథి ప్రభావతి మాట్లాడుతూ మహిళలపై జరుగుతున్న హింస, హత్యాచారాలు, వరకట్న వేధింపులను అరికట్టడంలో ప్రభుత్వానికి చిత్తశుద్ధి లోపించిందన్నారు. మహిళల సంక్షేమం కోసం రూపొందించిన చట్టాలని రాజకీయ నాయకులు తమ ఇష్టానుసారంగా మార్చుకుంటున్నారని ఆరోపించారు. డ్వాక్రా సంఘాల రుణాన్ని ఒకే సారి మాఫీ చేయాలని, నిర్భయ చట్టాన్ని పటిష్టంగా అమలు చేయాలని, మద్యం బెల్టు దుకాణాలను తక్షణమే తొలగించాలని, అధిక ధరలు నియంత్రించాలని, రేషన్‌షాపుల ద్వారా 14 రకాల నిత్యావసర వస్తువులు సరఫరా చేయాలని సభలో తీర్మానించారు. స్థానిక ఆదర్శ విద్యాలయ కరస్పాండెంట్ బండి భార్గవినాయుడు మహిళల సమస్యలపై మాట్లాడారు. ఐద్వా జిల్లా కార్యదర్శి సీహెచ్.రమణి, సహాయ కార్యదర్శి సుభాషిణి, నాయకులు భవాని, రాముమణి, వివిధ ప్రజా సంఘాల నాయకులు పాల్గొన్నారు.