సోషల్ మీడియాను బ్రహ్మాస్త్రంగా చేసుకోండి | make social media a powerful weapon, says kotamreddy sridhar reddy | Sakshi
Sakshi News home page

సోషల్ మీడియాను బ్రహ్మాస్త్రంగా చేసుకోండి

Published Tue, Jun 14 2016 2:31 PM | Last Updated on Wed, Jul 25 2018 4:09 PM

సోషల్ మీడియాను బ్రహ్మాస్త్రంగా చేసుకోండి - Sakshi

సోషల్ మీడియాను బ్రహ్మాస్త్రంగా చేసుకోండి

చంద్రబాబు రాజకీయ అఘోరా
కోట్లాది రూపాయలు ఇచ్చి ఎమ్మెల్యేలను ఎందుకు కొంటున్నారు
2019లో జగన్ సునామీ ముందు టీడీపీ కొట్టుకుపోవడం ఖాయం
వైఎస్ఆర్‌సీపీ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి

విజయవాడ

చంద్రబాబు సాక్షి టీవీ చానల్ గొంతు నొక్కుతున్నారని, ఇలా ఎన్ని గొంతులు నొక్కుతారని నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి ప్రశ్నించారు. అందుకే పార్టీ కార్యకర్తలు, అభిమానులు అందరూ సోషల్ మీడియాను బ్రహ్మాస్త్రంగా మార్చుకోవాలని ఆయన సూచించారు. సోషల్ మీడియా గొంతును చంద్రబాబు కాదు కదా.. ఆయన తండ్రి కూడా నొక్కలేరని తెలిపారు. పార్టీలు మారేవాళ్లను రాజకీయ వ్యభిచారులు, రాజకీయ దొంగలు అని చంద్రబాబే అనేవారని, అలాంటివాళ్లనే కండువాలు కప్పి మరీ పార్టీలోకి తీసుకుంటున్న చంద్రబాబు.. రాజకీయ అఘోరా అని ఆయన మండిపడ్డారు. తాను హజారే కొడుకునని, కేజ్రీవాల్ బావమరిదినని చెప్పుకొనే చంద్రబాబు.. దేనికైనా సై అంటారు గానీ రెండింటికి మాత్రం నై అంటారన్నారు.

రాజధాని భూదందాపై విచారణకు, ఏపీలో జరిగిన ఎమ్మెల్యేల కొనుగోళ్లపై సీబీఐ విచారణకు మాత్రం ఆయన ఒప్పుకోరన్నారు. 10 మంది ఎమ్మెల్యేలను తెచ్చుకున్నంత మాత్రాన 2019లో ఫలితం మారదని స్పష్టం చేశారు. 2014 ఎన్నికలకు ముందు, ఫలితాలు రావడానికి ముందు చంద్రబాబు గెలుస్తారని ఆయనతో పాటు ఆయన వెంట ఉన్న నాయకులు కూడా ఎవరూ అనుకోలేదని.. అందుకే ఆ పార్టీలో ఉన్న చాలామంది వైఎస్ఆర్‌సీపీలో చేరుతామంటూ వచ్చేవారని, కానీ అప్పటికే నియోకజకవర్గాలలో టికెట్లను ఖరారు చేసినందున.. విలువలకు కట్టుబడిన వైఎస్ జగన్ మోహన్ రెడ్డి వారి రాకను నిరాకరించారని కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి చెప్పారు. అప్పట్లో టికెట్ ఇస్తామని చెబితే చాలు.. పార్టీలోకి వచ్చేస్తామంటూ రాయబారాలు, బేరాలు నడిపిన చాలామంది నాయకులు ఇప్పుడు చంద్రబాబు కేబినెట్‌లో మంత్రులుగా ఉన్నారని ఆయన తెలిపారు.

అప్పట్లో టీడీపీ తరఫున పోటీ చేయడానికి అభ్యర్థులు కూడా దొరక్క రా బాబూ.. రా బాబూ అంటూ కనపడినవాళ్లకు అందరికీ కండువాలు కప్పారని ఎద్దేవా చేశారు. మోదీ పుణ్యం, పవన్ కల్యాణ్ పుణ్యం, తమ నాయకుడికి అబద్ధాలు చెప్పడం చేతకాకపోవడం వల్ల నువ్వు గెలిచావని గుర్తుచేశారు. తలకిందులుగా తపస్సు చేసినా 2019లో నిన్ను, నీ కుమారుడిని ఎవరూ కాపాడలేరని స్పష్టం చేశారు. 2019లో తుపాను కాదు.. జగన్ మోహన్ రెడ్డి అనే సునామీ రాబోతోందని చెప్పారు. రాష్ట్రంలో ఉండే కోట్లాది మంది గొంతుక.. వైఎస్ జగన్ మోహన్ రెడ్డి అని తెలిపారు. ఇద్దరు మోసగాళ్లు, ఇద్దరు నియంతలు ఈ తెలుగు రాష్ట్రాలను పాలిస్తున్నారని, వాళ్లిద్దరినీ అడ్డుకోకపోతే ప్రజలను కాపాడే అవకాశం లేదని చెప్పారు. రేపటి రోజు సూర్యుడు తూర్పున ఉదయిస్తాడన్నది ఎంత సత్యమో.. 2019లో జగన్ సీఎం కావడం అంతే సత్యమని అన్నారు. రాబోయే రోజుల్లో చంద్రబాబు మరింత దుర్మార్గంగా వ్యవహరించే అవకాశం ఉందని, కాబట్టి ప్రతి ఒక్క కార్యకర్త సోషల్ మీడియాను బ్రహ్మాస్త్రంగా చేసుకుని, దాన్ని జీవితంలో, రాజకీయ పోరాటంలో ఒక భాగం చేసుకోవాలని తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement