వడదెబ్బకు వ్యవసాయ కూలీ మృతి
అల్లవరం(అమలాపురం) : అల్లవరం మండలం దేవగుప్తం గ్రామం నల్లగుంట ప్రాంతానికి చెందిన అయితాబత్తుల కోటేశ్వరరావు వడదెబ్బకు గురై మంగళవారం మృతి చెందాడు. అదే గ్రామానికి చెందిన ఓ రైతుకు చెందిన పొలానికి ఉదయం వ్యవసాయ పని కోసం వెళ్లాడు. 11.30 గంటలకు పొలంలో వరి పనలు తీస్తుండగా కుప్పకూలిపోయాడు. తోటి కూలీలు కోటేశ్వరరావుని గట్టుకి తీసుకొచ్చి సపర్యలు చేశారు. అప్పటికే తుదిశ్వాస విడిచాడు. మృతదేహాన్ని ఇంటికి తీసుకొచ్చారు. మృతుడికి భార్య, ఇద్దరు కుమారులు, కుమార్తెలు ఉన్నారు. తహసీల్దార్, పోలీస్, ఆరోగ్య సిబ్బందికి స్థానికులు సమాచారం అందించారు. తహసీల్దార్ వడ్డి సత్యవతి, పోలీస్ సిబ్బంది సంఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని పరిశీలించి కుటుంబ సభ్యుల నుంచి వివరాలు సేకరించారు. ఆర్‌ఐ దుర్గారామచంద్రమూర్తి, ఆరోగ్య సిబ్బంది మట్టపర్తి వెంకటేశ్వరరావు, సాధనాల వెంకట్రావు, పెచ్చెట్టి వెంకటేశ్వరరావు కుటుంబసభ్యులను పరామర్శించి ప్రగాడ సానుభూతి తెలిపారు.