నిప్పుల కొలిమిలో సమిధలు
నిప్పుల కొలిమిలో సమిధలు
Published Thu, May 18 2017 11:44 PM | Last Updated on Tue, Sep 5 2017 11:27 AM
- గత వారంలో మరణించిన వారు 30 మంది
- అధికారికంగా మృతులు ఏడుగురేనట
- ఆపద్బంధు పథకం కింద ఆదుకుంటున్న తెలంగాణా సర్కారు
- ఆ ఊసే ఎత్తని బాబు ప్రభుత్వం
సాక్షి ప్రతినిధి, కాకినాడ : నిప్పుల కుంపటిగా జిల్లా మారింది. భానుడి ఉగ్రరూపంతో జనం పిట్టల్లా రాలిపోతున్నారు. పగటి ఉష్ణోగ్రతలు ఒకేసారి అమాంతం పెరిగిపోవడంతో ప్రజలు అల్లాడిపోతున్నారు. ప్రధానంగా వృద్ధులు, చిన్నారులైతే ప్రాణాలు అరచేతపట్టుకుని దిదదిన గండంగా గడుపుతున్నారు. గత వారం రోజులుగా వేడి గాలులతో ఉదయం 11 గంటల తరువాత ఇంటి నుంచి బయటకు రాలేకపోతున్నారు. రోడ్లన్నీ నిర్మానుష్యంగా మారిపోతున్నాయి. రోడ్డుమీదకు రావాలంటేనే హడలెత్తిపోతున్నారు. ఇళ్లల్లో ఉన్నా ఎండ వేడి తట్టుకోలేక కకావికలమవుతున్నారు. ఎండల తీవ్రత ఒకేసారి పెరిగిపోవడంతో వడదెబ్బ మృతుల సంఖ్య ఆందోళనకు గురిచేస్తోంది. సామాన్య, మధ్య తరగతి అనే తేడాలేకుండా కూలీ నాలీ చేసుకునే వారు కూడా పనుల్లోకి వెళ్లలేక ఇళ్లకే పరిమితమవుతున్నారు.
గడచిన వారం రోజులుగా మృతుల సంఖ్య కలవరపెడుతోంది. ప్రతి రోజూ వడ దెబ్బకు గురై ఐదు నుంచి పది మంది చనిపోతున్నారంటే గ్రీష్మ తీవ్రత ఏ స్థాయిలో ఉందో అర్థమవుతోంది. గడచిన వారం రోజులుగా జిల్లాలో వడదెబ్బతో మృతి చెందిన వారి సంఖ్య 30కి పైగానే ఉంది. బుధవారం ఒక్కరోజే పది మంది మృతి చెందగా, గురువారం ఐదుగురు వరకు మృతి చెందారు. వడదెబ్బ మృతుల్లో ఉపాధి కూలీలు కూడా నమోదవుతున్నారు. ఎండలు పెరిగిపోతున్న క్రమంలో ఉదయం 11 గంటలకే ఉపాధి పనులు కట్టేయాలని జిల్లా కలెక్టర్ కార్తికేయ మిశ్రా ఇటీవల ఆదేశాలు జారీచేశారు. కలెక్టర్ ప్రకటన జారీచేసి మూడు రోజులైనా ఇప్పటికీ కొన్ని ప్రాంతాల్లో 12 గంటల వరకు ఉపాధి పనులు చేస్తున్నట్టు మండలాల నుంచి అందుతున్న సమాచారం రుజువు చేస్తోంది.
సాయం ఊసెత్తని సర్కారు...
ఎండలు తీవ్రత పెరిగిపోయి మృతుల సంఖ్య పెరుగుతున్నా కనీసం మానవతా దృక్పధంతో బాధిత కుటుంబాలను ఆదుకోవల్సిన ప్రభుత్వం ‘సాయం’ ఊసెత్తడం లేదు. గత ఏడాది వడదెబ్బ మృతులకు ప్రభుత్వం రూ.లక్ష ప్రకటించింది. సవాలక్ష నిబంధనలతో చివరకు కంటితుడుపు చర్యగా నామమాత్రపు పరిహారమే అందజేసింది. ఈ ఏడాది మృతుల విషయంలో ఏమి చేస్తుందో స్పష్టం చేయడం లేదు. తెలంగాణా ప్రభుత్వం వడదెబ్బ మృతులకు ఆపద్బంధు పథకం ద్వారా పరిహారం ఇవ్వాలని నిర్ణయించగా మన సర్కార్ ఇప్పటికీ బయటపడకపోవడం విమర్శలకు తావిస్తోంది. సాధారణంగా వడదెబ్బ మృతుల నిర్ధారణ కోసం బంధువులు స్థానిక పోలీసు స్టేషన్లో ఫిర్యాదు చేయాలి. మృతదేహానికి రెవెన్యూ శవపంచనామా, పోస్టుమార్టం నిర్వహించి త్రిసభ్య కమిటీ ఇచ్చే నివేదిక ఆధారంగా వడదెబ్బ మృతిగా నమోదు చేస్తారు. కానీ జిల్లాలో ఎక్కడా ఆ విధానం సక్రమంగా అమలు కావడం లేదు. స్థానికులకు అవగహన లేకపోవడం కూడా ఇందుకు మరో కారణంగా కనిపిస్తోంది. త్రిసభ్య కమిటీ గ్రామాల్లో వచ్చిన దరఖాస్తులను పరిశీలించి సంబంధిత మృతుల ఇళ్లకు వెళ్లి విచారించి నిర్ధారించి మృతుల వివరాలను కలెక్టరుకు నివేదిక అందజేయాలి. అలా కలెక్టరేట్‌కు వెళ్లిన నివేదికలు చూస్తే ఇంతవరకు కేవలం ఏడుగురు మాత్రమే మృతి చెందినట్టు లెక్కలున్నాయి.
పరిహారం మాటేమిటి..
రెవెన్యూ, ఉపాధిహామీ అధికారులు మృతుల వివరాలు సేకరించడం తప్ప ఏమీ చేయలేకపోతున్నారు. ప్రభుత్వం పరిహారం ప్రకటించకపోవడంతో వడదెబ్బకు గురై మృతి చెందినా మృతులు బంధువులు అధికారులకు సమాచారం ఇవ్వడానికి కూడా ముందుకు రావడం లేదు. ఈ నేపథ్యంలో ప్రభుత్వం వడదెబ్బ మృతులకు పరిహారం ప్రకటించి, మృతుల వివరాలను అధికారికంగా ధ్రువీకరించాలని స్థానికులు కోరుతున్నారు. ఎండ తీవ్రతను తట్టుకునేందుకు వీలుగా అధికారికంగా జిల్లాలో ఏర్పాటు చేసిన చలివేంద్రాలు నామ్‌కేవాస్తేగా పనిచేస్తున్నాయి. జిల్లా వ్యాప్తంగా 5,483 చలివేంద్రాలు ఏర్పాటుకు ... వీటి నిర్వహణకు ప్రభుత్వం ఇంతవరకు రూ.60 లక్షలు విడుదల చేసినా అవసరాలకు మాత్రం ఉపయోగపడడం లేదన్న విమర్శలున్నాయి. వీటిని సక్రమంగా నిర్వహించినా కొంతవరకు ఉపయుక్తంగా ఉంటుందని స్థానికులు కోరుతున్నారు.
అధికారికంగా మృతులు ఏడుగురే...
గత ఏప్రిల్ నుంచి ఇప్పటి వరకు వడగాల్పులకు ఏడుగురు మృతి చెందారని జిల్లా యంత్రాంగం చెబుతోంది. త్రిసభ్య కమిటీ నివేదిక ఇంకా తమకు చేతికందితే కానీ మృతుల సంఖ్య స్పష్టంగా చెప్పలేమని జిల్లా వైద్య ఆరోగ్యశాఖాధికారి చంద్రయ్య చెబుతున్నారు. వడగాల్పులకు మృతి చెందినట్లు స్థానిక పీహెచ్‌సీ వైద్యాధికారి, తహసీల్దార్, సబ్ ఇనస్పెక్టర్లు నిర్థారించి ఆ త్రిసభ్య కమిటీ ఇచ్చే నివేదిక ఆధారంగా వడదెబ్బ మృతులను నిర్థారిస్తామన్నారు.
.
.
.
Advertisement